Sharon Stone: ‘నీ తల్లి శృంగార చిత్రాలు చేస్తుంది తెలుసా’ అని జడ్జి మా అబ్బాయిని అడిగారు!

Sharon Stone: ‘బేసిక్‌ ఇన్‌స్టింక్ట్‌’ మూవీ తాను చేసిన పాత్ర వల్ల తన కుమారుడిని కోల్పోవాల్సి వచ్చిందని హాలీవుడ్‌ నటి షరాన్‌ స్టోన్‌ విచారం వ్యక్తం చేశారు.

Published : 12 Mar 2023 01:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తాను నటించిన ఒక సినిమాలోని ఒక అసభ్య సన్నివేశం వల్ల తన వద్ద పెరగాల్సిన కొడుకు దూరమయ్యాడని హాలీవుడ్‌ నటి షరాన్‌స్టోన్‌ (Sharon Stone) తాజాగా విచారం వ్యక్తం చేసింది. 1992లో ‘బేసిక్‌ ఇన్‌స్టింక్ట్‌’ ( Basic Instinct) లో షరాన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా విడుదల తర్వాత రాత్రికిరాత్రే ఆమె స్టార్‌ స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు. శృంగారతారగా మంచి పేరు వచ్చింది. అయితే, ఇదే సినిమా తన కుమారుడిని ఆమెకు దూరం చేసింది.

ఈ విషయమై ‘ఐహార్ట్‌రేడియో’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. భర్త ఫిల్‌ బ్రోన్‌స్టెయిన్‌ నుంచి విడాకులు కోరుతూ 2000 సంవత్సరంలో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా జరిగిన విచారణలో న్యాయమూర్తి అడిగిన ప్రశ్న అత్యంత విచారకరమని అన్నారు. అదే తన కుమారుడిని తనకు కాకుండా దూరం చేసిందని వాపోయారు. ‘‘నా దగ్గర పెరగాల్సిన మా అబ్బాయి నాకు దూరమయ్యాడు. ఆ రోజు విచారణ సందర్భంగా న్యాయమూర్తి చిన్నవాడైన నా కుమారుడిని ‘మీ అమ్మ శృంగార సినిమాలు చేస్తారని నీకు తెలుసా’ అని అడిగారు. ఆ సినిమా చేయడం వల్లే కదా నేను ఏరకమైన తల్లినో ఎత్తి చూపే ప్రయత్నం చేశారు.  ‘బేసిక్‌ ఇనిస్టింక్ట్’లోని  సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ నన్ను అపఖ్యాతి పాలు చేశారు. నన్ను సంప్రదించకుండా దర్శకుడు ఆ న్యూడ్‌ సీన్‌ను నేరుగా సినిమాలో పెట్టేశాడు. ఇప్పుడు చాలా మంది దుస్తుల్లేకుండానే టీవీల్లో కనిపిస్తున్నారు. దాంతో పోలిస్తే, నా పదహారు సెకన్ల న్యూడ్‌ వీడియో ఏపాటిది’’ అంటూ చెప్పుకొచ్చారు.

1993 గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల నామినేషన్స్‌ సందర్భంగానూ తన పేరు పిలవగానే అందరూ నవ్వుకున్నారని అది తనని ఎంతగానో బాధించిందని షరాన్‌ అన్నారు. ‘అది నిజంగా భయానకం. నేను అవమానానికి, హేళనకు గురయ్యా. అలాంటి సన్నివేశంలో నటించడం ఎలా ఉంటుందో ఎవరికైనా ఐడియా ఉంది. సంక్లిష్టమైన ఆ సినిమా, పాత్ర అన్ని పరిధులను చెరిపేసింది. అందరి నుంచి వ్యతిరేకత వచ్చింది. ఒత్తిడి ఎదురైంది. దాదాపు 9 నెలల పాటు నన్ను ఆడిషన్‌ చేశారు. నాకు కాకుండా 13మందికి ఆ పాత్రను ఆఫర్‌ చేశారు. అలాంటి దాన్ని చూసి వాళ్లు నవ్వారు’ అని  తెలిపారు.  ఈ సినిమాతో అప్పటికి 34ఏళ్ల షరాన్‌ హాలీవుడ్‌ సినిమాల్లో సెక్స్‌ సింబల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆ సినిమా 300 మిలియన్‌ డాలర్లు వసూలు చేసి అప్పట్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని