Eknath Shinde: విజయగర్వం తలకెక్కించుకోవద్దు.. పార్టీ నేతలకు శిందే వార్నింగ్‌

Eenadu icon
By National News Team Published : 15 Jul 2025 08:02 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆహారం సరిగా లేదనే విషయంపై క్యాంటీన్‌ సిబ్బందితో శివసేన వర్గం ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ ఘర్షణకు దిగిన ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మహారాష్ట్ర (Maharashtra) ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) స్పందిస్తూ.. కార్యకర్తలను హెచ్చరించారు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని, విజయాన్ని తలకెక్కించుకోవద్దని సూచించారు. 

దాదర్‌లో జరిగిన ఓ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి శిందే మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘ఇటీవల కొన్ని ఘటనలు చోటుచేసుకున్నాయి. ఏది జరిగినా ప్రజలు మీపై కాకుండా నా వైపే వేలు చూపిస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రవర్తన గురించి ప్రశ్నిస్తున్నారు. పార్టీ నేతలంతా నా కుటుంబంతో సమానం. అనవసరమైన విషయాల జోలికి వెళ్లొద్దు. తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేయండి. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా కొందరు మంత్రులు పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సొంత కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ, అలా జరిగేలా చేయొద్దు. మీ అందరి నుంచి క్రమశిక్షణ, జవాబుదారీతనాన్ని ఆశిస్తున్నా.

నేను ఒక యజమానిలాగా ప్రవర్తించను. నాకు కోపం రాదు. పార్టీ కార్యకర్తలా మాత్రమే ఉంటా.. మీరూ అలాగే ఉండండి. విజయగర్వాన్ని తలకెక్కించుకోవద్దు. మీరు ఎన్ని పదవులు నిర్వర్తించినా.. ముందు కార్యకర్త అనే విషయం గుర్తుంచుకోండి. చాలా తక్కువ సమయంలోనే మనం ఎంతో సాధించాం. ప్రజలు మనతో ఉన్నారు. అది తట్టుకోలేని కొందరు మనల్ని కించపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్రమత్తంగా ఉండండి. రానున్న రోజుల్లో మనకు మరిన్ని పరీక్షలు ఎదురవుతాయి. ప్రజా జీవితం క్రమశిక్షణ కోరుతుంది. దాన్ని నిలబెట్టుకోవాలి’ అని పేర్కొన్నారు. గతంలో ఇదే ఘటనపై శిందే స్పందిస్తూ.. తాను హింసకు మద్దతు ఇవ్వనని పేర్కొన్నారు. అయితే, ఇబ్బందులు ఏమైనా ఎదురైతే చట్టపరమైన చర్య తీసుకునే హక్కు వ్యక్తులకు ఉందన్నారు. 

మహారాష్ట్రలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ముంబయిలోని ప్రభుత్వ ఆకాశవాణి అతిథిగృహంలో బుల్దానా ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ బస చేశారు. ఈ క్రమంలో ఆయన ఫుడ్‌ ఆర్డర్‌ చేశారు. తనకు ఇచ్చిన పప్పు దుర్వాసన వస్తోందని.. వెంటనే క్యాంటీన్‌ వద్దకువెళ్లి అక్కడి సిబ్బందితో వాదనకు దిగారు. వేలాది మంది ఆరోగ్యంతో క్యాంటీన్‌ నిర్వాహకులు చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. అక్కడితో ఆగకుండా క్యాంటీన్‌  నిర్వాహకుడిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అయ్యాయి. దీనిపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) స్పందిస్తూ.. ఎమ్మెల్యే చర్య ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని