Bihar Political Crisis: జేడీయూకు బలం ఉందా? ఎవరి దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు?

Bihar Political Crisis: బిహార్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో ఏ పార్టీకి ఎంత బలం ఉందో చూద్దాం!

Updated : 28 Jan 2024 14:59 IST

పట్నా: బిహార్‌లో రాజకీయాలు క్షణక్షణం (Bihar Political Crisis) ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఆర్జేడీతో బంధం తెంచుకున్న సీఎం నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) నేతృత్వంలోని జేడీయూ.. భాజపాతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. నీతీశ్‌ సీఎం పదవికి రాజీనామా చేయడంతో.. సాయంత్రం కల్లా కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎవరికి ఎన్ని సీట్లున్నాయి? ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సభ్యుల సంఖ్య జేడీయూ వద్ద ఉందా? చూద్దాం...

243 స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీలో (Bihar Political Crisis) లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా ఉంది. దానికి 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు కావాలి. అందుకు ఆర్జేడీకి ఇంకా 43 మంది సభ్యులు కావాల్సి ఉంటుంది. మరోవైపు 78 మంది ఎమ్మెల్యేలతో భాజపా రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. జేడీయూకు 45 మంది సభ్యులున్నారు. నీతీశ్‌ భాజపాతో కలిస్తే వారి కూటమికి 123 మంది ఎమ్మెల్యేల బలం లభిస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య సరిపోతుంది. నలుగురు సభ్యులున్న హిందూస్థానీ ఆవామ్‌ మోర్చా (సెక్యులర్‌) కూడా భాజపాకు మద్దతిస్తోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఢోకా ఉండదు. ఇప్పటికే భాజపా ఎమ్మెల్యేలు నీతీశ్‌కు (Nitish Kumar) మద్దతిస్తూ లేఖలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు మీడియాకు సమాచారమిచ్చాయి. ఆర్జేడీ మంత్రుల స్థానంలో భాజపా సభ్యులు ప్రమాణం చేసే అవకాశం ఉంది.

మరోవైపు ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. ఇంకా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటుంది. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ ఇప్పటికే తాము కూడా సర్కార్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని సంకేతాలిచ్చారు. కాంగ్రెస్‌, వామపక్షాలతో కలిసి ఆ కూటమికి 114 మంది సభ్యుల బలం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని