
Corona: కొవిడ్ లక్షణాలతో సింహం మృతి?
చెన్నై: కరోనా మహమ్మారి జంతువులపైనా పంజా విసురుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని వందలూర్‌లో గల అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్‌లోని ఓ మగసింహం కరోనా లక్షణాలతో మరణించింది. అనారోగ్యంతో మృతిచెందిన ఆ సింహం నుంచి సేకరించిన నమూనాను భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ సెంటర్‌కు పంపినట్లు జూ అధికారులు తెలిపారు. అయితే ఆ సింహం కొవిడ్ లక్షణాలతోనే మృత్యువాత పడినట్లు ఫలితాల్లో వెల్లడైంది. కానీ జూ అధికారులు మాత్రం సింహానికి కరోనా సోకలేదంటున్నారు. ఇతర అనారోగ్య కారణాలతో మృతిచెంది ఉండవచ్చని పేర్కొంటున్నారు.
మృతిచెందిన ఆ సింహం గతవారం నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో దానికి కరోనా సోకిందేమోనని పశువైద్యులు అనుమానించారు. ఆ సింహం నమూనాలను భోపాల్‌లోని పరీక్షా కేంద్రానికి పంపించారు. కాగా మరికొన్ని సింహాలు కూడా మహమ్మారి బారిన పడినట్లు సన్నిహితవర్గాలు వెల్లడించాయి.