Nagababu: ఆ విషయంలో వరుణ్‌ ఫెయిలయ్యాడు.. కానీ..!: నాగబాబు

Eenadu icon
By Entertainment Team Published : 26 Feb 2024 02:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

హైదరాబాద్‌: ఇండియన్‌ ఎయిర్‌ పైలట్‌గా వరుణ్‌ తేజ్‌ (Varun Tej) నటించిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) హీరోయిన్‌. శక్తి ప్రతాప్‌సింగ్‌ హడా దర్శకుడు. మార్చి 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. వరుణ్‌ తండ్రి, నటుడు నాగబాబు (Nagababu) ఓ అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ‘‘వరుణ్‌ ఎప్పుడూ కొత్తదనంతో నిండిన సినిమాలు చేయాలనుకుంటాడు. రిస్క్‌ తీసుకుంటాడు. ఆ క్రమంలో చాలా సార్లు ఫెయిలయ్యాడు. కానీ, కథలు, పాత్రలు ఎంపిక చేసుకునే విధానం నాకు బాగా ఇష్టం. కొడుకు విజయం అందుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో పరాజయం పొందినప్పుడు అంతే బాధ ఉంటుంది. నా బాధ తనకు, తన బాధ నాకు తెలుసు. తనకు మంచి పర్సనాలిటీ ఉంది. కొన్ని క్యారెక్టర్ల విషయంలో ఇలాంటి కటౌట్‌ ఉన్నవారు పెద్దగా పెర్ఫామెన్స్‌ చేయకుండా నిల్చున్నా చూసేందుకు బాగుంటుంది. జయాపజయాలకు అతీతంగా తను ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. ఒక్కోసారి మంచి ప్రయత్నాలు కూడా ఫెయిల్‌ అవుతాయి. దిగులు పడొద్దు. ప్రయత్నాలు చేస్తూ వెళ్తుంటే జీవితంలో సక్సెస్‌ అవుతారు’’ అని అన్నారు.

‘‘నా పిల్లలు, అందరి బిడ్డలు బాగుండాలి.. దేశ సరిహద్దుల్లో ఉండే సైనికులు బాగుండాలని మా అమ్మ దైవాన్ని ప్రార్థిస్తుంది. మా అమ్మ వాళ్ల నాన్న, మేనమామ, మా పెద్దనాన్న మిలటరీలో పనిచేశారు. టెక్నాలజీలేని రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదో పెద్దనాన్న చెప్పేవారు. యుద్ధంలో ఎయిర్‌ఫోర్స్‌ వారు ముందుగా ఎటాక్‌ చేస్తుంటారు. 1965 పాకిస్థాన్‌ వార్‌ సమయంలో అత్యాధునిక రాడార్‌ను అమెరికా ఆ దేశానికి అందించింది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అలీ బ్రదర్స్‌ సాహసోపేతంగా ఆ రాడార్‌ను ధ్వంసం చేశారు. 1962 చైనా వార్‌లో మన ఆర్మీ తెగువను చూసి చైనా ఆర్మీ ప్రశంసించింది’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు