GSTProtest: చిరు వ్యాపారులకు జీఎస్టీ నోటీసులు.. రాష్ట్రవ్యాప్తంగా కాఫీ, టీ విక్రయాలు బంద్‌

Eenadu icon
By National News Team Published : 23 Jul 2025 12:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్ణాటకలో చిరు వ్యాపారులు వినూత్న నిరసనను చేపట్టారు (GSTProtest). రాష్ట్రవ్యాప్తంగా బేకరీల్లో టీ, కాఫీ, పాల విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. జీఎస్టీ అధికారులు తమను లక్ష్యంగా చేసుకొని నోటీసులు పంపిస్తున్నారంటూ వారు ఈ ఆందోళన చేపడుతున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. 

‘‘ఈరోజు మేం బ్లాక్‌ బ్యాండ్‌లను ధరించాం. ఏ బేకరీలో కూడా పాలవిక్రయాలు జరపడం లేదు. నిరసనకు గుర్తుగా బ్లాక్‌ టీ మాత్రమే అమ్ముతున్నాం’’ అని కార్మిక హక్కుల కార్యకర్త రవిశెట్టి మీడియాతో మాట్లాడారు (Karnataka Bakeries). మిగతా వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి కానీ.. బేకరీ, చిరు దుకాణాల కౌంటర్లలో నిరసనల ప్రభావం కనిపిస్తోంది. తమ అసమ్మతి తెలియజేసేలా ట్రేడర్లు బ్లాక్‌ టీ, బ్లాక్‌ కాఫీని మాత్రమే అమ్ముతున్నారు. జీఎస్టీ విభాగం నోటీసులను వెనక్కి తీసుకోకపోతే.. తమ ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో కర్ణాటక (karnataka) ప్రభుత్వం స్పందించింది. చిరు వ్యాపారుల ప్రతినిధులతో చర్చించేందుకు మధ్యాహ్నం 3 గంటలకు తన ఇంట్లోనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) సమావేశం కానున్నారు. 2021 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల మధ్య జరిగిన యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ ఆధారంగా జీఎస్టీ విభాగం ఈ డ్రైవ్‌ చేపడుతోంది. దీనికింద ఆన్‌లైన్ పేమెంట్ల విలువ రూ.20 లక్షలు (సేవలు), రూ.40 లక్షలు (వస్తువులు) దాటిన వ్యాపారులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. నాలుగేళ్లలో రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగాయని, రూ.29 లక్షల జీఎస్టీ కట్టాలని తనకు నోటీసు వచ్చిందని హవేరీ ప్రాంతానికి చెందిన కూరగాయల వ్యాపారి శంకర్‌గౌడ వెల్లడించారు.

జీఎస్టీ పరిధిలో లేని తాజా కూరగాయలనే తాను విక్రయిస్తున్నానని, ఎప్పటికప్పుడు పన్నులు చెల్లిస్తున్నానని చెప్పారు. ఇప్పుడు తాను ఆ మొత్తం ఎలా కట్టాలని వాపోయారు. ఈ డ్రైవ్‌ చిరు వ్యాపారుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. దాంతో వారు మళ్లీ నగదు విక్రయాల వైపు మొగ్గు చూపుతున్నారు. నో యూపీఐ (UPI) బోర్డులను తమ దుకాణాల ముందుంచుతున్నారు. అలాగే ఈ అంశంపై వ్యాపార సంఘాలు జులై 25న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు