Siddaramaiah: అనువాద లోపంపై సిద్ధరామయ్య ఫైర్‌.. మెటా క్షమాపణ

Eenadu icon
By National News Team Updated : 18 Jul 2025 08:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు మెటా (Meta) సంస్థ క్షమాపణలు తెలిపింది. ఒక పోస్టును కన్నడ నుంచి ఆంగ్లంలోకి తప్పుగా అనువాదం చేయడంపై సిద్ధరామయ్య ఫైర్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆ సంస్థ స్పందించింది. 

కన్నడ అనువాదం సరిగా లేదనే సమస్యను పరిష్కరించామని మెటా ప్రతినిధి తెలిపారు. ఇలాంటిది జరిగినందుకు క్షమాపణలు కోరుతున్నామన్నారు. అనువాదంలో ఏఐ టూల్‌ మిషన్‌ తప్పిదం వల్ల ఇలా జరిగిందని కంపెనీ ఫేస్‌బుక్‌లో పేర్కొంది. కచ్చితమైన అనువాదాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపింది. సాంకేతికతను మెరుగుపరచడానికి నిరంతరం అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని వెల్లడించింది. అసలేం జరిగిందంటే.. ఇటీవల సీనియర్‌ నటి సరోజాదేవి కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు సంతాపం తెలుపుతూ సీఎం కార్యాలయం కన్నడలో ఓ పోస్టు పెట్టింది. సీఎం సిద్ధరామయ్య బహుభాషా తార, సీనియర్‌ నటి బి.సరోజాదేవి పార్థీవదేహానికి కడసారి నివాళులర్పించారని అందులో పేర్కొంది. దీన్ని మెటా సంస్థ ఆంగ్లంలోకి తప్పుగా అనువదించింది.

సీఎం దీనిపై స్పందిస్తూ.. ఆ సంస్థపై మండిపడ్డారు. కన్నడ నుంచి ఆంగ్లలోకి అనువాదం చేయడం ఆపేయాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనివల్ల వాస్తవాలు వక్రీకరించబడతాయని, వినియోగదారులను తప్పుదారి పట్టిస్తుందన్నారు. ఈసందర్భంగా ఇలాంటివి చాలా ప్రమాదకరమైనవని ఆయన అభిప్రాయపడ్డారు. తన మీడియా సలహాదారు కేవీ ప్రభాకర్‌ తప్పును వెంటనే సరిదిద్దాలని కోరుతూ మెటాకు అధికారికంగా లేఖ రాసినట్లు వెల్లడించారు. సామాజిక మాధ్యమాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. టెక్‌ దిగ్గజాలు చేసే ఇలాంటి నిర్లక్ష్యాల కారణంగా ప్రజల్లో నమ్మకం పోతుందన్నారు. దీని పైనే తాజాగా మెటా స్పందించింది. 

Tags :
Published : 18 Jul 2025 08:32 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు