LGM Movie Review: సినిమా రివ్యూ: ఎల్‌జీఎం.. ధోని సతీమణి సాక్షి నిర్మించిన మూవీ మెప్పించిందా?

LGM Movie Review in telugu: క్రికెటర్‌ ధోని సతీమణి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ‘ఎల్‌జీఎం’ సినిమా ఎలా ఉందంటే?

Updated : 04 Aug 2023 15:24 IST

LGM Movie Review; చిత్రం: ఎల్‌జీఎం; నటీనటులు: హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు, ఆర్జే విజయ్, వీటీవీ గణేష్, వెంకట్ ప్రభు, శ్రీనాథ్, మోహన్ వైద్య తదితరులు; సినిమాటోగ్రఫీ: విశ్వజిత్ ఒదుక్కత్తిల్; నిర్మాతలు: సాక్షి సింగ్ ధోని, వికాస్ హస్జా; సంగీతం, దర్శకత్వం: రమేష్ తమిళ్ మణి; నిర్మాణ సంస్థ: ధోని ఎంటర్‌టైన్‌మెంట్; విడుదల తేదీ: 04-08-2023

క్రికెట‌ర్ ధోని భార్య సాక్షి ధోని సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టి తీసిన తొలి చిత్రం ‘ఎల్‌.జి.ఎమ్‌’ (Lets Get Married). ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పేరుతో ఏర్పాటైన నిర్మాణ సంస్థ నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌డంతో అన్ని భాష‌ల్లోనూ ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి క‌నిపించింది. త‌మిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో అనువాదంగా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ వారాంతంలో విడుద‌లైన కీల‌క చిత్రం అంటే ఇదే. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? (LGM Movie Review in telugu) న్యూఏజ్‌ లవ్‌ డ్రామా మెప్పించిందా?

క‌థేంటంటే: గౌతమ్ (హరీష్ కళ్యాణ్), మీరా (ఇవానా) ఒకేచోట ప‌నిచేస్తూ రెండేళ్ల‌పాటు డేటింగ్ చేస్తారు. ఆ త‌ర్వాత గౌత‌మ్ పెళ్లి ప్ర‌తిపాద‌న తీసుకురావ‌డంతో మీరా ఓకే చెబుతుంది. తీరా ఇరు కుటుంబాలు క‌లిసి మాట్లాడుకునే స‌మ‌యంలో మీరా ఓ ష‌ర‌తు విధిస్తుంది. పెళ్లయిన తర్వాత అత్తతో సమస్యలు తలెత్తకుండా ఉండటానికి ముందే ఆమెతో క‌లిసి కొన్ని రోజులు గడపాలని కోరుకుంటుంది. అందుకోసం ఓ టూర్ ప్లాన్ చేస్తుంది. ఈ వింత ప్రతిపాదనకు గౌత‌మ్ అంగీకరించి ఆఫీస్ ట్రిప్ అని అబ‌ద్ధం చెప్పి త‌న త‌ల్లిని ఒప్పిస్తాడు. అలా అంద‌రూ క‌లిసి కూర్గ్‌కి బ‌య‌ల్దేరతారు. వెళ్లాక ఏం జ‌రిగింది?మీరా-గౌత‌మ్ త‌ల్లితో క‌లిసిపోయిందా? (LGM Movie Review) లేదా?గౌత‌మ్‌తో మీరా పెళ్లికి ఒప్పుకొందా? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: త‌న జీవిత భాగ‌స్వామిని అర్థం చేసుకుంటే చాల‌దు, జీవితాంతం క‌లిసుండే అత్త‌గారి మ‌న‌స్త‌త్వం కూడా అర్థం కావాల్సిందే అని ప‌ట్టుబ‌ట్టిన ఓ న‌వ‌త‌రం అమ్మాయి చుట్టూ తిరిగే క‌థ ఇది. దాంతో ఓ అబ్బాయి, అమ్మాయి పెళ్లి క‌థ‌లా మొద‌లై, కాబోయే అత్తా కోడ‌ళ్ల డేటింగ్ క‌థ‌గా ముగుస్తుందీ చిత్రం. న‌వ‌త‌రం ఆలోచ‌న‌ల‌కి ద‌గ్గ‌ర‌గా ఉండే క‌థాంశమిది. ఆలోచ‌న బాగున్నా... క‌థ‌ని న‌డిపించిన విధానంలోనే ప‌రిణ‌తి లోపించింది. ఓ చిన్న ఆలోచ‌న‌ని సినిమాగా మ‌లచాల‌నుకున్న‌ప్పుడు క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా త‌గిన క‌స‌ర‌త్తులు చేయాల్సిందే. ఆ విష‌యంలోనే ద‌ర్శ‌కుడు తడబడ్డాడు. (LGM Movie Review in telugu) అక్క‌డ‌క్క‌డా న‌వ్వించే కొన్ని స‌న్నివేశాలు మిన‌హా క‌థ‌నం ఎక్క‌డా ఆస‌క్తిని రేకెత్తించ‌దు. రెండేళ్ల డేటింగ్ త‌ర్వాత కూడా త‌న మ‌న‌సులో మాట‌ని చెప్పేందుకు త‌ట‌ప‌టాయించ‌డం, వాష్‌రూమ్‌లో త‌న ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో మంత‌నాలు జ‌ర‌ప‌డం వంటి స‌న్నివేశాతో సినిమా ఆరంభం అవుతుంది.

నాయ‌కానాయిక‌లు క‌లిసి టూర్ ప్లాన్ చేశాకే క‌థ‌లో కాస్త ఊపు వ‌స్తుంది. యోగిబాబు ఎంట్రీతో కొన్ని న‌వ్వులు పండినా, ఆ త‌ర్వాత బ‌స్‌లో స‌న్నివేశాలు మ‌రీ సాగ‌దీత‌గా అనిపిస్తాయి. విరామ స‌న్నివేశాలు ఆస‌క్తిని రేకెత్తించినా, ఆ త‌ర్వాత స‌న్నివేశాల్లో బ‌లం లేదు. న‌దియా, ఇవానా క‌లిసి గోవాలో చేసే సంద‌డి కాస్త మెప్పిస్తుందంతే. (LGM Movie Review in telugu) ప‌తాక స‌న్నివేశాల్లో అడ్వెంచరస్‌ డ్రామాని జోడించారు. పులితో క‌లిసి సాగే ఆ స‌న్నివేశాలు మ‌రీ నాట‌కీయంగా అనిపిస్తాయి త‌ప్ప పెద్ద‌గా మెప్పించ‌వు. క‌థ‌లో ఎక్క‌డా సంఘ‌ర్ష‌ణ లేక‌పోవ‌డంతో క‌థ నిస్సారంగానే ముగుస్తుంది. అక్క‌డ‌క్క‌డా కాసిన్ని న‌వ్వుల్ని పంచి కేవలం కాల‌క్షేపం కోసమే సినిమా ఇది.

ఎవ‌రెలా చేశారంటే: హ‌రీశ్ క‌ల్యాణ్, ఇవానా జోడీ బాగుంది. ఆ ఇద్ద‌రూ న‌వ‌త‌రం జోడీగా పాత్ర‌ల‌కి త‌గ్గ‌ట్టుగా చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. హ‌రీశ్‌కి న‌టించే అవ‌కాశం పెద్ద‌గా లేదు. అత‌ని లుక్స్ మాత్రం బాగున్నాయి. ఇవానా అందంతో ఆక‌ట్టుకుంటుంది. న‌దియా సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ఆమె క‌థానాయ‌కుడి త‌ల్లిగా మంచి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. ద్వితీయార్ధంలో ఓ పాటలోనూ ఆమె చేసిన సంద‌డి ఆక‌ట్టుకుంటుంది. క‌థానాయ‌కుడి స్నేహితుడిగా ఆర్జే విజ‌య్ అక్క‌డ‌క్క‌డా న‌వ్వించాడు. యోగిబాబు బ‌స్ డ్రైవ‌ర్‌గా త‌న‌దైన శైలిలో న‌వ్వించాడు. (LGM Movie Review in telugu) అయితే కొన్ని జోక్స్ న‌వ్వించ‌గా, కొన్ని బ‌ల‌వంతంగా అనిపిస్తాయి. సాంకేతిక విభాగాలు మంచి ప‌నితీరునే క‌న‌బ‌రిచాయి. సంగీత బాధ్య‌త‌ల్నీ భుజాన వేసుకున్న ద‌ర్శ‌కుడు పాట‌ల వ‌ర‌కూ ఓకే అనిపిస్తారు. ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం ప‌రంగా ఆయ‌న పెద్ద‌గా ప‌రిణ‌తి ప్ర‌ద‌ర్శించలేక‌పోయారు. నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగానే ఉంది.

  • బ‌లాలు
  • + ప్ర‌ధాన క‌థాంశం
  • + న‌టీన‌టులు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - క‌థ‌నం
  • - సాగ‌దీత‌గా స‌న్నివేశాలు
  • చివ‌రిగా: బోరింగ్‌ ఎల్‌.జి.ఎమ్‌. (LGM Movie Review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని