PM Modi: చనిపోయిన నా తల్లిని అవమానించారు.. అభ్యంతరకర వ్యాఖ్యలపై మోదీ ఆవేదన

Eenadu icon
By National News Team Updated : 02 Sep 2025 14:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిహార్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) నిర్వహించిన ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’లో కొందరు వ్యక్తులు ప్రధాని మోదీ (PM Modi) తల్లిని దూషించారంటూ భాజపా ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా మోదీ స్పందించారు. ఆర్జేడీ- కాంగ్రెస్‌లు నిర్వహించిన పలు సమావేశాల్లోను, వేదికల పైనా చనిపోయిన తన తల్లిని అవమానిస్తూ మాట్లాడారని, ఆమెకు అవమానం జరిగిందని ప్రధాని ఆవేదన వ్యక్తంచేశారు.

బిహార్‌ రాజ్య జీవికనిధి శాఖ సహాయ సంఘ్‌ లిమిటెడ్‌ను మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం దాదాపు 20 లక్షల మంది మహిళలను ఉద్దేశించి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొన్నిరోజుల క్రితం బిహార్‌లో ఆర్జేడీ- కాంగ్రెస్‌ల వేదికపై తన తల్లిని ఉద్దేశిస్తూ కొందరు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ వ్యాఖ్యలు కేవలం తన తల్లికి జరిగిన అవమానం మాత్రమే కాదని, దేశంలోని తల్లులు, సోదరీమణులకు జరిగిన అవమానమన్నారు. ఇవి తనను ఎంతో బాధించాయని మోదీ పేర్కొన్నారు. బిహార్‌ ప్రజలు కూడా తనలాగే బాధ పడ్డారనే విషయం కూడా తెలుసన్నారు. 

దివంగత మాతృమూర్తి హీరాబెన్‌ మోదీ తనను, తోబుట్టువులను పెంచేందుకు ఎంతో కష్టపడ్డారన్నారు. ‘అమ్మ అనారోగ్యంతో ఉండేది. అయినా మమ్మల్ని పెంచేందుకు పనిచేస్తూనే ఉండేది. మాకు దుస్తులు కొనేందుకు ప్రతి పైసా ఆదా చేసేది. మన దేశంలో అలాంటి తల్లులు కోట్లాది మంది ఉన్నారు. దేవతల కంటే తల్లి స్థానం చాలా గొప్పది’ అని మోదీ పేర్కొన్నారు. ఈసందర్భంగా రాజ కుటుంబాల్లో పుట్టిన యువరాజులు.. పేద తల్లి బాధలు, ఆమె కుమారుడు చేసే పోరాటాలను అర్థం చేసుకోలేరంటూ రాహుల్‌, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లను ఉద్దేశిస్తూ విమర్శించారు. వారంతా గోల్డెన్‌స్పూన్‌తో పుట్టారని, బిహార్‌లో అధికారం తమ కుటుంబాలకే దక్కాలనే స్వార్థంతో ఉన్నారని విమర్శించారు. ప్రజలు ఈ పేద తల్లి కుమారుడిని ఆశీర్వదించి, ప్రధానిని చేశారన్నారు. దీన్ని నామ్‌దార్లు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. 

బిహార్‌లో ఇటీవల కాంగ్రెస్‌ నిర్వహించిన ఓ సభలో కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు మోదీ, ఆయన తల్లిని దూషిస్తూ వ్యాఖ్యలు చేశారని భాజపా ఆరోపించింది. దీనికి సంబంధించి పార్టీ నేతలు పట్నాలోని కొత్వాలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఈమేరకు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల మాట్లాడుతూ.. దీనిపై రాహుల్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags :
Published : 02 Sep 2025 13:34 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని