సంక్షిప్త వార్తలు (5)

Eenadu icon
By Cinema Desk Published : 02 Nov 2025 02:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

క్రికెట్‌ నేపథ్యంలో కామెడీగా 

సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం... ‘జి.ఓ.ఏ.టి’ (గోట్‌). ఎమ్‌ చంద్రశేఖర్‌ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే టీజర్‌ని విడుదల చేయనున్నట్టు నిర్మాత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రికెట్‌ నేపథ్యంలో... కామెడీ ప్రధానంగా సాగే కథ ఇదని, ప్రస్తుతం తుదిదశ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని అందులో పేర్కొన్నారు. మొట్ట రాజేంద్రన్, సర్వదమన్‌ బెనర్జీ, నితిన్‌ ప్రసన్న, పృథ్వీ, ఆడుకలం నరైన్, ఆనంద రామరాజు, పమ్మిసాయి, చమ్మక్‌చంద్ర, నవీన్‌ నేని తదితరులు నటించారు. 


‘స్కూల్‌ లైఫ్‌’.. గుర్తుండిపోతుంది 

పులివెందుల మహేశ్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘స్కూల్‌ లైఫ్‌’. గంగా భవాని నిర్మాత. సావిత్రి, షన్ను కథానాయికలు. సుమన్, ఆమని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నటుడు సుమన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. నేనిప్పటి వరకు పోషించిన పాత్రల్లో నా మనసుకు చాలా దగ్గరైన పాత్ర దీంట్లోనిదే అనిపించింది. రైతులకు అండగా నిలిచే రైతుగా నా పాత్ర ఉంటుంది. కచ్చితంగా ఈ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రానికి కథే హీరో. ఈ సినిమా కోసం నేను ఎన్నో పోగొట్టుకున్నా. క్రౌడ్‌ ఫండింగ్‌తో నిర్మించిన ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు హీరో, దర్శకుడు   పులివెందుల మహేశ్‌. ఈ కార్యక్రమంలో షన్ను, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.  


అనుపమ్‌ కొత్త చిత్రం ఖరారు

బాలీవుడ్‌ నటుడు  అనుపమ్‌ ఖేర్‌ కొత్త సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. ఆయన ఈ ప్రాజెక్ట్‌ కోసం దర్శక నిర్మాత సూరజ్‌ బర్జాత్యతో కలిసి పనిచేస్తున్నట్లు ఇన్‌స్టా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ‘‘ఇంకా పేరు ఖరారు చేయని నా 549వ సినిమా దర్శకుడు సూరజ్‌ బర్జాత్యతో ప్రారంభమైందని పంచుకోవడానికి సంతోషంగా ఉంది. సూరజ్‌ నా మొదటి చిత్రానికి ఐదవ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. సుదీర్ఘకాలం తర్వాత ఆయనతో కలిసి పనిచేయడం సృజనాత్మకతతో కూడిన అద్భుతమైన ప్రయాణంగా భావిస్తున్నాను’’ అనే క్యాప్షన్‌తో అనుపమ్‌ ఓ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం గోప్యంగా ఉంచిన ఈ సినిమా తారాగణం వివరాల్ని చిత్రబృందం త్వరలోనే వెల్లడించనుంది. 


వసుదేవసుతం దేవం

మాస్టర్‌ మహేంద్రన్‌ హీరోగా వైకుంఠ్‌ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. ధనలక్ష్మి బాదర్ల నిర్మాత. అంబికా వాణి, జాన్‌ విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర టైటిల్‌ గీతాన్ని హీరో ఆకాశ్‌ జగన్నాథ్‌ ఇటీవల విడుదల చేశారు. ‘‘వసుదేవసుతం దేవం’’ అంటూ సాగే ఈ పాటకు మణిశర్మ స్వరాలు సమకూర్చగా.. చైతన్య ప్రసాద్‌ సాహిత్యమందించారు. పవన్‌ - శృతిక సముద్రాల ఆలపించారు. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉందని.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి జిజ్జు సన్నీ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. 


నాగలోకంలోకి రూహ్‌బాబా 

గతేడాది ‘భూల్‌ భులయ్యా’ చిత్రంలో రూహ్‌ బాబాగా ప్రేక్షకుల్ని పరుగులు పెట్టించిన కార్తిక్‌ ఆర్యన్‌.. ఇప్పుడు నాగలోకంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాగ్జిల్లా’. ఈ ఫాంటసీ అడ్వెంచర్‌కు మృగ్‌దీప్‌ సింగ్‌ లంబా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించినట్లు తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు కార్తిక్‌. ‘‘భూల్‌ భులయ్యా 3’ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ‘నాగ్జిల్లా’ చిత్రాన్ని మొదలుపెడుతున్నాం’’ అనే వ్యాఖ్యను జోడించారు. ఇందులో ఆయన పాము, మనిషిలా రెండు భిన్న కోణాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్, మహావీర్‌ జైన్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకురానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు