Agent movie review: రివ్యూ: ఏజెంట్
Agent movie review: అఖిల్ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ ఎలా ఉందంటే?
Agent movie review; చిత్రం: ఏజెంట్; నటీనటులు: అఖిల్, మమ్ముట్టి, డినో మోరియా, సాక్షివైద్య, విక్రమ్‌జిత్ వ్రిక్, సంపత్‌రాజ్, ఊర్వశి రౌటెలా తదితరులు; సంగీతం: హిప్ హాప్ తమిళ, భీమ్స్ సిసిరోలియో; సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, జార్జ్ సి. విలియమ్స్; ఎడిటింగ్: నవీన్ నూలి; నిర్మాత: రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, దీపారెడ్డి; కథ: వక్కంతం వంశీ; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌రెడ్డి; విడుదల: 28-04-2023

అక్కినేని కుటుంబ కథానాయకులంటేనే ప్రేమకథలకు పెట్టింది పేరు. దీనికి తగ్గట్లుగానే ఇప్పటివరకూ ఆ తరహా కథలతోనే ప్రయాణిస్తూ వచ్చారు హీరో అఖిల్. ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రాలతో సినీప్రియుల మదిలో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడా ఇమేజ్‌కు భిన్నంగా మాస్ యాక్షన్ హీరోగా అలరించేందుకు ‘ఏజెంట్’తో సిద్ధమయ్యారు అఖిల్. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన స్టైలిష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. మమ్ముట్టి ముఖ్య పాత్ర పోషించారు. చిత్రీకరణ ఆలస్యమవడంతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి అడుగు పెట్టింది. (Agent review)మరి ఈ ఏజెంట్ కథేంటి? ఈ సినిమా కోసం అఖిల్ పడిన రెండేళ్ల కష్టం ఎలాంటి ఫలితాన్నిచ్చింది?
కథేంటంటే: రిక్కీ అలియాస్ రామకృష్ణ (అఖిల్) ఓ మధ్య తరగతి కుర్రాడు. స్పై అవ్వడమే లక్ష్యంగా జీవిస్తుంటాడు. ఇందుకోసమే ‘రా’లో చేరేందుకు మూడుసార్లు పరీక్ష రాస్తాడు. కానీ, ప్రతిసారీ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతుంటాడు. దీంతో ఇలా ప్రయత్నిస్తే లాభం లేదనుకొని తన ఎథికల్ హ్యాకింగ్ నైపుణ్యాలతో ఏకంగా ‘రా’ చీఫ్ డెవిల్ అలియాస్ మహదేవ్ (మమ్ముట్టి) సిస్టమ్‌ను హ్యాక్ చేసి.. అతని దృష్టిలో పడే ప్రయత్నం చేస్తాడు. (Agent movie review) కానీ, రిక్కీ కోతి చేష్టలు చూసి ఆయన కూడా తనని రిజక్ట్ చేసి వెళ్లిపోతాడు. మరోవైపు భారత దేశాన్ని నాశనం చేసేందుకు గాడ్ అలియాస్ ధర్మ (డినో మోరియా) చైనాతో కలిసి మిషన్ రాబిట్ పేరుతో ఓ భారీ కుట్రకు ప్రణాళిక సిద్ధం చేస్తాడు. అయితే వీళ్ల కుట్రను చేధించి, మిషన్ రాబిట్‌ను అడ్డుకునేందుకు మహదేవ్ తన ఏజెంట్ సాయంతో ఓసారి ప్రయత్నించి విఫలమవుతాడు. దీంతో ఆయన రెండోసారి ఆ మిషన్ కోసం రిక్కీని రంగంలోకి దించుతాడు. మరి ‘రా’కి పనికి రాడని పక్కకు పెట్టేసిన రిక్కీని అంత పెద్ద మిషన్ కోసం మహదేవ్ ఎందుకు రంగంలోకి దింపాడు? ఆయన ఆదేశాల్ని పక్కకు పెట్టి రిక్కీ కొని తెచ్చుకున్న ప్రమాదాలేంటి? అసలు స్పై అవ్వాలన్న తన లక్ష్యం వెనకున్న బలమైన కారణం ఏంటి? (Agent movie review) అతను మిషన్ రాబిట్‌ను ఎలా అడ్డుకున్నాడు?వైద్య (సాక్షి వైద్య)తో అతని ప్రేమాయణం ఏమైంది? ఈ కథలో కేంద్రమంత్రి జయకిషన్ (సంపత్ రాజ్) ఏంటి? అన్నది మిగతా కథ.

ఎలా ఉందంటే: దేశభక్తి నేపథ్యంలో సాగే స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. ప్రధానంగా ముగ్గురు ‘రా’ ఏజెంట్ల మధ్య సాగే పోరాటంలా సాగుతుంది. అందులో ఒకరు దేశాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పని చేస్తుంటే.. మరో ఇద్దరు ఆ కుట్రను అడ్డుకునేందుకు ఎలా పోరాడారన్నది ఆసక్తికరం. ఇటీవల వచ్చిన ‘పఠాన్’ కూడా ఇంచుమించు ఈ తరహా కథాంశమే. అయితే ఆ సినిమాలో ఉన్నంత యాక్షన్ హంగామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో మిస్ అయ్యాయి. నిజానికి ఇలాంటి ఈ తరహా స్పై యాక్షన్ థ్రిల్లర్స్‌లో కథ ఓ చిన్న లైన్‌గానే ఉంటుంది. యాక్షన్, థ్రిల్లింగ్ మూమెంట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వాటిని ఎంత ఆసక్తికరంగా తీర్చిదిద్దారన్న దానిపైనే చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో ‘ఏజెంట్’ ఆశించిన స్థాయిలో మెప్పించదు. మహదేవ్‌ను రిక్కీ కాల్చి చంపడం.. ఆ వెంటనే అతన్ని చంపేయమని ‘రా’ సంస్థ ఆదేశాలు ఇవ్వడంతో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి రిక్కీ వాయిస్ ఓవర్‌తో కథ ముందుకెళ్తుంది.(Agent movie review) కలలో ఏజెంట్‌గా అఖిల్ ఎంట్రీ ఫైట్ ఆకట్టుకుంటుంది. స్పై అవ్వడం కోసం రిక్కీ చేసే ప్రయత్నాలతో తొలి పదిహేను నిమిషాలు.. ఆ తర్వాత వైద్యతో సాగించే ప్రేమాయణంతో మరో 20నిమిషాలు సినిమా సాదాసీదాగా సాగిపోతుంది. వైద్యను వేధించినందుకు కేంద్రమంత్రి జయకిషన్ ఇంటికి వెళ్లి రిక్కీ వార్నింగ్ ఇచ్చే సీన్‌తో కథకు మళ్లీ ఊపొస్తుంది. భారత్‌ను నాశనం చేసేందుకు గాడ్ మిషన్ రాబిట్‌ను మొదలు పెట్టడం.. దాన్ని అడ్డుకునేందుకు మహదేవ్, రిక్కీని రంగంలోకి దింపడంతో సినిమా వేగం పుంజుకుంటుంది. విరామానికి ముందు బీస్ట్ లుక్‌తో అఖిల్ చేసే యాక్షన్ హంగామా, మహదేవ్ ఆదేశాల్ని పక్కకు పెట్టి జయకిషన్ గ్యాంగ్‌ను ఏరివేసే తీరు అలరిస్తుంది.

దీంతో సెకండాఫ్ ఏం జరగనుందా అన్న ఆసక్తి మొదలవుతుంది. అయితే ఆ తర్వాత నుంచే కథ పూర్తిగా గాడి తప్పినట్లు అనిపిస్తుంది. నిజానికి ‘రా’ చేపట్టే ఆపరేషన్‌లు.. వాళ్లు శత్రువుల కుట్రల్ని ఛేదించే తీరు చాలా ఆసక్తిరేకెత్తిస్తూ, ఊహలకు అందని రీతిలో సాగుతుంటాయి.(Agent movie review)ఆ వ్యవస్థ పనితీరు అంతా ఓ మైండ్ గేమ్‌లా ఉంటుంది. అయితే దాన్ని ఇందులో సమర్థంగా చూపించలేకపోయారు. కొన్ని ఎపిసోడ్లు చూస్తే అసలు రా పనితీరుపై ఏమాత్రం పరిశోధన చేయకుండా సినిమా తీసినట్లు అనిపిస్తుంది. ‘రా’ బృందం వేసే ఎత్తును ప్రతినాయకుడు తన ఆఫీస్‌లో కూర్చొని వీడియోలో గమనించేస్తుండటం మరీ సిల్లీగా అనిపిస్తుంది. ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధంలో యాక్షన్ డోస్ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి పది నిమిషాలకు ఓ ఫైట్ లేదా ఛేజింగ్ ఎపిసోడ్ వచ్చి పడిపోతుంటుంది. అందులో కొన్ని ఆకట్టుకుంటే మరికొన్ని సాగతీత వ్యవహారంగా అనిపిస్తాయి. పతాక సన్నివేశాల్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ కూడా రొటీన్‌గానే ఉంటుంది. అందరూ ఊహించినట్లుగానే రిక్కీ, ధర్మను అంతం చేసి మిషన్ రాబిట్‌ను అడ్డుకోవడంతో ఈ కథకు శుభం కార్డు పడుతుంది.

ఎవరెలా చేశారంటే: ఏజెంట్ పాత్ర కోసం అఖిల్ పడిన కష్టం తెరపై ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ఆయన్ని సురేందర్ రెడ్డి స్టైలిష్ లుక్‌లో తెరపై ఆకట్టుకునేలా చూపించారు. పోరాట ఘట్టాల కోసం అఖిల్ ప్రాణం పెట్టి పని చేసినట్లు అర్థమవుతుంది.(Agent movie review) నటన పరంగానూ చాలా కొత్తగా కనిపించారు. ‘రా’ చీఫ్‌గా డెవిల్ పాత్రలో మమ్ముట్టి నటన సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన ఇమేజ్, అనుభవం ఆ పాత్రకు మరింత నిండుదనాన్ని తెచ్చాయి. ప్రతినాయకుడిగా డినో మోరియా పాత్రను తీర్చిదిద్దిన తీరు రొటీన్‌గా ఉన్నప్పటికీ కథలో బాగానే సెట్ అయ్యింది. సాక్షి వైద్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, రెండు, మూడు పాటలకే పరిమితమైంది. నిజానికి అఖిల్‌కు ఆమెకు మధ్య వచ్చే లవ్ ట్రాక్ కథకు స్పీడ్ బ్రేకర్‌లా అడ్డు తగులుతున్నట్లు అనిపిస్తుంది. అసలు ఆ లవ్ ట్రాక్ లేకున్నా కథకు వచ్చే నష్టం ఏముండదు. (Agent movie review) సంపత్ రాజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, మురళీ శర్మ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన స్టైలిష్ యాక్షన్ చిత్రాల్లో ‘ఏజెంట్’కు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే కథను ఆసక్తికరంగా తీర్చిదిద్దకపోవడం, ప్రేక్షకులు ఆశించే మలుపులు, థ్రిల్లింగ్ మూమెంట్స్ లేకపోవడం ఈ చిత్ర ఫలితాన్ని దెబ్బ తీసింది. రసూల్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. కానీ, పాటలు ఏమాత్రం ఆకట్టుకోవు. రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.
- బలాలు: + అఖిల్, మమ్ముట్టి నటన; + పోరాట ఘట్టాలు; + ఇంటర్వెల్ ఎపిసోడ్
- బలహీనతలు: - కొత్తదనం లేని కథ; - నాయకానాయికల లవ్ ట్రాక్
- చివరిగా: రెగ్యులర్ టెంప్లేట్‌తో సాగే రొటీన్ స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’(Agent movie review)
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Tragedy: సరిగ్గా 14 ఏళ్ల క్రితం.. ఇదే శుక్రవారం..!
-
Crime News
Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. 278కి చేరిన మృతుల సంఖ్య
-
General News
Odisha Train Accident: రాజమహేంద్రవరం రావాల్సిన 21 మంది ప్రయాణికులు సురక్షితం
-
India News
Odisha Train Tragedy: విపత్తు వేళ మానవత్వం.. రక్తదానానికి కదిలొచ్చిన యువకులు
-
General News
odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
-
India News
Trains Cancelled: ఒడిశా రైలు ప్రమాదం.. 40కిపైగా రైళ్లు రద్దు..