Sanjay Shirsat: మంత్రి ఇంట్లో బ్యాగ్‌లో నోట్ల కట్టలు.. వైరల్‌గా మారిన దృశ్యాలు!

Eenadu icon
By National News Team Updated : 11 Jul 2025 17:49 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: మహారాష్ట్రలో ఓ మంత్రి ఇంట్లో నోట్ల కట్టలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ మినిస్టర్ ఒకవైపు బెడ్ మీద కూర్చొని రిలాక్స్ అవుతుండగా..  మరొపక్క ఓ బ్యాగ్‌ కనిపించింది. అందులో కరెన్సీ నోట్లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ దృశ్యాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..? (Maharashtra Minister Sanjay Shirsat )

మహారాష్ట్రలో అధికార కూటమిలో భాగమైన శివసేన పార్టీ నేత సంజయ్ శిర్సాట్‌ చిక్కుల్లో పడ్డారు. 2019 నుంచి 2024 మధ్యలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనకు ఆదాయపన్ను శాఖ నోటీసులు అందాయని తాజాగా వెల్లడించారు. అంతలోనే ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. దీనిని శివసేన మరోవర్గం (ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం) నేత సంజయ్ రౌత్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. తన ఇంట్లో ప్రైవేట్‌ రూమ్‌లో కూర్చొని శిర్సాట్‌ పొగ పీల్చుతూ ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించారు. ఆయన పక్కనే ఓ బ్యాగ్‌ ఉందని.. అందులో నోట్ల కట్టలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. ‘‘ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను చూస్తుంటే జాలేస్తుంది. తన పేరు గాల్లో కలిసిపోతుంటే ఇంకెన్నిసార్లు చూస్తూ ఉండిపోతారు..? నిస్సహాయతకు మరోపేరు ఫడణవీస్‌’’ అని తన పోస్టులో రౌత్‌ వ్యంగ్యంగా రాసుకొచ్చారు.

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నాయకత్వంలోని శివసేనకు చెందిన శిర్సాట్‌.. ఔరంగాబాద్‌ (వెస్ట్‌) నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం సామాజికన్యాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. తనకు ఆదాయపన్ను విభాగం నుంచి నోటీసులు అందాయని ధ్రువీకరిస్తూ నిన్న మీడియాతో మాట్లాడారు. ‘‘నాపై కొందరు ఫిర్యాదు చేయడంతో నోటీసులు అందాయి. వాటికి నేను తగిన వివరణ ఇస్తాను. నేనే తప్పు చేయలేదు’’ అని వెల్లడించారు. అంతలోనే ఈ వీడియో వెలుగులోకి రావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. తన పార్టీకి చెందిన నేతకు ఐటీ నోటీసులు అందిన సమయంలోనే ఏక్‌నాథ్‌ శిందే ముందుగా ఖరారుకాని దిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారని వార్తలు వచ్చాయి.

అది దుస్తుల బ్యాగ్‌..

ఈ వీడియో క్లిప్‌పై శిర్సాట్‌ మాట్లాడుతూ..‘‘ఆ దృశ్యాల్లో కనిపించింది మా ఇల్లే. అందులో నేను బెడ్‌రూంలో కూర్చున్నట్లుగా ఉంది. నా పెంపుడు శునకం, బ్యాగ్‌ కనిపించాయి. నేను కూర్చున్న తీరుచూస్తే.. ప్రయాణం ముగించుకొని వచ్చి, సేదతీరుతున్నానని ఎవరికైనా అర్థమవుతుంది. మీరన్నట్టు అది డబ్బుల బ్యాగ్ అయితే.. నాకు ఇంట్లో బీరువాలకు కొదవా..? దుస్తుల బ్యాగ్‌లో వారికి నోట్లు కనిపిస్తున్నాయి’’ అని విమర్శలను తోసిపుచ్చారు.

Tags :
Published : 11 Jul 2025 17:36 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు