ప్రతీకారం పోరులో చిగురించిన స్నేహం

Eenadu icon
By Cinema Desk Published : 01 Nov 2025 01:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

సినిమా: ‘స్ట్రైకింగ్‌ రెస్క్యూ’
జానర్‌: యాక్షన్‌ థ్రిల్లర్‌ (చైనీస్‌- థాయ్‌ యాక్షన్‌ మూవీ)
ప్లాట్‌ఫామ్‌: జియో హాట్‌స్టార్‌ (తెలుగు, హిందీ, తమిళ)

తన భార్య, కుమార్తెలను దారుణంగా హత్య చేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ థాయ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ యోధుడు చేసే పోరాటాల చుట్టూ తిరుగుతుందీ ‘స్ట్రైకింగ్‌ రెస్క్యూ’ సినిమా. వాళ్ల మరణానికి కారణమైన వాళ్లని వెతుక్కుంటూ వెళ్లే బైఆన్‌కి ఎదురైన సవాళ్లేంటి? శత్రువుల గురించి తెలుసుకున్నాక అతడు ఏం చేశాడనేదే ఈ సినిమా కథాంశం. 

కథాంశం

థాయ్‌లాండ్‌కు చెందిన బైఆన్‌(టోనీ జా) తన భార్య, కూతురితో సంతోషమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ రోజు కారులో కుటుంబంతో కలిసి బయటికి వెళుతున్నప్పుడు.. ఉద్దేశపూర్వకంగానే ఒక డ్రగ్స్‌ మాఫియా బృందం యాక్సిడెంట్‌ చేస్తుంది. ఈ ప్రమాదంలోనే హంతకులు బైఆన్‌ భార్య నుంచి ఓ రహస్యం తెలుసుకుని ఆమెని, కూతుర్ని చంపేస్తారు. దాంతో కళ్లముందే కుటుంబాన్ని కోల్పోయిన అతడు తీవ్ర మనస్తాపానికి గురై దీనికి కారణమైన వాళ్లు ఎక్కడున్నా.. చంపి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. దీని కోసమే శత్రువు వేటకై బయలుదేరతాడు. అంతలోనే తాను చంపాలనుకునే వ్యక్తికి కూడా ఓ కూతురు ఉంటుందని తెలుసుకుంటాడు. దాంతో తాను అనుభవిస్తున్న పరిస్థితి ఆమెకు ఎదురవకూడదనుకుంటాడు. దాంతో హాని చేయడానికి వెళ్లి అదే శత్రువు కూతురిని ప్రమాదాల నుంచి కాపాడుతూ స్నేహం కుదుర్చుకుంటాడు. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 

థాయ్‌లాండ్‌ అగ్ర నటుడు, యాక్షన్‌ కొరియోగ్రాఫర్, దర్శకుడు టోనీ జా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకి సియు చెంగ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో టోనీ జా తనదైన శైలిలో అదిరిపోయే యాక్షన్‌ స్టంట్స్‌ చేస్తూ ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ని పంచుతాడు. ప్రతీకారం తీర్చుకోవడానికి మొదలైన ప్రయాణంలో భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. తన కుటుంబంతో గడిపిన క్షణాలు తలుచుకుని బాధపడుతూ గతాన్ని వర్తమానంతో పోల్చే దృశ్యాలు ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటాయి. కుటుంబ హత్యల వెనుక కారణాన్ని తెలుసుకునే నేపథ్యంలో వచ్చే ట్విస్ట్‌లు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ సినిమాలో టోనీ జా చేసే ఫైటింగ్‌ సన్నివేశాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. యాక్షన్‌ ప్రియులకు తప్పకుండా నచ్చుతుందీ సినిమా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు