కంప్యూటర్‌ మేలు కదా!

Eenadu icon
By National News Desk Updated : 01 Nov 2025 05:23 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఏడాది వయసు నిండట్లేదు... కానీ ఆ చిన్ని చేతుల్లో మొబైల్‌ మాత్రం తప్పక ఉంటోంది. చిన్న తరగతుల పిల్లలకీ బోలెడు స్కూలు ప్రాజెక్టులు. వాటిని పూర్తిచేయాలంటే ఇంటర్నెట్‌ వాడక తప్పట్లేదు. ఫోన్‌ లేదంటే తెర కాస్త పెద్దగా ఉంటుందని ట్యాబ్లెట్‌ చేతిలో పెడుతున్నాం. వేలితో చక్కగా పైకీ కిందకీ నెడుతూ పోతుంటారు. నిజానికి అక్కడ వాళ్లకి చూసేదానిపై దృష్టి ఉండదు. స్క్రోలింగ్‌ మీదే ధ్యాస ఉంటుంది. ఇది మెదడుతోపాటు మానసిక సమస్యలకీ దారితీస్తుంది అంటున్నాయి అధ్యయనాలు. అసలే టెక్నాలజీ వెనక పరుగులు పెడుతున్న తరాలివి. దీంతో సాంకేతికత ఏమాత్రం పరిచయం లేకపోయినా వెనకపడుతున్నారేమో అన్న కంగారు అమ్మానాన్నలది. పిల్లలకు నిజంగా నేర్పించాలి అంటే... కంప్యూటర్‌ మేలంటున్నారు నిపుణులు. ఇక్కడ ఏది కావాలన్నా కీబోర్డు, మౌస్‌ ఉపయోగించక తప్పదు. కీబోర్డు కీలను నొక్కడం, మౌస్‌తో కంట్రోల్‌ చేయడం వంటివాటికి కన్ను, చేయి సమన్వయం కావాలి.

పడుకుని, సోఫాలో జారగిలబడి కూర్చునే వీలు కంప్యూటర్‌తో సాధ్యమవదు. ఒక్కచోట కుదురుగా కూర్చోవాలి. ప్రభావవంతంగా కీబోర్డుని ఉపయోగించడం, ఫైల్స్‌ దాచడం, సేవ్‌ చేసుకోవడం వంటివన్నీ నేర్చుకుంటూ ఉంటారు కదా! ఒకసారి కంప్యూటర్‌ ముందు కూర్చోగానే మనసంతా నేర్చుకోవడం, కొత్తవి సృష్టించడం మీదే లగ్నమవుతుంది. దీంతో ఏకాగ్రతే కాదు మోటార్‌స్కిల్స్‌ కూడా మెరుగుపడతాయి. అయితే ఇక్కడా యూట్యూబ్‌నే తీసి చూస్తే లాభం లేదు. పెయింటింగ్, లెర్నింగ్, గేమింగ్‌ యాప్‌లను ప్రయత్నించొచ్చు. పిల్లలూ కోడింగ్‌ నైపుణ్యాలు నేర్చుకుంటున్న రోజులివి. వాటిలోనైనా చేర్చొచ్చు. కంప్యూటర్‌ ఉపయోగించి ప్రాజెక్టులు చేసే క్రమంలో వాళ్లు చేసే పరిశోధన పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుంది. మంచిదే అన్నారు కదా అని గంటలకొద్దీ దీని ముందూ కూర్చోబెట్టొద్దు. దీనికీ పరిమితి ఉండాలి. పిల్లలు ఏం చూస్తున్నారు? ఏం నేర్చుకుంటున్నారన్న పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉండాలి.       

వసుంధర డెస్క్‌

Tags :
Published : 01 Nov 2025 05:04 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు