Atithi DevoBhava Review: రివ్యూ: అతిథి దేవోభవ
Atithi DevoBhava Review: ఆది సాయికుమర్ కథానాయకుడిగా నటించిన ‘అతిథి దేవోభవ’ సినిమా ఎలా ఉందంటే?
చిత్రం: అతిథి దేవోభవ; నటీనటులు: ఆది సాయికుమార్, నువేక్ష, రోహిణి, సప్తగిరి, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు; సంగీతం: శేఖర్ చంద్ర; కూర్పు: కార్తిక్ శ్రీనివాస్; ఛాయాగ్రహణం: అమర్‌నాథ్ బొమ్మిరెడ్డి; దర్శకత్వం: పొలిమేర నాగేశ్వర్; నిర్మాతలు: రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల; విడుదల తేదీ: 07-01-2022
‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలతో హుషారుగా మొదలు కావాల్సిన కొత్త సినీ క్యాలెండర్.. కరోనా పరిస్థితుల వల్ల తలకిందులైంది. ఈ పెద్ద చిత్రాలు ఒక్కొక్కటిగా బాక్సాఫీస్ రేసు నుంచి తప్పుకోవడంతో.. చిన్న చిత్రాలు వరుస కట్టాయి. అలా ఈ వారం థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో కాస్త అందరి దృష్టినీ ఆకర్షించినది ‘అతిథి దేవోభవ’నే. ఆది సాయికుమార్(aadi saikumar) కథానాయకుడిగా నటించిన చిత్రమిది. పొలిమేర నాగేశ్వర్ తెరకెక్కించారు. నువేక్ష కథానాయిక. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సినిమా కావడం.. పాటలు, ప్రచార చిత్రాలు ఆసక్తిరేకెత్తించేలా ఉండటంతో సినీప్రియుల్లో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు(Atithi DevoBhava Review) అందుకోవడంలో ఆది ఏమేర సఫలీకృతుడయ్యాడు? ఈ చిత్రంతోనైనా ఆయన హిట్ ట్రాక్ ఎక్కారా?
కథేంటంటే: ఒంటరిగా ఉండటాన్ని చావుతో సమానంగా భావించే కుర్రాడు అభి అలియాస్ అభయ్ (ఆది). అది అతడికి చిన్నప్పటి నుంచి ఉన్న మానసిక సమస్య. వైద్య పరిభాషలో మోనోఫోబియా అంటారు. ఏ పరిస్థితుల్లోనైనా ఒంటరిగా ఉండాల్సి వస్తే.. నిమిషాల్లో ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నం చేస్తాడు. అందుకే నలుగురు మధ్య జీవించడానికే ఇష్టపడుతుంటాడు అభయ్. తనకున్న ఈ లోపం కారణంగానే ఎంతోగానో ప్రేమించిన ఓ అమ్మాయిని దూరం చేసుకుంటాడు. ఆ బాధలో ఉన్న సమయంలోనే వైష్ణవి (నువేక్ష) అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. తొలి చూపులోనే ఒకరిపై మరొకరికి ప్రేమ కలుగుతుంది. అయితే తన లోపం గురించి తెలిస్తే ఆమె కూడా దూరమవుతుందనే భయంతో ఆ విషయాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో వారి ప్రేమకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. కొన్ని అనుకోని సంఘటనల వల్ల అభిని సైకోగా భావించి పోలీసులు అరెస్టు చేయాల్సి వస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు అభయ్‌కు ఎదురైన సమస్యలేంటి? ఆ చిక్కుల నుంచి అతడెలా బయటపడ్డాడు? తన ప్రేమను ఎలా కాపాడుకున్నాడు?(Atithi DevoBhava Review) అన్నది తెరపై చూడాలి.
ఎలా ఉందంటే: మనిషికున్న లోపాలను ఆధారం చేసుకోని తెరకెక్కిన కథలు తెలుగులో చాలానే ఉన్నాయి. ఇలాంటి కథలను వినోదాత్మకంగా వండి వార్చడంలో దర్శకుడు మారుతీది అందె వేసిన చేయి. ఆయన నుంచి వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’, ‘మంచి రోజులొచ్చాయి’ వంటి చిత్రాలన్నీ ఈ తరహా కథాంశాలతో రూపొందినవే. ఒకదాంట్లో మతిమరుపును, మరొకదాంట్లో అతిశుభ్రతను, ఇంకోదాంట్లో అతిభయం.. అనే పాయింట్లను వినోదాత్మకంగా చూపించి కడుపుబ్బా నవ్వించారు. ‘అతిథి దేవోభవ’ కూడా ఈ తరహా కథాంశంతో రూపొందిన చిత్రమే. దీంట్లో కొత్తగా కనిపించే అంశం.. మోనోఫోబియా. ఈ పాయింట్‌ను దర్శకుడు పొలిమేర నాగేశ్వర్ కాసేపు థ్రిల్లర్ కోణంలోనూ.. ఇంకాసేపు వినోదాత్మక కోణంలోనూ చూపించే ప్రయత్నం చేశారు. కానీ, ఈ ఎత్తుగడ ఏ దశలోనూ ప్రేక్షకుల్ని మెప్పించేలా సాగలేదు. ఆరంభంలో అభయ్ బాల్యాన్ని.. అతని మోనోఫోబియాను పరిచయం చేస్తూ వచ్చే సన్నివేశాలు కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తాయి. కానీ, అక్కడి నుంచి ప్రేక్షకులకు వినోదంతో కూడిన థ్రిల్ పరిచయం చేయాలని దర్శకుడు చేసిన ప్రతి ప్రయత్నం సహనానికి పరీక్ష పెడుతూనే ఉంటుంది. చిత్ర బృందం ముందు నుంచీ చెబుతూ వస్తున్న సప్తగిరి కామెడీ ట్రాక్.. సినిమాలో ఎక్కడా పేలలేదు. కాకపోతే కాస్తలో కాస్త ఆ ట్రాకే ప్రేక్షకులకు ఊరట కలిగిస్తుంటుంది. వైష్ణవి.. అభయ్‌ల ప్రేమ కథ మొదలయ్యాకే కథలో కాస్త వేగం పెరుగుతుంది. అయితే వాళ్లిద్దరి ప్రేమకథలో ఏమాత్రం ఫీల్ కనిపించదు. విరామానికి ముందు అభయ్ తన ప్లాట్‌లో ఒంటరిగా ఉండాల్సి రావడం.. దాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ద్వితీయార్ధం ఏం జరగబోతుందా? అన్న ఆసక్తి పెరుగుతుంది.
ప్రధమార్ధంలో కామెడీ థ్రిల్లర్‌గా కథను నడిపే ప్రయత్నం చేసిన దర్శకుడు.. ద్వితీయార్ధంలో కాసేపు దాన్ని సైకో థ్రిల్లర్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలో ఆయన వేసిన ప్రతి ఎత్తుగడ సాగతీత వ్యవహారంలాగే నడిచింది తప్ప.. ఎక్కడా ఊపు తీసుకురాలేకపోయింది. అభయ్‌ను సైకోగా భావించి పోలీసులు అరెస్ట్ చేయడంతో కథ కాస్త రసవత్తరంగా మారినట్లు అనిపించినా.. ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్‌తో అదంతా నీరుగారిపోతుంది. యాక్షన్ సీక్వెన్స్ మాత్రం ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్నిస్తాయి. ఇక ముగింపుకు ముందు అభయ్ - వైష్ణవి తిరిగి కలిసిన తీరు.. ప్రతినాయకులకు అభికి మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఏమాత్రం రుచించవు.
ఎవరెలా చేశారంటే: అభయ్ పాత్రకు తనవంతు న్యాయం చేసే ప్రయత్నం చేశారు హీరో ఆది. మోనోఫోబియాతో భయపడే సన్నివేశాల్లో ఆయన నటన కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. నువేక్ష తెరపై అందంగా కనిపించింది. నటన పరంగా ప్రతిభ చూపించడానికి పెద్దగా ఆస్కారం దొరకలేదు. ఆది తల్లి పాత్రలో రోహిణి ఎంతో చక్కగా ఒదిగిపోయారు. సప్తగిరి కామెడీ ట్రాక్ అంతగా పేలకున్నా.. సినిమాలో కాస్త కాలక్షేపంగా నిలిచిన ఎపిసోడ్స్ అవే. ఎంచుకున్న కథలో కాస్త కొత్తదనమున్నా.. దాన్ని ఆసక్తికరంగా మలచుకోవడంలో కథకుడు, దర్శకుడు పూర్తిగా విఫలమయ్యారు. సినిమాకి బలాన్నిచ్చిన అంశమేదైనా ఉందా అంటే.. అది శేఖర్ చంద్ర అందించిన సంగీతమే. ‘‘బాగుంటుంది నువ్వు నవ్వితే’’, ‘‘నిన్ను చూడగానే’’, ‘‘చిన్ని బొమ్మ నన్నిలా..’’ పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునేలా ఉంది. కార్తిక్ కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. అమర్‌నాథ్ ఛాయాగ్రహణం ఫర్వాలేదనిపించింది. చిత్ర నిర్మాణ విలువలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
బలాలు
+ కథాంశం
+ ఆది నటన
+ శేఖర్ చంద్ర సంగీతం
బలహీనతలు
- సాగతీత సన్నివేశాలు
- ప్రధమార్ధం.. ముగింపు
చివరిగా: సహనాన్ని పరీక్షించే ‘అతిథి’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: క్రికెట్లో మేం గోల్డ్ సాధించాం.. ఇక మీ వంతు: జెమీమా రోడ్రిగ్స్
-
Aadhaar: ‘ఆధార్’పై మూడీస్ సంచలన ఆరోపణలు.. గట్టిగా బదులిచ్చిన కేంద్రం
-
Justin Trudeau: ఆ ఘటన కెనడియన్లను ఇబ్బందికి గురిచేసేదే..: జస్టిన్ ట్రూడో
-
USA: భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. విచారణకు సహకరించాలని కోరిన విదేశాంగ శాఖ
-
Manipur Violence: అదృశ్యమైన ఆ విద్యార్థుల దారుణ హత్య.. మణిపుర్లో వెలుగులోకి మరో ఘోరం..!
-
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం