రష్మికకు రెట్టింపు పారితోషికం ఇస్తాం

Eenadu icon
By Cinema Desk Updated : 02 Nov 2025 05:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

‘‘అందరికీ కనెక్ట్‌ అయ్యే ప్రత్యేకత ప్రేమకథలకు ఉంటుంది. ప్రేక్షకులపై గాఢమైన ప్రభావం చూపించే ప్రేమకథల్ని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాం. ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ అలాంటి కథే’’ అంటున్నారు ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి. ఈ ఇద్దరి నిర్మాణంలో... రష్మిక, దీక్షిత్‌ శెట్టి జంటగా తెరకెక్కిన చిత్రమే ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఈ నెల 7న తెలుగు, హిందీ భాషల్లోనూ, ఈ నెల 14న తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో సమావేశంలో ధీరజ్‌ మొగిలినేని మాట్లాడుతూ ‘కళాశాల నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. రష్మిక ఉన్నారని అందరూ కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రం అనుకుంటున్నారు. కథ.. నాయిక కోణంలో సాగుతుందంతే. దీక్షిత్‌ శెట్టి మంచి నటుడనే తనని కథానాయకుడిగా ఎంపిక చేసుకున్నాం. కథ ప్రేక్షకులపైన బలమైన ప్రభావం చూపిస్తుంది. మాకే కాదు, రష్మికకూ కథ అంతే నచ్చింది. అందుకే ఆమె పారితోషికం కూడా తీసుకోకుండా నటించారు. మేం మాత్రం సినిమా విడుదల తర్వాత  ఆమెకు రెట్టింపు పారితోషికం ఇవ్వబోతున్నాం. ముందస్తు విడుదల వేడుకకికానీ, విజయోత్సవానికిగానీ విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయ’న్నారు. ‘‘గీతా ఆర్ట్స్‌ సంస్థలో కథల ఎంపికకు సంబంధించి సమష్టిగానే నిర్ణయం తీసుకుంటాం. మా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన కథ ఇద’’ని చెప్పారు విద్య.

Tags :
Published : 02 Nov 2025 02:18 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు