Bihar Elections: భాయ్‌జాన్‌ ఎవరిపక్షం?

Eenadu icon
By National News Desk Updated : 28 Oct 2025 19:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

అందరిచూపూ ముస్లిం ఓటర్లపైనే..
భాజపా మినహా అన్ని పార్టీల ప్రయత్నం
ఒవైసీ ప్రభావం ఎంత?

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ముస్లిం (భాయీజాన్‌) ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో 20శాతంగా ఉన్న ఈ ఓటర్లు ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేయగలరు. అందుకే భాజపా మినహా అన్ని పార్టీలు వారి జపం చేస్తున్నాయి. బిహార్‌లో తొలి దశ పోలింగ్‌కు ఇంకా 10 రోజులే ఉంది. దీంతో ఎన్డీయే నుంచి ఇండియా కూటమిదాకా అన్ని పార్టీలూ ముస్లిం ఓట్లను సాధించేందుకు ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటున్నాయి.

ఎన్ని నియోజకవర్గాల్లో ప్రభావం?

బిహార్‌లోని 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20శాతానికిపైగా ముస్లిం ఓటర్లున్నారు. ఇందులో 11 సీట్లలో 40శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. 40 సీట్లలో వారు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలరు.

లెక్కలు తీసిన నీతీశ్‌ 

ఎన్నికల వేళ నీతీశ్‌ కుమార్‌.. తమ ప్రభుత్వం ముస్లిం కోసం చేపట్టిన పథకాల లెక్కలను బయటపెట్టారు. రాష్ట్రంలోని 8,000 శ్మశాన వాటికలకు ప్రహరీ గోడలను కట్టించానని చెప్పారు. మైనారిటీల సంక్షేమం కోసం 2025-26లో రూ.1,080 కోట్లను కేటాయించానని, ఇది గతంతో పోలిస్తే 306 రెట్లు అధికమని పేర్కొన్నారు. 

  • అయితే భాజపాతో జట్టు కట్టిన ఆయన ముస్లిం ఓట్లను ఎంతమేరకు సాధిస్తారనేది అనుమానమే. కేవలం నాలుగు టికెట్లే ఆయన ముస్లిం అభ్యర్థులకు ఇచ్చారు.
  • మరో ఎన్డీయే భాగస్వామి లోక్‌ జన్‌శక్తి పార్టీ (ఎల్జేపీ) అధినేత చిరాగ్‌ పాస్వాన్‌ ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 2005లో తన తండ్రి ముస్లిం ముఖ్యమంత్రి కావడం కోసం త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ముస్లిం, ఈబీసీలపై ఆర్జేడీ దృష్టి..

ఎన్డీయేలోని భాజపా.. హిందూ బెల్ట్‌లోని ఓట్లను లక్ష్యంగా చేసుకోగా.. ఆర్జేడీ.. ముస్లిం, అత్యంత వెనుకబడిన వర్గాల వారి (ఈబీసీల) ఓట్లపై దృష్టి సారించింది. దీనికి యాదవ ఓట్లనూ జోడిస్తే విజయం సాధ్యమని అంచనా వేసుకుంటోంది. 

ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ముస్లింలకు తేజస్వీ యాదవ్‌ పెద్దగా ఏమీ చేయలేదనే విమర్శలొచ్చాయి. అయినా ఆ పార్టీకి ఇప్పుడు 20 శాతం ఉన్న ముస్లిం ఓట్లు ఎంతో కీలకంగా మారాయి.

ఒవైసీ కొల్లగొట్టే ఓట్లే కీలకం

గత ఎన్నికల్లో ఒవైసీ పార్టీ ఎంఐఎం సీమాంచల్‌లోని 5 సీట్లను గెలుచుకుంది. మరో 10 చోట్ల అతి తక్కువ తేడాతో ఓడిపోయింది. ఇది ఆర్జేడీ, కాంగ్రెస్‌ కూటమిని భారీగా దెబ్బతీసింది. అధికారాన్ని దూరం చేసింది. ఈసారీ ఎంఐఎం 25 చోట్ల పోటీ చేస్తోంది.

ఇప్పటిదాకా పెదవి విప్పని ఓటరు

అన్ని పార్టీలపైనా అసంతృప్తిగా ఉన్న ముస్లింలు ఇంతవరకూ బహిరంగంగా ఏ పార్టీవైపూ మొగ్గుచూపినట్లు కనిపించలేదు. తేజస్విని ముఖ్యమంత్రి అభ్యర్థిగా, ముకేశ్‌ సాహ్నిని ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ.. ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అధికారంలోకి వస్తే మరిన్ని ఉప ముఖ్యమంత్రి పదవులు వస్తాయని వారికి నచ్చచెబుతోంది. అందులో కచ్చితంగా ముస్లిం ఉప ముఖ్యమంత్రి ఉంటారని హామీ ఇస్తోంది. కానీ దీనిపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటే అవుతుంది. బిహార్‌ రాజకీయాలను అర్థం చేసుకోవడం కష్టమే కాదు.. అసాధ్యం కూడా.

నేషనల్‌ డెస్క్‌

Tags :
Published : 28 Oct 2025 19:12 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని