Heart Attack: ఒకే జిల్లాలో 20కి పైగా గుండెపోటు మరణాలు.. సీఎం సిద్ధరామయ్య ఆందోళన

Eenadu icon
By National News Team Updated : 01 Jul 2025 18:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

బెంగళూరు: యువతలో గుండెపోటు మరణాల(Heart Attack Deaths)పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  గత నెలలో ఒక్క హసన్‌ జిల్లాలోనే ఇరవై మందికి పైగా గుండెపోటు కారణంగా మరణించినట్లు వెల్లడించారు. ఈ  వరుస మరణాలకు కచ్చితమైన కారణాన్ని గుర్తించి పరిష్కారాలను కనుగొనేందుకు జయదేవ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ కార్డియోవాస్కులర్‌ సైన్సెస్ అండ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్రనాథ్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం వెల్లడించారు. పది రోజుల్లో అధ్యయన నివేదికను సమర్పించాలని ఆ కమిటీకి సూచించినట్లు ‘ఎక్స్‌’లో తెలిపారు.

 యువకులలో ఆకస్మిక మరణాలకు గల కారణాలు, కొవిడ్‌ టీకాలు ఏమైనా ప్రతికూల ప్రభావాలను చూపుతాయా? అనే అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని ఇదే కమిటీకి ఫిబ్రవరిలోనే ఆదేశాలు ఇచ్చామని.. ఈ విషయంలో గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారిని పరీక్షించడం, సమస్యలను విశ్లేషించడం కొనసాగుతోందన్నారు.  చిన్నారులు, యువత, అమాయక ప్రజల జీవితాలకు తమకెంతో ముఖ్యమన్న సీఎం సిద్ధరామయ్య.. ఇలాంటి విషయాలను సైతం భాజపా నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు.

హసన్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా ఆకస్మిక మరణాల వెనుక ఉన్న అసలు కారణాలను గుర్తించేందుకు, వాటిని నివారించేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఈ లక్ష్యంతోనే ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు ఇప్పటికే ‘హృదయ జ్యోతి’, ‘గృహ ఆరోగ్య’ వంటి పథకాలను అమలు చేసినట్లు పేర్కొన్నారు. డాక్టర్‌ రవీంద్రనాథ్‌ మార్గదర్శకత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు  చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఛాతిలో నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Tags :
Published : 01 Jul 2025 17:35 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు