Tejashwi Yadav: ‘నన్నూ ఇరికిస్తారు’: భాజపాకు కర్ణాటక భయం పట్టుకుందన్న తేజస్వి

Eenadu icon
By National News Team Published : 20 May 2023 01:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

పట్నా: ఉద్యోగాలు ఇవ్వడానికి భూములు రాయించుకున్నారన్న కేసుకు సంబంధించి బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి(Rabri Devi)ని ఈడీ ప్రశ్నించడంపై ఆమె కుమారుడు, బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌(Tejashwi Yadav) స్పందించారు. ఎన్నికల్లో ఓటమి భయంలో వల్లే భాజపా దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని విమర్శించారు. 

‘ఇలా జరుగుతుందని మాకు తెలుసు. కర్ణాటక ఓటమి తర్వాత బిహార్‌(Bihar)లో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని వారు(భాజపా) భయపడుతున్నారు. అందుకే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. భవిష్యత్తులో నన్ను కూడా అందులో ఇరికించవచ్చు. కానీ అవన్నీ నేను పట్టించుకోను. నేను ఏ తప్పూ చేయలేదు. అందుకే భయపడాల్సిన అవసరం లేదు’ అని తేజస్వి మీడియాతో మాట్లాడారు.  

ఉద్యోగాలు ఇవ్వడానికి భూములు రాయించుకున్నారన్న కేసులో గురువారం రబ్రీ దేవిని ఈడీ ఐదు గంటల పాటు ప్రశ్నించింది. దిల్లీలోని దర్యాప్తు సంస్థ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. నగదు అక్రమ లావాదేవీల చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఆమె సమాధానాన్ని అధికారులు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో రబ్రీ దేవితో పాటు ఆమె కుమార్తెలు మీసా భారతి, చందా యాదవ్‌, రాగిణి యాదవ్‌, కుమారుడు తేజస్విని గతంలో ఈడీ ప్రశ్నించింది. 

2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ(UPA) హయాంలో లాలూ( Lalu Prasad Yadav) రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు