Bengaluru stampede: ‘వాళ్లు ఆహ్వానిస్తేనే అక్కడికి వెళ్లా..’: ఆర్సీబీ ఈవెంట్‌పై సిద్ధరామయ్య కామెంట్స్‌

Eenadu icon
By National News Team Published : 09 Jun 2025 00:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

బెంగళూరు: ఆర్సీబీ విజయోత్సవం వేళ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట పెను విషాదం రేపిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోగా, 47మంది గాయపడ్డారు. దీంతో సిద్ధరామయ్య సర్కార్‌ తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.  ఈ ఘటనపై ఇప్పటికే కొందరిని అరెస్టు చేసిన పోలీసులు.. తదుపరి దర్యాప్తు  కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ (కేఎస్‌సీఏ) సభ్యులు ఆహ్వానిస్తేనే తాను ఆర్సీబీ ఈవెంట్‌కు వెళ్లానన్నారు. అంతే కాకుండా ఈ కార్యక్రమానికి గవర్నర్‌ సైతం హాజరవుతున్నారంటూ తనకు వారు చెప్పారని సీఎం తెలిపారు. 

‘‘కేఎస్‌సీఏ కార్యదర్శి, కోశాధికారి నా వద్దకు వచ్చి ఆర్సీబీ ఈవెంట్‌కు ఆహ్వానించారు. ఈ వేడుకను మేం నిర్వహించలేదు.. కేఎస్‌సీఏ మాత్రమే ఏర్పాటు చేసింది. గవర్నర్‌ సైతం వస్తున్నారని నాతో వారు చెప్పారు. నన్ను ఆహ్వానించిన తర్వాతే నేనక్కడికి వెళ్లాను.  వాళ్ల ఆహ్వానం మేరకు వెళ్లడం తప్ప నాకు ఇంకేమీ తెలియదు. అసలు స్టేడియం వద్దకు నన్ను ఆహ్వానించలేదు’’ అని సీఎం అన్నారు.

చిన్నస్వామి స్టేడియం సమీపంలోని కర్ణాటక విధాన సౌధ వద్ద క్రికెటర్లకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. వీఐపీల రాకతో 5వేల మంది పోలీసు బలగాలు చీలడంతో ఆ తర్వాత కొద్దిసేపటికే స్టేడియం వద్ద తొక్కిసలాటకు దారి తీసిందని భాజపా పేర్కొంటోంది. ఇదిలా ఉండగా.. ఈ కార్యక్రమానికి అనూహ్యంగా భారీ స్థాయిలో జనం రావడం, పోలీసులు అదుపు చేయలేకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులను సస్పెండ్‌ చేసింది.

మరోవైపు, చిన్నస్వామి మైదానం వెలుపల తొక్కిసలాటలో 11 మంది మరణించిన ఘటనకు నైతిక బాధ్యత వహించి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంస్థ కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఈఎస్‌ జైరామ్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ఘటనలో తమ పాత్ర ఏమీ లేకపోయినా, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నామని కేఎస్‌సీఏ అధ్యక్షుడు రఘురామ్‌ భట్‌కు పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు