KGF3: ‘కేజీఎఫ్‌-3’ వచ్చేది అప్పుడేనా..!

Eenadu icon
By Entertainment Team Published : 29 Sep 2023 17:17 IST
Ee
Font size
  • A
  • A+
  • A++

హైదరాబాద్‌: ప్రశాంత్‌ నీల్‌- యశ్‌ (Yash) కాంబినేషన్‌లో వచ్చిన ‘కేజీఎఫ్‌’ సిరీస్‌ సినిమాలు సంచలనం సృష్టించాయి. విశేషమైన ప్రేక్షకాదరణ పొందడంతో పాటు కాసుల వర్షం కురిపించాయి. దీంతో వీరి కాంబో ఒక బ్రాండ్‌గా మారింది. అయితే, రెండు భాగాలుగా అలరించిన ఈ సినిమా మూడో పార్ట్ కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘కేజీఎఫ్‌-3’కు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది.

ఈ చిత్రం వచ్చే ఏడాది అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. 2025లో ప్రేక్షకుల ముందుకు రానుందట. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలు కానున్నాయని టాక్‌ వినిపిస్తోంది. మొదటి రెండు భాగాలకు వచ్చిన ప్రేక్షకాదరణను దృష్టిలో ఉంచుకొని మూడో పార్ట్‌ను తీర్చిదిద్దనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన డిసెంబర్‌లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మూడో భాగంలో రాఖీ భాయ్‌ కనిపించకుండా పోయిన ఆ నాలుగేళ్లలో ఎక్కడున్నాడు? ఏం చేశాడు? అన్నది చూపించనున్నారు. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) ‘సలార్‌’ పనుల్లో బిజీగా ఉన్నారు. డిసెంబర్‌ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నారు. అయితే ఎన్టీఆర్‌ సినిమా కంటే ముందే ‘కేజీఎఫ్‌-3’ చేస్తారా?అనేది తెలియాల్సి ఉంది.

‘రాజారాణి’ టు ‘జవాన్‌’.. నేనెంతో గర్వపడుతున్నా: అట్లీ సతీమణి పోస్ట్‌

మరోవైపు యశ్‌ కూడా తన తర్వాతి సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఆయన హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ జేజేపెర్రీతో దిగిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఆయన దగ్గర యశ్ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. మలయాళం దర్శకురాలు గీతు మోహన్‌దాస్‌ దర్శకత్వంలో యశ్‌ తన తదుపరి సినిమా (Yash 19) చేయనున్నట్లు సమాచారం. ఈ డిసెంబర్‌లోనే దీని షూటింగ్‌ మొదలు కానుందని టాక్‌. దీని తర్వాత ‘కేజీఎఫ్‌-3’ ప్రాజెక్టులో ఆయన జాయిన్‌ అవుతారని అంటున్నారు. ఈ ఊహాగానాలన్నింటికీ పుల్‌స్టాప్‌ పడాలంటే యశ్‌, ప్రశాంత్‌నీల్‌ నుంచి ఒక ప్రకటన వెలువడాలి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

లైవ్ టీవీ