Modi: ఆ వీడియో పెట్టి రెచ్చగొడతారా..? తేజస్వి ఫిష్ మీల్‌పై మోదీ ఫైర్‌

Eenadu icon
By National News Team Published : 12 Apr 2024 13:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దిల్లీ: ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) చేప వీడియోపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. వసంత నవరాత్రి సమయంలో ఇదేంటని పలువురు భాజపా నేతలు ప్రశ్నించారు. తేజస్వీ యాదవ్‌ ‘సీజనల్‌ సనాతన వాదని’, ఆయన బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ విమర్శించారు.  ఈ వీడియోపై ప్రధాని మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎవరు ఏం తిన్నా మాకు సమస్య లేదు. కానీ విశ్వాసాలను రెచ్చగొట్టే వారిని నేను వ్యతిరేకిస్తాను. వారు నవరాత్రుల సమయంలో మాంసాహారం తింటారు. ఆ వీడియోలను చూపిస్తూ ప్రజలను ఆటపట్టిస్తారు’’ అని విమర్శించారు. శుక్రవారం జమ్మూకశ్మీర్ పర్యటనకు వెళ్లిన ప్రధాని.. ఉదంపుర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఈ విధంగా స్పందించారు.

అలాగే అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ గైర్హాజరుకావడాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. ‘‘రామ మందిరం అనేది భాజపాకు ఎన్నికల అంశం అని కాంగ్రెస్ చెప్తోంది. కానీ అది ఎప్పటికీ ఎన్నికల అంశం కాదని స్పష్టం చేయాలనుకుంటున్నా. భాజపా అనేది లేకముందే ఈ మందిరం కోసం పోరాటం జరిగింది. విదేశీ దురాక్రమణదారులు మన ఆలయాలను ధ్వంసం చేసినప్పుడు.. మతపరమైన ప్రాంతాలను రక్షించుకునేందుకు భారత ప్రజలు పోరాడారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు పెద్దపెద్ద బంగ్లాల్లో ఉంటారు. కానీ రామ్‌లల్లా టెంట్ మార్చే విషయానికి కొచ్చేసరికి వెనుదిరిగారు’’ అని దుయ్యబట్టారు.

ఆ రోజు ఎంతో దూరంలో లేదు: మోదీ

త్వరలో జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రహోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఆ రోజు ఎంతో దూరంలోలేదని, ప్రజలు తమ ఆకాంక్షలు వారి ఎమ్మెల్యేలు, మంత్రులతో పంచుకోవచ్చని వెల్లడించారు. ‘‘నన్ను నమ్మండి. గత 60 ఏళ్లుగా జమ్మూకశ్మీర్‌ను పట్టి పీడిస్తున్న సమస్యను దూరం చేస్తాను’’ అని వెల్లడించారు. ఉగ్రవాద భయం, రాళ్లదాడులు, సీమాంతర కాల్పులు వంటివి లేకుండా రానున్న లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు