ISRO: నేడు ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ ప్రయోగం

Eenadu icon
By National News Desk Published : 02 Nov 2025 05:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మొదలైన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ

ప్రయోగ వేదికపై ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ 

సూళ్లూరుపేట, తిరుమల, న్యూస్‌టుడే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ ప్రయోగం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శనివారం సాయంత్రం మొదలైంది. ప్రయోగానికి 24 గంటల ముందు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. రాకెట్‌కు హైడ్రోజన్, హీలియం నింపే కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ కౌంట్‌డౌన్‌ ప్రక్రియను పరిశీలించారు. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ ద్వారా సీఎంఎస్‌-03 సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడడంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే వెసులుబాటు కలగనుంది. 


శ్రీవారి సేవలో ఇస్రో శాస్త్రవేత్తలు

ఆలయం ఎదుట నారాయణన్, శాస్త్రవేత్తల బృందం

రాకెట్‌ ప్రయోగం నేపథ్యంలో శనివారం తిరుమల వేంకటేశ్వరస్వామిని ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్, షార్‌ డైరెక్టర్‌ వి.ఎస్‌.పద్మకుమార్, పలువురు శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. శ్రీవారి మూలవిరాట్‌ ముందు ఉపగ్రహ నమూనాలను ఉంచి పూజలు చేయించారు. అనంతరం ఆలయం వెలుపల ఇస్రో ఛైర్మన్‌ మాట్లాడుతూ ‘ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. 4,410 కిలోల బరువున్న సీఎంఎస్‌-03 ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (జీటీవో)లోకి ప్రవేశపెట్టనున్నాం’ అని చెప్పారు. శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయం, సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ ఆలయంలోనూ పూజలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు