Tejashwi Yadav: గుజరాత్ వ్యక్తులకు బిహార్‌లో ఓటర్ కార్డులా..? తేజస్వీ ఆరోపణలు

Eenadu icon
By National News Team Updated : 13 Aug 2025 13:00 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Elections) సమయం దగ్గరపడుతోన్న వేళ ఈసీ ఆ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను నిర్వహించిన సంగతి తెలిసిందే (Bihar Politics). ఓటరు జాబితా నుంచి 65 లక్షల మంది ఓటర్లను తొలగించామని పేర్కొంటూ ఎన్నికల సంఘం ఇటీవల ముసాయిదా విడుదల చేసింది. దాంతో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. గుజరాత్ వ్యక్తులు బిహార్‌లో ఓటర్లుగా మారుతున్నారని తాజాగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వ్యాఖ్యలు చేశారు.

‘‘గుజరాత్‌కు చెందిన కొందరు వ్యక్తులు బిహార్‌లో ఓటు హక్కు పొందుతున్నారు. భాజపా ఇంఛార్జి భిఖుభాయ్‌ దల్సానియా పట్నా ఓటర్‌గా మారారు. 2024లో ఆయన గుజరాత్‌లో ఓటువేశారు. అక్కడ ఆయన పేరు తొలగించారు. బిహార్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన మళ్లీ ఎక్కడికి వెళ్తారు. ఇదంతా ఒక కుట్ర. ఎన్నికల కమిషన్‌తో కలిసి భాజపా మోసం చేస్తోంది’’ అని తేజస్వి తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల ఈసీ ప్రకటించిన ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) జాబితాలో తన గుర్తింపు కార్డు నంబరు కనిపించలేదని, రాష్ట్రంలో 65 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారని తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఈసీ.. అవి నిరాధారమని స్పష్టం చేసింది. ముసాయిదా జాబితాలో 416 క్రమ సంఖ్య వద్ద తేజస్వి పేరు ఉందని, ఆయన చెప్పిన కార్డు ఫోర్జరీ చేశారా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది.

ఈసీ నన్ను బామ్మని చేసింది.. ‘124 ఏళ్ల’ మింతా దేవీ!

ఎస్‌ఐఆర్‌ను సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరుగుతోంది. ఎన్నికల సంఘం(ఈసీ) చేపట్టిన ఈ కసరత్తుపై ‘విశ్వాసం కోల్పోవడమే అసలు సమస్య. అంతకుమించి ఏమీ లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వాస్తవాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘానికి (Election Commission) సూచించింది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఎంతమంది ఓటర్లు ఉన్నారు? గతంలో నమోదైన మరణాల సంఖ్య ఎంత? ఇప్పుడు నమోదు చేసిన మరణాల సంఖ్య ఎంత? వంటి వివరాలపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పింది.

Tags :
Published : 13 Aug 2025 11:31 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని