India-China: లద్దాఖ్‌ భూభాగంలో చైనా కౌంటీలు.. దురాక్రమణను అంగీకరించబోమన్న భారత్‌

Eenadu icon
By National News Team Updated : 22 Mar 2025 09:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: భారత్‌తో సరిహద్దు వివాదం పరిష్కారానికి ఓవైపు చర్చల దిశగా ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. చైనా (China) మరోసారి కవ్వింపులకు పాల్పడింది. లద్దాఖ్‌ (Ladakh) భూభాగంలోని కొన్ని ప్రాంతాల్లో కౌంటీలను ఏర్పాటుచేస్తోంది. ఈ విషయంపై భారత్‌ (India) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి దురాక్రమణను ఎన్నటికీ అంగీకరించబోమని  స్పష్టంచేసింది. 

‘‘చైనా రెండు కొత్త కౌంటీలను (China counties in Ladakh) ఏర్పాటుచేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఆ కౌంటీల్లోని కొన్ని భాగాలు లద్దాఖ్‌ పరిధిలోకి వస్తాయి. భారత భూభాగాలను ఆక్రమించడాన్ని మేం ఎన్నటికీ అంగీకరించబోం. భారత సార్వభౌమాధికారానికి సంబంధించి మా దీర్ఘకాల, స్థిరమైన వైఖరిపై ఈ కౌంటీల ఏర్పాటు ఎలాంటి ప్రభావం చూపించదు. ఈ చర్యలు.. చైనా చేపడుతున్న బలవంతపు ఆక్రమణలకు చట్టబద్ధతను కల్పించలేవు’’ అని కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ పార్లమెంట్‌కు వెల్లడించారు. దీనిపై భారత్‌ నిరసనను దౌత్యమార్గాల ద్వారా తెలియజేశామని పేర్కొన్నారు.

చైనా కౌంటీల నిర్మాణంపై కేంద్రానికి సమాచారం ఉందా?అన్న ప్రశ్నకు బదులిస్తూ విదేశాంగ శాఖ ఈ మేరకు వివరణ ఇచ్చింది. కౌంటీలతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో చైనా చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కూడా తమకు సమాచారం ఉందని వెల్లడించింది. ఈ సందర్భంగా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల పురోగతిపై భారత్‌ ప్రత్యేక దృష్టి సారించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

‘‘భారత వ్యూహాత్మక, భద్రతా అవసరాలకు అనుగుణంగా సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అదనపు దృష్టి సారిచాం. ఇందుకోసం గత దశాబ్ద కాలంలో బడ్జెట్‌ కేటాయింపులను కూడా పెంచాం. సరిహద్దు రహదారుల సంస్థకు గతంలో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా నిధులు అందిస్తున్నాం. సొరంగాలు, వంతెనలను నిర్మిస్తున్నాం’’ అని కీర్తి వర్ధన్‌ సింగ్‌ తన సమాధానంలో పేర్కొన్నారు.

Tags :
Published : 22 Mar 2025 08:14 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని