Piyush Goyal: ట్రంప్‌ సుంకాల మోత.. పార్లమెంటులో పీయూష్‌ గోయల్‌ ప్రకటన

Eenadu icon
By National News Team Published : 31 Jul 2025 18:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్: భారత్‌ నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై 25 శాతం పన్నులతోపాటు అదనంగా పెనాల్టీలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటన చేశారు. సుంకాల ప్రభావాలపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పదేళ్లలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్‌ పయనిస్తోందన్న అంశాన్ని గుర్తుచేశారు.

‘‘ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతీకార సుంకాలపై కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. భారత్‌ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వచ్చేలా షెడ్యూల్‌ చేశారు. అనంతరం దాన్ని 90 రోజులపాటు తాత్కాలికంగా వాయిదా వేశారు. అప్పటివరకు 10 శాతం సుంకాలు విధించారు. ఆపై ఆగస్టు 1 వరకు పొడిగించారు. ఇరుదేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన ‘ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం’ కోసం మార్చిలో చర్చలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్- నవంబర్ నాటికి ఒప్పందం మొదటి దశను పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని పీయూష్‌ గోయల్‌ తెలిపారు.

రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తే భారీగా సుంకాలు విధిస్తామని భారత్‌ సహా పలు దేశాలను ఇటీవల పలుమార్లు అమెరికా హెచ్చరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఇదే కారణాన్ని చూపుతూ.. భారత్‌ ఉత్పత్తులపై 25శాతం సుంకంతోపాటు, పెనాల్టీలు కూడా విధించింది. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్‌ ఒకటని ట్రంప్‌ ఆరోపించారు. రష్యా నుంచి దిగుమతుల కారణంగా యూఎస్‌ పెనాల్టీలకు గురైన తొలి దేశం భారత్‌. రష్యాతో భారత్‌ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా తనకు సంబంధం లేదని.. వారి ఆర్థిక వ్యవస్థలను మరింత పతనం చేసుకుంటున్నాయని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు