‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్‌’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్‌ కీలక సూచన

Eenadu icon
By National News Team Published : 26 Jul 2024 16:01 IST
Ee
Font size
  • A
  • A+
  • A++
1 min read

దిల్లీ: దేశంలో అత్యయికస్థితి (The Emergency) విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్‌’ నివేదిక అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. దాని ప్రామాణిక కాపీని సభలో ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఆ నివేదికను బహిరంగపరచాలంటూ ఓ భాజపా ఎంపీ లేవనెత్తిన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని.. చట్టసభ సభ్యులు, పౌరులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.

ప్రజాస్వామ్యం చీకటి రోజులుగా పేర్కొనే 1975 నాటి ‘ఎమర్జెన్సీ’ కాలంలో జరిగిన దురాగతాలపై దర్యాప్తు చేసేందుకు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేసీ షా నేతృత్వంలో దర్యాప్తు కమిషన్‌ ఏర్పాటైంది. 1977లో ఏర్పాటైన ఈ కమిషన్‌.. ఆగస్టు 1978లో నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అత్యయిక స్థితి సమయంలో చోటుచేసుకున్న పలు దారుణాలను అందులో ప్రస్తావించింది. దానిని మూడు భాగాలుగా ప్రచురించారు.

ఈ అంశాన్ని ఝార్ఖండ్‌కు చెందిన భాజపా ఎంపీ దీపక్‌ ప్రకాశ్‌ రాజ్యసభలో లేవనెత్తారు. దర్యాప్తు సమయంలో 100 సమావేశాలు నిర్వహించిన షా కమిషన్‌.. 48వేల దస్త్రాలను విశ్లేషించిందన్నారు. అయితే, 1980లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆ నివేదికను నాశనం చేసిందని ఆరోపించారు. ఒక కాపీ మాత్రం ఆస్ట్రేలియాలోని నేషనల్‌ లైబ్రరీలో అందుబాటులో ఉందన్నారు. నాటి వాస్తవాలను ఆ నివేదిక వెల్లడిస్తుందని, అందుకే దానిని బహిరంగ పరచాలని డిమాండు చేశారు. ఈ క్రమంలోనే రాజ్యసభ ఛైర్మన్‌ ప్రభుత్వానికి పై సూచన చేశారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    జిల్లా వార్తలు

    లైవ్ టీవీ