Tejashwi Yadav: కన్ఫ్యూజన్ ఏమీ లేదు.. త్వరలో సీఎం అభ్యర్థి ఎవరో తెలుస్తుంది: తేజస్వీ యాదవ్‌

Eenadu icon
By National News Team Published : 16 Sep 2025 19:02 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: బిహార్‌లో ఎన్నికల వేడి (Bihar Assembly Elections) రాజుకుంది. శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార, విపక్ష కూటమి పార్టీల్లో సీట్ల పంపకాలపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. 

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారంలో మునిగిపోయాయి. తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ‘బిహార్‌ అధికార్ యాత్ర’ను ప్రారంభించారు. సందర్భంగా సీఎం అభ్యర్థి గురించి ప్రశ్న ఎదురైంది. దానిపై తమ విపక్ష కూటమిలో ఎలాంటి గందరగోళం లేదని తెలిపారు. ‘‘ప్రజలే యజమానులు. వారే ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకుంటారు. వారు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు. ఎవరు ముఖ్యమంత్రి కావాలో వారినే అడగండి. అప్పుడు సమాధానం మీకే తెలుస్తుంది’’ అని మీడియాతో మాట్లాడారు. కాగా.. ఇటీవల తేజస్వీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ.. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బిహార్‌లో తాము తిరిగి అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. అందుకోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలతో కూటమిలో విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. 

ఇదిలా ఉంటే.. బిహార్‌ (Bihar) 2020 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సీట్ల సర్దుబాటును పరిశీలిస్తే.. ఆర్జేడీ 144 స్థానాల్లో బరిలోకి దిగి 75 చోట్ల విజయం సాధించింది. మరోవైపు కాంగ్రెస్‌ 70 స్థానాలకు గానూ 19 చోట్ల గెలుపొందింది. సీపీఐ-ఎంఎల్‌ 19 నియోజకవర్గాల్లో పోటీ చేసి 12 చోట్ల గెలుపు బావుటా ఎగురవేసింది. సీపీఎం, సీపీఐ వరుసగా 4, 6 స్థానాల్లో పోటీ చేసి చెరో రెండు చోట్ల విజయం సాధించాయి. గత ఫలితాలను దృష్టిలో ఉంచుకొని, కూటమిలోని అన్ని పార్టీలకు సమన్యాయం జరిగేలా సీట్లను పంపిణీ చేసేందుకు కూటమి నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని