HIRE Bill: అమెరికాలో హైర్ బిల్లు అమల్లోకి వస్తే.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందే: కాంగ్రెస్‌

Eenadu icon
By National News Team Published : 04 Nov 2025 12:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో ప్రతిపాదించిన అంతర్జాతీయ ఉపాధి తరలింపు నిలిపివేత (హైర్) చట్టం (HIRE Bill)పై కాంగ్రెస్‌ పార్టీ (Congress) ఆందోళన వ్యక్తం చేసింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్‌ (Jai Ram Ramesh) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. 

అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన ఈ హైర్ బిల్లు సెనెట్ కమిటీ ఆన్‌ ఫైనాన్స్‌కు పంపినట్లు రమేశ్ పేర్కొన్నారు. దీని ప్రకారం.. అమెరికాలో ఉండే ఓ వ్యక్తి ఔట్‌ సోర్సింగ్‌ కింద విదేశీయులను ఉద్యోగులుగా నియమించి వారికి జీతాలు చెల్లించాల్సి వస్తే ఆ మొత్తంలో 25శాతం ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి ఉంటుందన్నారు. ఇది అమల్లోకి వస్తే.. భారత్‌పై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. ఈ బిల్లు భారత ఐటీ సేవలు, బిజినెస్‌ ప్రాసెస్‌ ఔట్‌సోర్సింగ్‌ (BPO), కన్సల్టింగ్‌, జీసీసీ (గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌)పై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందన్నారు. ఐర్లాండ్‌, ఇజ్రాయెల్‌, ఫిలిప్పీన్స్ వంటి ఇతర దేశాలు కూడా దీనికి ప్రభావితమవుతాయన్నారు. కానీ, ఎక్కువ ప్రభావం మన దేశం పైనే ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బిల్లుకు ఆమోదం లభించవచ్చు.. లభించకపోవచ్చన్నారు. ఇది ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉందన్నారు.  

బ్లూకాలర్‌ ఉద్యోగాలు చైనాకు తరలిపోయిన నేపథ్యంలో.. వైట్‌కాలర్‌ ఉద్యోగులు కూడా భారత్‌కు వెళ్లిపోకుండా ఉండేందుకే ఈ బిల్లును ప్రతిపాదించినట్లు తెలుస్తోందన్నారు. ఈ క్రమంలో అమెరికా- భారత్‌ ఆర్థిక సంబంధాలు ఇంతగా దెబ్బతింటాయని ఏడాదిక్రితం ఎవరూ ఊహించలేదన్నారు. దీనికి హైర్‌ బిల్లు మరో ఉదాహరణగా అభివర్ణించారు. 

అమెరికాలో అందించే సేవల కోసం విధులు నిర్వహించే విదేశాల్లోని ఉద్యోగుల జీతభత్యాల మొత్తాలపై 25 శాతం సుంకం విధించాలనేది ఈ చట్టం ప్రతిపాదన. అక్టోబరు 6న సెనెటర్‌ బెర్నీ మోరెనో దీన్ని సెనెట్‌లో ప్రవేశపెట్టారు. ఇది భారత్‌కు తీవ్ర నష్టమని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ పేర్కొన్నారు. హైర్‌ చట్టం అమల్లోకి వస్తే అన్నిరకాల అవుట్‌సోర్సింగ్‌ సేవల పైనా సుంకాలు విధించే అవకాశం ఉందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని