ISRO: ‘సీఎంఎస్‌-03’ ప్రయోగం విజయవంతం.. నిర్ణీత కక్ష్యలోకి భారీ ఉపగ్రహం

Eenadu icon
By National News Team Updated : 02 Nov 2025 18:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) నిర్వహించిన ‘సీఎంఎస్‌-03’ ప్రయోగం విజయవంతమైంది. ‘ఎల్‌వీఎం3-ఎం5’ వాహక నౌక ద్వారా ఈ సమాచార ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (జీటీవో)లోకి శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ ప్రకటన చేశారు. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఆదివారం సాయంత్రం 5.26 నిమిషాలకు ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉపగ్రహం బరువు 4,410 కిలోలు. భారత భూభాగం నుంచి స్వదేశీ రాకెట్‌ ద్వారా ఈ కక్ష్యలోకి ప్రయోగించిన శాటిలైట్లన్నింటిలోకీ ఇదే అత్యంత బరువైనది.

‘‘సీఎంఎస్‌-03 ప్రయోగం విజయవంతం కావడం ఆనందంగా ఉంది. ఇందులో కీలకపాత్ర పోషించిన అందరికీ అభినందనలు. ఈ ప్రయోగంతో భారత్‌ మరో ఘనత సాధించింది. శాస్త్రవేత్తలు, సిబ్బంది కృషి వల్లే ఇదంతా సాధ్యమైంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా ఇస్రో అడుగులు వేస్తోంది’’ అని ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు.

మన సాగరశక్తికి నింగి నుంచి దన్ను

సీఎంఎస్‌-03 ఉపగ్రహం ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడటంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే వెసులుబాటు కలగనుంది. ప్రధానంగా భారత నౌకాదళం కోసం దీన్ని రూపొందించారు. సాగర జలాల్లో మోహరించిన మన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, భూ నియంత్రణ కేంద్రాలతో భద్రమైన కమ్యూనికేషన్లు సాగించేందుకు ఈ శాటిలైట్‌ తోడ్పాటు అందిస్తుంది. భారత తీరం నుంచి 2వేల కిలోమీటర్ల దూరం వరకూ విస్తరించిన సాగరజలాల్లో సేవలు అందించగలదు. దీన్ని జీశాట్‌-7ఆర్‌ అని కూడా పిలుస్తారు. 2013 నుంచి సేవలు అందిస్తున్న జీశాట్‌-7 స్థానంలో దీన్ని ప్రయోగించారు.

Tags :
Published : 02 Nov 2025 17:30 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని