Bheemla Nayak: అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ Vs భీమ్లా నాయక్‌.. ఎవరు ఏ పాత్రలు చేశారంటే?

ఫిబ్రవరి 25న థియేటర్‌లలో మాస్‌ జాతరకు రంగం సిద్ధమైంది. ‘వకీల్‌సాబ్’ తర్వాత పవన్‌కల్యాణ్ ‘భీమ్లా నాయక్‌’(Bheemla Nayak)గా దర్శనమివ్వబోతున్నారు.

Updated : 23 Feb 2022 16:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫిబ్రవరి 25న థియేటర్‌లలో మాస్‌ జాతరకు రంగం సిద్ధమైంది. ‘వకీల్‌సాబ్’ తర్వాత పవన్‌కల్యాణ్ ‘భీమ్లా నాయక్‌’(Bheemla Nayak)గా దర్శనమివ్వబోతున్నారు. పవన్‌(Pawan kalyan)ను ఢీకొనే మరో కీలక పాత్రలో రానా(Rana) నటిస్తున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా సాగర్‌ కె.చంద్ర ‘భీమ్లా నాయక్‌’ తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. ఇక ఇటీవల విడుదల చేసిన ప్రచారం చిత్రం సినిమాపై అంచనాలను పెంచుతోంది. మాతృకతో పోలిస్తే, చాలా మార్పులే చేశారు. మరి మలయాళం చిత్రానికీ తెలుగు సినిమాకీ ఉన్న భేదాలేంటి? ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ పాత్రలను తెలుగులో ఎవరెవరు? చేశారు? చూసేయండి.

* మలయాళ సినిమాకు కథలోని ముఖ్య పాత్రలైన అయ్యప్పనాయర్‌, కోషి కురియన్‌ పేర్లు కలిసేలా ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ టైటిల్‌ను పెట్టారు. తెలుగులో కేవలం పవన్‌కల్యాణ్‌ పాత్ర పేరు ‘భీమ్లా నాయక్‌’ను మాత్రమే టైటిల్‌గా పెట్టారు.

* ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రాన్ని మలయాళ దర్శకుడు శచీ రచించి దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించగా, కథలో మార్పులు, స్క్రీన్‌ప్లే, సంభాషణలను త్రివిక్రమ్‌ రాశారు.

* అయ్యప్పనాయర్‌ పాత్రలో బిజూ మేనన్‌ నటించగా, తెలుగులో ఆ పాత్రను ‘భీమ్లానాయక్‌’ పేరుతో పవన్‌కల్యాణ్‌ పోషించారు.

* ఇక మలయాళంలో రిటైర్డ్‌ హవల్దార్‌ కోషి కురియన్‌గా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కనిపించగా, తెలుగులో అదే పాత్రను డేనియల్‌ శేఖర్‌గా రానా నటించారు.

* కోషి తండ్రి పాత్రలో రంజిత్‌ నటించగా, తెలుగులో సముద్రఖని ఆ పాత్ర చేశారు.

* ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’లో మరో ముఖ్యపాత్ర సీఐ సతీష్‌కుమార్‌. ఆ పాత్రను అనిల్‌ నెడుమగద్‌ పోషించగా, తెలుగులో కోదండరాంగా మురళీ శర్మ కనిపించనున్నారు.

* అయ్యప్పనాయర్‌ భార్య పాత్ర కన్నమ్మగా గౌరీ నందన్‌ నటించగా, తెలుగులో నిత్యామేనన్‌ ఆ పాత్ర పోషించారు.

* కోషి కురియన్‌ భార్య పాత్రలో అన్న రాజన్‌ రుబీగా నటించగా, తెలుగులో సంయుక్త మేనన్‌ నటించారు.

* కోషి డ్రైవర్‌ కుమార పాత్రను రమేశ్‌ కొట్టాయమ్‌ చేయగా, తెలుగులో డేనియల్‌ శేఖర్‌ డ్రైవర్‌గా బాలాజీ పాత్రలో రఘుబాబు కనిపించనున్నారు.

* అయ్యప్ప నాయర్‌ను వ్యతిరేకించే వ్యక్తిగా కూట్టమణి పాత్రలో సబూమన్‌ అబ్దుసమద్‌ నటించగా, తెలుగులో ఆ పాత్రను రావు రమేశ్‌ చేశారు.

* ఇంకా తెలుగులో బ్రహ్మానందం పాత్రను జోడించారు. ఆయన ఎలా కనిపిస్తారు? ఏవిధంగా అలరిస్తారన్నది ఆసక్తికరం.

* మలయాళంలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. అన్నీ నేపథ్యంలో వచ్చేవే. తెలుగులో అందుకు భిన్నంగా డీజే వెర్షన్‌తో కలిసి ఐదు పాటలు పెట్టారు.

* ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రన్‌ టైమ్‌ 175 నిమిషాలు కాగా భీమ్లా నాయక్‌ రన్‌ టైమ్‌ 141 నిమిషాలు మాత్రమే.

* మలయాళ చిత్రానికి జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందించగా, తెలుగులో ఆ బాధ్యతలను తమన్‌ తీసుకున్నారు.

* అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.52 కోట్లు(గ్రాస్‌)వసూలు చేయగా, భీమ్లానాయక్‌ బడ్జెట్‌ రూ.70కోట్లు కావటం విశేషం. మరి ఇక ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో చూడాలి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు