Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం.. భాజపా తీర్థం పుచ్చుకుంటారని విమర్శలు

Eenadu icon
By National News Team Published : 03 Sep 2025 08:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వర్గీయుల మధ్య కాక చల్లారడం లేదు. పార్టీని వీడి భాజపా తీర్థం పుచ్చుకుంటారని ఇరువురి మద్దతుదారులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి కేఎన్‌ రాజన్న భాజపాలో చేరబోతున్నారంటూ ఇటీవల ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. రాజన్న రాష్ట్ర సహకార మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాహుల్‌ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలపై వ్యతిరేక గళం వినిపించడంతోనే ఆయనను పదవి నుంచి తప్పించారనే ఆరోపణలు వినిపించాయి. 

తన తండ్రి రాజన్న పార్టీ మారుతున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ రాజేంద్ర రాజన్న తీవ్రంగా స్పందించారు. భాజపాలో చేరే బృందంలో బాలకృష్ణ ఉన్నారని ప్రత్యారోపణలు చేశారు. సీఎం పదవి కోసం పాకులాడుతున్న నేత(డీకే శివకుమార్‌) వెంట వెళ్లబోతున్నారని జోస్యం చెప్పారు. ఈసందర్భంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌(DK Shivakumar) పేరు ప్రస్తావించకుండానే రాజేంద్ర పలు విమర్శలు చేశారు. తన తండ్రికి వ్యతిరేకంగా ఆయన కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తాము సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితులం కాబట్టే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. 

రాజన్న పదవి పోవడం వెనక కొందరి ‘రహస్య హస్తం’ ఉందని రాజేంద్ర రాజన్న ఆరోపించారు. ‘కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని రాజన్న చెప్పారు. కాంగ్రెస్‌(Congress) వల్లే పదవి దక్కిందని, చివరివరకు అందులోనే కొనసాగుతానని ఇదివరకే స్పష్టం చేశారు’ అని వెల్లడించారు. రాజన్న అసెంబ్లీలో ఆరెస్సెస్‌ గీతం పాడలేదని, చిన్నప్పటినుంచి ఆయనకు ఆరెస్సెస్‌ శాఖల గురించి తెలియదని పరోక్షంగా డీకేకు చురకలంటించారు. రాజన్న సొంత భావజాలంతో పని చేసే వ్యక్తి అని కొనియాడారు.

డీకే శివకుమార్‌ విధేయుడు హెచ్‌సీ బాలకృష్ణ ఇటీవల మాట్లాడుతూ.. మంత్రిగా రాజన్న ప్రవర్తన, వాడిన భాష ఆయన పతనానికి కారణమని విమర్శించారు. పదవి పోవడం వెనక ఎలాంటి కుట్ర లేదని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ఆయన వేరే పార్టీలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. భాజపాకు దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. అందుకే మా నాయకుడిని దూషిస్తున్నారు. అయినప్పటికీ మా నాయకుడు ఎలాంటి కుట్ర చేయలేదు. మంత్రిగా ఉన్నప్పుడు రాజన్న చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకునే అధిష్ఠానం పదవి నుంచి తప్పించింది. ఆయన పార్టీ వీడటం ఖాయం. కాంగ్రెస్‌ అధికారంలో లేకపోతే ఇప్పుడే వెళ్లిపోతారు’ అని వ్యాఖ్యానించారు. దీంతో డీకే, సిద్ధూ వర్గీయుల మధ్య దూరం మరింత పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని