Devendra Fadnavis: ఫడణవీస్‌ అనే నేను.. కొలువుదీరిన ‘మహా’ ప్రభుత్వం

Eenadu icon
By National News Team Updated : 05 Dec 2024 20:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

మంబయి: మహారాష్ట్రలో (Maharashtra Assembly Elections) ‘మహాయుతి’ ప్రభుత్వం (Mahayuti Alliance) కొలువుదీరింది. భాజపా అగ్రనేత దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde), ఎన్సీపీ అగ్రనాయకుడు అజిత్‌ పవార్‌ (Ajit Pawar) ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది మూడోసారి. దక్షిణ ముంబయిలోని ఆజాద్‌ మైదాన్‌లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ వీరితో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్‌, నితిన్‌ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ సీఎంలు చంద్రబాబు నాయుడు, మోహన్‌ యాదవ్‌, యోగి ఆదిత్యనాథ్‌, భజన్‌లాల్‌ శర్మ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి 19 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

ఎన్నికల ఫలితాల తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. పలువురి పేర్లు తెరమీదకు రావడం ఉత్కంఠ రేపింది. ఈ నేపథ్యంలో ముంబయిలో బుధవారం నిర్వహించిన భాజపా కోర్‌కమిటీ సమావేశంలో ఫడణవీస్‌ పేరును ఖరారు చేయడంతో ఉత్కంఠకు తెరపడింది. మిత్ర ధర్మాన్ని పాటిస్తూ భాజపా అధిష్ఠానం శిందే, అజిత్‌ పవార్‌లకు ఉపముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. అయితే, అజిత్‌ పవార్‌ బాధ్యతలపై బుధవారమే ఓ స్పష్టత వచ్చినప్పటికీ.. శిందే డిప్యూటీ సీఎం పదవికి అంగీకరిస్తారా? లేదా అన్న దానిపై చివరి వరకు ప్రతిష్టంభన కొనసాగింది. దీనిపై శివసేన అధికారిక ప్రకటన చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.

నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాయుతి’ కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ... 233 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ కూటమి 51 చోట్ల గెలుపొందింది. భాజపా 132 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన (శిందే) 57, ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) 41 స్థానాల్లో జయకేతనం ఎగురవేశాయి. ఇకపోతే, శివసేన (ఉద్ధవ్‌) పార్టీ 20 చోట్ల విజయం సాధించగా.. కాంగ్రెస్‌  16, ఎన్సీపీ (ఎస్‌పీ) 10 స్థానాలు గెలుచుకున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ 2, జన్‌ సురాజ్య శక్తి 2, రాష్ట్రీయ యువత స్వాభిమాన్‌ పార్టీ, రాష్ట్రీయ సమాజ్‌ పక్ష, ఏఐఎంఐఎం, సీపీఎం, పీడబ్ల్యూపీఐ, ఆర్‌వీఏ చెరో ఒక స్థానం చొప్పున గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు.

గందరగోళం సృష్టించిన శిందే

ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణం చేసిన తర్వాత.. చీఫ్‌ సెక్రెటరీ ఆహ్వానం మేరకు శిందే పోడియం వద్దకు చేరుకున్నారు. ప్రమాణాన్ని ప్రారంభిస్తూ గవర్నర్‌ రాధాకృష్ణన్‌.. ‘‘ ఐ’’ అని చెప్పారు.. దానిని కొనసాగించాల్సిన శిందే.. ప్రమాణ పత్రాన్ని పక్కన పెట్టారు.  ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే లకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. దాదాపు 40 సెకెన్లపాటు శిందే ప్రసంగించిన తర్వాత.. గవర్నర్‌ జోక్యం చేసుకొని ఆపాలని చెబుతూ, ప్రమాణపత్రంపై ఉన్నదాన్ని చదవాలని సూచించగా.. ప్రమాణాన్ని కొనసాగించారు.

ఎవరికి నచ్చినట్లు వాళ్లు ప్రమాణస్వీకారం చేయడాన్ని రాజ్యాంగం అనుమతించదు. ఒక్క పదం పలకడం మర్చిపోయినందుకు రెండోసారి మళ్లీ ప్రమాణం చేసిన సందర్భాలూ ఉన్నాయి. ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఫార్మాట్‌ రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్‌లో స్పష్టంగా ఉంది. కచ్చితంగా దానినే అనుసరించాలి. అందులో కొన్ని పదాలను చేర్చడంగానీ, తీసివేయడం కానీ కుదరదు.

Tags :
Published : 05 Dec 2024 17:37 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు