Naga Chaitanya: నా కెరీర్‌లోనే ప్రత్యేకం తండేల్‌

‘‘ప్రేమకథల్లో నన్ను చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారు. ఆ కథలంటే నాకూ అంతే ఇష్టం. కాకపోతే ఈమధ్య కథల ఎంపికపై సరిగ్గా దృష్టి పెట్టకపోవడంతో ఎదురు దెబ్బలు తగిలాయి.

Updated : 23 Nov 2023 09:43 IST

‘‘ప్రేమకథల్లో నన్ను చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారు. ఆ కథలంటే నాకూ అంతే ఇష్టం. కాకపోతే ఈమధ్య కథల ఎంపికపై సరిగ్గా దృష్టి పెట్టకపోవడంతో ఎదురు దెబ్బలు తగిలాయి. ఇక నుంచి అలా జరగదు’’ అన్నారు కథానాయకుడు నాగచైతన్య. అక్కినేని కుటుంబానికి అచ్చొచ్చిన  ప్రేమకథలపై తనదైన ముద్ర వేసిన ఆయన... అప్పుడప్పుడూ విభిన్నమైన ప్రయత్నాలూ చేస్తుంటారు. కొత్త చిత్రం ‘తండేల్‌’ కోసం సుదీర్ఘ విరామం తీసుకుని సన్నద్ధమవుతున్నారు. మరోవైపు ఆయన నటించిన వెబ్‌ సిరీస్‌ ‘దూత’ డిసెంబరు 1 నుంచి ప్రదర్శనకి సిద్ధంగా ఉంది. గురువారం నాగచైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

పుట్టినరోజుని ఎలా చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు?

నా ప్రతి పుట్టినరోజు కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యే గడుస్తుంటుంది. వాళ్లతో కలిసి సమయం గడపడంలోనే ఆనందం వెతుక్కుంటా. మరోవైపు అభిమానులు వేడుకలు జరుపుతుంటారు. వాటిలో భాగం అవుతుంటాను. ఈసారి పుట్టినరోజున ‘దూత’ ట్రైలర్‌ విడుదలవుతోంది. నేను నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ అది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న నా కొత్త సినిమా ‘తండేల్‌’ లుక్‌తో ఆ సందడి కూడా మొదలైంది.

తొలిసారి వెబ్‌సిరీస్‌ ‘దూత’లో నటించారు. ఆ అనుభవాల్ని పంచుకుంటారా?

అతీంద్రీయ శక్తుల నేపథ్యంలో థ్రిల్లర్‌ కథల్ని తెరకెక్కించడంలో మాస్టర్‌ దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌. తను తీసిన ‘13బి’, ‘24’ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ‘మనం’లో కూడా కొద్దివరకు అలాంటి ఛాయలు ఉంటాయి. ఈసారి కూడా ఓ విభిన్నమైన కథతో వచ్చారు. నాకు చాలా నచ్చింది. అయితే మొదట ఇది సిరీస్‌ కోసం అని చెప్పలేదు. ఇలాంటి కథని రెండున్నర గంటల్లో చెప్పడం కష్టం. అందుకే వెబ్‌సిరీస్‌ అయితేనే న్యాయం జరుగుతుందని భావించి ‘దూత’ మొదలుపెట్టాం. ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఇందులోని థ్రిల్‌ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. నటుడిగా నాకు సినిమాకీ, వెబ్‌ సిరీస్‌కి పెద్దగా వ్యత్యాసమేమీ కనిపించలేదు.  కథని వీలైనంత సవివరంగా చెప్పే అవకాశం ఈ సిరీస్‌తో లభించింది. ఈ సిరీస్‌ని 2, 3 సీజన్లుగా తీసేందుకు సరిపడా ఆలోచనలు విక్రమ్‌ దగ్గర ఉన్నాయి.

చందూ మొండేటితో కలిసి చేస్తున్న ‘తండేల్‌’ ఎలా ఉంటుంది?

నా కెరీర్‌లోనే అధిక వ్యయంతో రూపొందుతున్న చిత్రమిది. విస్తృత పరిధి ఉన్న కథ. కొంత భాగం ఇండియాలో, కొంత భాగం పాకిస్థాన్‌లో జరుగుతుంది. నా కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రం అవుతుంది. ఆరేడు నెలలుగా ఈ సినిమా బృందంతో కలిసి ప్రయాణం చేస్తున్నా. శ్రీకాకుళంలోని కె.మత్స్యలేశం గ్రామానికి వెళ్లి  మత్స్యకారుల్ని కలిశా. కొన్ని వర్క్‌షాప్‌ల్లో పాల్గొన్నా. యాస, హావభావాల గురించి ప్రత్యేకంగా సన్నద్ధమయ్యా. నిర్మాతలు అల్లు అరవింద్‌, బన్నీ వాస్‌, ఇతర బృందం కలిసి  ఈ సినిమా చాలా గ్రౌండ్‌ వర్క్‌ చేశాం. ఓ కొత్త నాగచైతన్యని చూస్తారు. ఎంతో నమ్మి చేస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.

ఇది ఓ మత్స్యకారుడి జీవిత కథ అనుకోవచ్చా?

ఓ మత్స్యకారుడి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకుని, సినిమాటిక్‌గా చెబుతున్న కథ ఇది. అనుభూతిని పంచే ప్రేమకథ ఈ సినిమాకి కీలకం. మా కథకి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తిని కూడా  కలిశా. ‘లవ్‌స్టోరి’ తర్వాత మళ్లీ సాయిపల్లవితో కలిసి ఇందులో నటిస్తున్నా. తన వల్ల కథకి మరింత బలం చేకూరినట్టైంది. తన కెరీర్‌లో చెప్పుకునే సినిమా అవుతుంది. డిసెంబరు తొలి వారం నుంచి చిత్రీకరణ మొదలవుతుంది.

నటుడిగా మీ ప్రయాణాన్ని వెనుదిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది?

విజయాలు చూశాను, పరాజయాలు చూశాను. వాటన్నిటితో ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నా. మంచి సినిమాలు, మంచి పాత్రలు...  చేయాల్సింది ఇంకా చాలా ఉందనే విషయం ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటుంది. అందుకోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటా.

కొత్తగా చేస్తున్న సినిమాల సంగతులేమిటి?

శివ నిర్వాణ, నేను కలిసి మరో సినిమా చేయాలి. దాని గురించి మేం మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతానికి  ఆ కథపైనే దృష్టిపెట్టా.


వ్యక్తిగత జీవితంలో ఏం జరిగినా నేనే స్వయంగా వెల్లడిస్తా. అందులో ఇబ్బందేమీ లేదు. ఇక నా గురించి బయటకు వచ్చే వదంతు అంటారా? వాటి గురించి నేనేం పట్టించుకోను. ప్రస్తుతానికి  నా దృష్టంతా నా సినిమాలపైనే ఉంది. కుదిరినప్పుడల్లా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటా. కానీ వాటి గురించి చెప్పుకోవడానికి ఇష్టం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని