Rahul Gandhi: ట్రంప్‌ సుంకాలకు మోదీ తలొగ్గుతారు.. రాసి పెట్టుకోండి: రాహుల్

Eenadu icon
By National News Team Published : 05 Jul 2025 10:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూడు నెలల క్రితం భారత్‌పై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా (US) అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) ప్రకటించిన విషయం తెలిసిందే. 90 రోజుల విరామం తర్వాత అది అమల్లోకి రాకుండా ఉండేందుకు వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)  కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమీ ఉండదని రాహుల్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ సుంకాలకు ప్రధాని మోదీ (PM Narendra Modi) తలొగ్గుతారని.. తన మాటలు నమ్మకపోతే రాసిపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. 

అమెరికా పరస్పర సుంకాల సస్పెన్షన్‌ జులై 9న ముగియనున్నందున, ఆ గడువుకు ముందే చర్చలు పూర్తి చేయాలని ఇరుదేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) మాట్లాడుతూ.. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్‌ పటిష్ఠ విధానాలను కలిగిఉందని స్పష్టం చేశారు. గడువు ఆధారంగా కీలకమైన వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకునేందుకు దేశం ఎప్పుడూ తొందరపడదని అన్నారు. రెండు వర్గాలకు లాభదాయకంగా ఉంటేనే అంగీకరిస్తుందన్నారు.  

అమెరికాతో కుదుర్చుకోనున్న ఒప్పందంలో భాగంగా భారత్‌ కొన్ని కీలక రంగాల్లో సుంకాల నుంచి అగ్రరాజ్యాన్ని సడలింపు కోరుతోంది. ఇందులో టెక్స్‌టైల్స్‌, రత్నాలు, ఆభరణాలు, దుస్తులు, ప్లాస్టిక్స్‌, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటిపండ్లు వంటివి ఉన్నాయి. మరోవైపు అమెరికా కొన్ని పారిశ్రామిక వస్తువులు, ఆటోమొబైల్స్‌ (ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు), వైన్స్‌, పెట్రో కెమికల్‌ ఉత్పత్తులు, పాడి ఉత్పత్తులు రంగాల్లో సుంకాల సడలింపు కోరుతోంది. అయితే ఈ సడలింపులను ఆమోదిస్తే, మన దేశంలో రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయనే ఆందోళన ఉంది. ఇది రాజకీయంగా సున్నిత అంశమైనందున, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం మినహాయింపులకు భారత్‌ ససేమిరా అంటోంది. వాణిజ్య చర్చల నిమిత్తం ఇటీవల అమెరికా వెళ్లిన భారత బృందం తిరిగివచ్చింది. దీంతో అమెరికా-భారత్‌ మధ్య ఈనెల 9లోగా మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని