BJP: దిల్లీకి వచ్చిన సీఎంను అవమానిస్తారా..? రాహుల్‌పై భాజపా విమర్శలు

Eenadu icon
By National News Team Published : 11 Jul 2025 17:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటకలో అధికార మార్పుపై వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) గురువారం పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)ని కలవడానికి దిల్లీ వెళ్లగా ఆయనకు అపాయింట్‌మెంట్‌ లభించలేదు. దీంతో రాహుల్‌ గాంధీపై భాజపా (BJP) విమర్శలు గుప్పించింది. సొంత పార్టీ సీనియర్‌ నేత, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్య దేశ రాజధానికి వస్తే.. రాహుల్‌ ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా అవమానించి పంపించేశారని భాజపా నేత అమిత్‌ మాలవీయ అన్నారు.

కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులను గాంధీ కుటుంబం అవమానించడం ఇదే మొదటిసారి కాదని మాలవీయ పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరేంద్ర పాటిల్‌ (Veerendra Patil)ను ఆ పార్టీ ఇదే విధంగా అవమానించిందన్నారు. ఆయనను అప్పట్లో రాజీవ్‌ గాంధీ (Rajiv Gandhi).. అప్రజాస్వామికంగా సీఎం పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు. అందువల్లే నాడు కర్ణాటకలో కాంగ్రెస్‌ బలహీనపడిందన్నారు. ఇప్పుడు సిద్ధరామయ్యపై కుట్ర పన్ని డీకే శివకుమార్‌ సీఎం పీఠాన్ని లాక్కోవాలని చూస్తున్నా.. రాహుల్‌ మాత్రం ఈ విషయంపై ఆయనతో చర్చలు జరపడానికి అవకాశం ఇవ్వకుండా అవమానించారని అన్నారు.

కర్ణాటకలో సీఎం పీఠం మార్పుపై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యకు రాహుల్‌ గాంధీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం విమర్శలకు దారి తీసింది. అయితే ఇటీవల కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీతో భేటీ కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు