Alitho Saradaga: ఆ విషయంలో చిరంజీవికి సారీ చెప్పా.. : రాధిక

సినిమాలు..ఇటు తమిళంలో బుల్లితెరలో సత్తా చాటడమే కాదు..పలు విభాగాల్లో నైపుణ్యం చూపుతున్న డేరింగ్‌ ,డాషింగ్‌ నటి ఎవరో కాదు..ఆమె రాధిక శరత్‌కుమార్‌. 

Updated : 05 Nov 2023 15:18 IST

ఇంటర్నెట్‌డెస్క: చిరంజీవితో అదిరిపోయే కాంబినేషన్‌.. ‘స్వాతిముత్యం’లో కమల్‌హాసన్‌తో అభినయం... ఏయన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజులాంటి లెజెండ్‌లతో నటించిన ఫైర్‌బ్రాండ్‌.. అటు సినిమాలు.. ఇటు తమిళంలో బుల్లితెరలో సత్తా చాటడమే కాదు.. పలు విభాగాల్లో నైపుణ్యం చూపుతున్న డేరింగ్‌, డాషింగ్‌ నటి.. ఆమె మరెవరో కాదు.. రాధిక శరత్‌కుమార్‌. తమిళంలో ప్రముఖ నటుడు ఎంఆర్‌ రాధా కుమార్తెగా కంటే సొంతంగానే బ్రాండ్ క్రియేట్‌ చేసుకున్నారామె. దక్షిణాది భాషల్లో నటిగా, నిర్మాతగా తనకంటూ ఇమేజ్‌ను సంపాదించిన రాధిక.. ఆలీతో సరదాగా కార్యక్రమంలో తన నాలుగు దశాబ్దాల అనుభవాలు, అనుభూతులను పంచుకున్నారు.

‘నేనూ, రాధిక టీవీ రంగంలోకి వచ్చి సీరియళ్లు తీయకపోతే చాలా మందికి ఉపాధి ఉండేది కాదు.. ఇప్పుడు చాలా మంది ఆ రంగం వైపు వచ్చారు’ అంటూ ఓ హీరోయిన్‌, నటి పేర్కొన్నారు. ఎవరై ఉంటారు..?

రాధిక: ఖుష్బూ

మీ సొంతూరు ఎక్కడ..?

రాధిక: చెన్నై. మధ్యలో శ్రీలంక వెళ్లిపోయాను. అక్కడే హాస్టల్‌లో ఉండి చదువుకున్నాను. తర్వాత లండన్‌ వెళ్లా. అక్కడ ఉన్నత విద్య వదిలేసి చెన్నై వచ్చా. యాక్సిడెంటల్‌గా భారతీరాజా చూసి హీరోయిన్‌గా ‘కిరక్కే పొగుమురై’ కోసం తీసుకున్నారు. నేనూ, సుధాకర్‌ కలిసి నటించాం. 

తెలుగుకు మిమ్మల్ని పరిచయం చేసిందెవరు?

రాధిక: ప్రియ సినిమా.. చంద్రమోహన్‌, చిరంజీవిలతో కలిసి నటించా. కానీ, ‘న్యాయం కావాలి’ త్వరగా పూర్తయి విడుదల అయ్యింది. 

లైఫ్‌ టర్నింగ్‌ ‘న్యాయం కావాలి’ సినిమాయేనా..?

రాధిక: 100 శాతం అదే. ఆ సినిమా కోబారెడ్డి(కోదండరామిరెడ్డి), చిరంజీవిలకు కూడా కలిసి వచ్చింది.

అప్పుడు ఎలా ఉండేది..?

రాధిక: చాలా టెన్షన్‌గా ఉండేది నాకు. తెలుగు భాష రాదు. సరిగా అర్థమయ్యేది కాదు. ‘రేపు’ అంటుంటే తర్వాతి రోజుని అర్థం తెలియక అమ్మకు, నాకూ భయం వేసేది. శారద, జగ్గయ్య గారు పక్కనున్నారు. డైలాగులు నేర్చుకొని నటించాల్సి వచ్చింది. ఒక సీన్‌లో చిరంజీవిని కొట్టి కొట్టి మాట్లాడాలి. పెద్ద డైలాగ్‌ ఒకే షాట్‌లోనే చేయాలని క్రాంతిగారు చెప్పారు. 23 టేకులు తీసుకున్నా. ఆ తర్వాత చిరంజీవి మొహం చూస్తే ఎర్రగా అయిపోయింది. నిజంగానే కొట్టాలన్నారు. నేను కూడా కొట్టేశా. తర్వాత సారీ చెప్పా.

ఎన్నో దెబ్బలు తింటే తప్ప పైకిరారనే సామెత తెలుగులో ఉంది...?

రాధిక: నా చేతిలో దెబ్బలు తిన్నవారందరూ పైకి వచ్చారు(నవ్వులు) ఇప్పటికీ ప్రతి సీరియల్‌లో ఒక్కటైనా సీను ఉంటుంది. ప్రతిసారి ఏంటండీ.. బోర్‌గా ఉందంటే.. వాళ్లు సెంటిమెంటుగా భావిస్తున్నారు. ఒక సీను అయినా ఉండాలని కోరుకుంటున్నారు.

రాధిక అనగానే తెలుగమ్మాయి అనుకుంటున్నారు. మీకు సినిమాలతోనే తెలుగు వచ్చిందా..?

రాధిక: నిజంగా తెలుగు వాళ్లమే. నాన్న సొంతరూ తిరుపతికి సమీపంలోనేనని చెబుతారు. అందుకే ఆయన తెలుగు కూడా గమ్మత్తుగా ఉంటుంది. నన్ను తెలుగులోనేమో అరవమ్మాయి అని, తమిళంలో తెలుగమ్మాయి అంటారు. ఎందుకో తెలిసేది కాదు.. కానీ రాజకీయాల్లోకి వచ్చాక తర్వాత అసలు విషయం తెలిసింది. సినిమాల్లో నటించిన తర్వాత మంచి తెలుగు మాట్లాడుతున్నా.. తమిళ తెలుగు కాదు.

మీ కుటుంబ సభ్యులు ఎంతమంది?

రాధిక: ఇద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లి. బ్రదర్స్‌ శ్రీలంకలో షిప్పింగ్‌ బిజినెస్‌లో ఉన్నారు. నిరోషా అందరికి తెలిసిందే కదా.

మొదటిసారి మీ ఇంటికి భారతీరాజా వచ్చినప్పుడు దొంగోడని రానీయలేదట..?

రాధిక: మా ప్రాంతంలో ఓ పెద్ద హత్య జరిగింది. అప్పుడే లండన్‌ నుంచి వచ్చాం. మర్డర్‌ జరిగిన ఇల్లే మేం తీసుకొన్నాం. ముందుగా తెలియదు. తర్వాత ఆ ఇంటి నుంచి వెళ్లిపోదాం అనుకున్నాం. అదే సమయంలో భారతీరాజా వచ్చారు. ఆయన ఎలా ఉంటారో తెలుసుకదా. ఆయనే హంతకుడు అనుకొని ఇంట్లో వాళ్లని లోపలికి వెళ్లమని చెప్పా. చివరికి అమ్మ ఆయనను గుర్తుపట్టి లోపలికి రమ్మన్నారు. ఇప్పటికీ ఆయనతో స్నేహం కొనసాగుతోంది. చాలా మంచి దర్శకుడు. తొలి సినిమా మధ్యలో నటించనని చెబితే చాక్లెట్లు ఇచ్చి నటింపజేశారు.

ఐదు భాషల్లో నటించారు కదా.. ఏ ఇండస్ట్రీ అంటే ఇష్టం..?

రాధిక: తమిళం నన్ను పరిచయం చేసింది. తెలుగు పరిశ్రమ నాలో మార్పు తీసుకొచ్చింది. ప్రొఫెషనల్‌గా మారే వేదికను తెలుగు సినిమా ఇచ్చింది.

తెలుగు సినీ పరిశ్రమలో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఎవరు..? తమిళంలో ఎవరున్నారు..?

రాధిక: చిరంజీవి. జయసుధ, జయప్రద, శ్రీదేవి, నాగేశ్వరరావు, వెంకీ, నరేశ్‌ ఇలా చాలామంది ఉన్నారు. తమిళంలో అందరూ బెస్ట్‌ ఫ్రెండ్సే.

మీ తండ్రి పేరుతో పైకి వచ్చారా..? మీరే సొంతంగా వచ్చారా..?

రాధిక: తొలిసారి భారతీరాజా చూసి ‘నటిస్తావా’ అని అడిగినప్పుడు ఎంఆర్‌ రాధా కూతురని తెలియదు. ఓకే చేసి రేపటి నుంచి షూటింగ్‌ ఉంది రమన్నారు. తొలి రోజు షూటింగ్‌లోనే ఎంఆర్‌ రాధా కూతురని తెలిసిపోయింది. చాలా భయపడిపోయారు. మా ఫాదర్‌ వివాదాస్పదంగా ఉంటారు. ఆయన వెళ్లి నాన్నతో మాట్లాడారు. ‘రాధిక నటించడమా..?’ అంటూ ఆశ్చర్యపోయారు. చాలా మంది కూర్చొని కామెంట్లు చేస్తారు. కానీ, నటనకు చాలా కష్టపడాలి. నా భవిష్యత్‌ను నేనే నిర్మించుకున్నా. 

అప్పట్లో ఎంజీఆర్‌తో మీ నాన్నకు వివాదం అయినట్టు విన్నాను. చాలా పెద్ద ఇష్యూ అది...? సిరీస్‌కు ఎంజీఆర్‌ కుటుంబం నుంచి అనుమతి తీసుకున్నారా..?

రాధిక: ఆ ఇష్యూను ఒక స్క్రిప్టుగా చేస్తున్నా. అది సిరీస్‌గా ఉంటుంది. షూటింగ్‌ జులైలో చేస్తాం. ఎంజీఎఆర్‌ కుటుంబంతో అనుమతి అవసరం లేదు. కోర్టు డాక్యుమెంట్‌ అది. దాన్ని తీసుకొని చేస్తున్నాం.

హిందూ కుటుంబంలో పుట్టారు. క్రిస్టియన్‌ స్కూల్‌లో  చదువుకున్నారు. ఓ ముస్లిం కుటుంబం దగ్గర పెరిగారు. కారణం ఏంటి..?

రాధిక: మా తల్లికి సకినా ఆంటీ బెస్ట్ ఫ్రెండ్‌, హౌజీ అంకుల్‌ శ్రీలంకలో మంత్రిగా ఉండేవారు. ఆయనే గార్డియన్‌. ఫాదర్‌ కోర్టు ఇష్యూ ఉన్నప్పుడు లీగల్‌ వైఫ్‌గా అమ్మ రావాల్సి ఉండటంతో పిల్లలందరినీ శ్రీలంకలో పెట్టి వచ్చేవారు. మేమంతా హాస్టల్‌లో ఉండేవాళ్లం. అక్కడే మాకు వీరు గార్డియన్‌గా ఉండేవారని తెలుసు. పాఠశాలలో ప్రార్థనలు చేయడం, ఇంట్లో ముస్లిం పద్ధతి ఇలా అన్ని రకాల మతాలను అనుసరించేవాళ్లం. ఇప్పటికీ అన్ని పండగలను చేసుకుంటాం.

మీ కుటుంబంలో మీ తర్వాత ఎవరు ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారా..?

రాధిక: నా తర్వాత ఎవరు వస్తారో తెలియదు. నుదిటిపై ఏం రాసి ఉంటుందో అదే జరుగుతుంది. పుస్తకాలు బాగా చదివేదాన్ని. సినిమాలు చూడను. హాస్టల్‌లో ఉండటంతో అక్కడి వాతావరణానికి అలవాటు పడ్డాను. భారతీరాజా వచ్చి నా అదృష్టాన్ని మార్చేశారు. ఏటా జనవరిలో ‘ఇక సినిమాల్లో నటించను’ అని తీర్మానం చేస్తా. అందరికీ చెబుతా. వాళ్లంతా ఇంటికి వెళ్లిపోయారు. నేను ఇంకా నటిస్తూనే ఉన్నా. కూతురు పుట్టగానే నటించకూడదనుకున్నా. ఆస్పత్రిలో ఉండగానే భారతీరాజా వచ్చారు. కుశల ప్రశ్నలు వేసి మళ్లీ నటించాలన్నారు. ‘మంచి పాత్ర ఉంది. నువ్వే చేయాలి’ అని పట్టుబట్టారు. మూడు నెలల పాపతోనే సినిమాలో నటించా. అదే చాలా మార్పు తీసుకొచ్చింది. పెద్ద పెద్ద పాత్రలు వేశా. తర్వాత టెలివిజన్‌లోకి వచ్చా. 

ఖాళీగా ఉండలేకనా..? ఉపాధి కల్పించాలని టీవీ రంగంలోకి వచ్చారా..?

రాధిక: సినిమాల్లో హీరోయిన్‌ తర్వాత తల్లిపాత్రలు. జీవితాన్ని నా నియంత్రణలోనే ఉంచుకోవాలని అనుకున్నా. అప్పటికే సింగిల్‌ మదర్‌గా ఉన్నా. అందుకే రాడాన్‌ సంస్థను స్థాపించా. అన్ని టీవీలను చూశా. అప్పటికే టీవీ రంగానికి భవిష్యత్తు ఉందని గుర్తించా. అంతటా మహిళను అమాయకంగా, భర్త చెప్పినట్టు వినేలా ఉన్నాయి. అప్పుడే అనుకున్నా స్ట్రాంగ్‌ ఉమెన్‌గా టీవీ హీరోయిన్‌ పాత్ర ఉండాలనుకున్నా. నాకు మొట్టమొదట బ్రేక్‌ ఇచ్చింది ఈటీవీనే. ‘ఇది కథ కాదు’ సీరియల్‌ పెద్ద హిట్‌ అయ్యింది. తర్వాత తమిళంలో ఆదరించారు.

రాడాన్‌ ఇప్పుడు పెద్ద కంపెనీ. ఎంతమంది పని చేస్తున్నారు..?

రాధిక: కొవిడ్‌తో చాలా మారిపోయింది. చాలా తక్కువ మంది పని చేస్తున్నారు. సుమారుగా 40 మంది ఉంటారు.

మీ పాప పెళ్లికి గంట ముందు  మీ ఇద్దరి మధ్య ఎమోషనల్‌ సన్నివేశం జరిగిందట ఏంటది..?

రాధిక: రయాన్‌తో నా అనుబంధం ఎక్కువ. ఒంటరిగా ఉన్నప్పుడు చాలా సపోర్టింగ్‌గా ఉండేది. తను పెళ్లి చేసుకోవాలనుకున్నపుడు ‘నీ ఇష్టం’ అని చెప్పా. చదువుకునేటప్పుడు కూడా నా అభిప్రాయం చెప్పలేదు. చాలా స్వతంత్రంగా పెంచా. ఇంకో ఇంటికి నా కూతురును పంపిస్తున్నాననే ఫీలింగ్‌. నేను చాలా కష్టపడ్డాను. అలా నా కూతురు కష్టపడకూడదనుకున్నా. ఏడుపొచ్చింది. తనతో మాట్లాడుదామనుకున్నా. తలుపు తీయగానే తను కూడా అలాగే అనుకుంది. తలుపు వద్దే ఉంది. తనను హత్తుకొని ఏడ్చాను. చాలా ఆలస్యం అయ్యింది. పెళ్లి చేసుకుంటా మమ్మీ అంది. నీ జీవితాన్ని సంతోషంగా తీర్చిదిద్దుకోమని చెప్పా.

శరత్‌కుమార్‌ ఎక్కడ ఎలా పరిచయం..? ఆయన ఎలా ఉన్నారు..?

రాధిక: శరత్‌ ముందుగా నిర్మాత, సహనటుడు, వెరీ గుడ్‌ ఫ్రెండ్‌. నేనూ, శరత్‌, అరవింద్‌స్వామి ఒక గ్రూపు. అప్పుడప్పుడు కలుస్తాం. నాకొక లైఫ్‌ కావాలో లేదో ఆలోచించలేదు. ఒక సందర్భంలో ఒకే అన్నా. పెళ్లి చేసుకున్నాం. అరవింద్‌స్వామి అశ్చర్యపోయారు. రోజూ కలుస్తున్నాం. చెప్పకుండానే పెళ్లి చేసుకున్నారన్నారు.

మీకు ఏ వాసన అంటే ఇష్టం..? కొత్త పుస్తకాల వాసన కూడా చూస్తారట..?

రాధిక: మెహందీ వాసనంటే ఇష్టం. కొత్త పుస్తకాల వాసన చూడటం కూడా చాలా ఇష్టంగా చేస్తాను.

(ఇది మొదటి భాగం మాత్రమే.. రెండో భాగం వచ్చేవారం ఈటీవీలో ప్రసారం కానుంది)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని