Kharge: కర్ణాటక సీఎం మార్పు.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఏమన్నారంటే?

Eenadu icon
By National News Team Published : 30 Jun 2025 16:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

బెంగళూరు: కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar) మరో మూడు నెలల్లో సీఎం పదవి స్వీకరిస్తారంటూ పార్టీకి చెందిన పలువురు నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయం గురించి మీడియా కాంగ్రెస్‌ (Congress) అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను (Mallikarjun Kharge) ప్రశ్నించగా.. ముఖ్యమంత్రి మార్పుపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం పార్టీ అధిష్ఠానం చేతిలోనే ఉంటుందని చెప్పడం గమనార్హం. అంతే కాకుండా హైకమాండ్‌లో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదని..వారి నిర్ణయాల గురించి ఎవరూ చెప్పలేరని అన్నారు. ఈ విషయంపై ఎవరూ అనవసర సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించవద్దని కోరారు.

ఖర్గే వ్యాఖ్యలపై భాజపా (BJP) నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి మించిన అధిష్ఠానం ఆ పార్టీలో ఇంకేముంటుందని భాజపా ఎంపీ తేజస్వీ సూర్య ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్‌ హైకమాండ్‌ రూపురేఖలు లేనిది. అది ఎవరికీ కనిపించదు, వినిపించదు. కానీ అది ఉన్నట్లు అందరూ అనుభూతి చెందుతారు. ఇన్నాళ్లు కాంగ్రెస్‌ అధిష్ఠానం అని ప్రజలు భావిస్తున్న పార్టీ అధ్యక్షుడు కూడా అది తాను కానని అంటున్నారు’’ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్.ఎ. ఇక్బాల్ హుస్సేన్ ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మరో రెండు, మూడు నెలల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశముందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ఎవరు కృషి చేశారో అందరికీ తెలుసని.. ప్రస్తుతం పార్టీ అధిష్ఠానం శివకుమార్‌ గురించే మాట్లాడుతోందన్నారు. సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ‘విప్లవాత్మక’ పరిణామాలు నెలకొంటాయని కర్ణాటక మంత్రి కె.ఎన్. రాజన్న కూడా ఇటీవల పేర్కొన్నారు. దీంతో త్వరలోనే నాయకత్వ మార్పు తథ్యమని అధికార పార్టీలోనూ విస్తృత చర్చ నడుస్తోంది.

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు రెండున్నరేళ్ల పాటు పదవిలో కొనసాగేలా అంగీకారానికి వచ్చారనే వార్తలూ వచ్చాయి. పలు కేసుల్లో సిద్ధరామయ్య పేరు బయటకు రావడంతో సీఎంగా ఆయనను తొలగించాలని డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. శివకుమార్‌ కూడా ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తాననే బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో నాయకత్వ మార్పుపై చర్చలు మొదలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు