Nene Vastunna Review: రివ్యూ: నేనే వస్తున్నా

Nene Vastunna Review: ధనుష్‌ కీలక పాత్రలో నటించిన ‘నేనే వస్తున్నా’ సినిమా ఎలా ఉందంటే?

Updated : 29 Sep 2022 14:18 IST

చిత్రం: నేనే వ‌స్తున్నా; న‌టీన‌టులు: ధ‌నుష్‌, ఎలీ అవ్రామ్‌, ఇందుజా ర‌విచంద్ర‌న్‌, ప్ర‌భు, యోగిబాబు, సెల్వ రాఘ‌వ‌న్‌, షెల్లీ కిషోర్‌, శ‌ర‌వ‌ణ సుబ్బ‌య్య త‌దిత‌రులు; క‌థ‌: సెల్వ రాఘ‌వ‌న్‌, ధ‌నుష్‌; సంగీతం:  యువ‌న్ శంక‌ర్ రాజా; ఛాయాగ్ర‌హ‌ణం: ఓం ప్ర‌కాశ్‌; నిర్మాత‌: క‌లైపులి ఎస్‌.థాను; ద‌ర్శ‌క‌త్వం: సెల్వ రాఘ‌వ‌న్‌; స‌మ‌ర్ప‌ణ‌:  గీతా ఆర్ట్స్; విడుద‌ల తేదీ: 29-09-2022

ఓ ఇమేజ్‌కు క‌ట్టుబ‌డ‌ని హీరో ధ‌నుష్‌. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ల‌తో ప్ర‌యోగాలు చేస్తుంటారు. ఓ న‌టుడిగా ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతి పంచుతుంటారు. ఇదే ఆయ‌న్ని త‌మిళ్‌తో పాటు తెలుగు వారికీ ద‌గ్గ‌ర చేసింది. ఇప్పుడాయ‌న ‘నేనే వ‌స్తున్నా’ అంటూ బాక్సాఫీస్ ముందుకు దూసుకొచ్చారు. ధ‌నుష్ సోద‌రుడు సెల్వ రాఘ‌వ‌న్ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. దీని విష‌యంలో చాలా ప్ర‌త్యేక‌త‌లే ఉన్నాయి.  దాదాపు 11ఏళ్ల విరామం త‌ర్వాత ధ‌నుష్ - సెల్వ రాఘ‌వ‌న్‌ కాంబినేషనన్‌లో రూపుదిద్దుకున్న సినిమా ఇది. దీనికి ఈ సోద‌రులిద్ద‌రూ సంయుక్తంగా క‌థ అందించారు. ఇందులో ధ‌నుష్ ద్విపాత్రాభిన‌యం చేశారు. ఇలా ఇన్ని ప్రత్యేక‌త‌ల‌తో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించిన ఈ సినిమా తెర‌పై ఎలా ఉంది? ధ‌నుష్ - సెల్వ రాఘ‌వ‌న్‌ల‌కు ఎలాంటి ఫ‌లితాన్ని అందించింది?

క‌థేంటంటే:  ప్ర‌భు (ధ‌నుష్‌)ది చాలా సంతోష‌మైన కుటుంబం. త‌న‌ని ఎంతో చ‌క్క‌గా అర్థం చేసుకున్న భార్య‌.. దేవ‌త లాంటి కూతురు.. ఈ ఇద్ద‌రే ఆయ‌న‌ ప్ర‌పంచం. సాఫీగా.. సంతోషంగా సాగిపోతున్న ఈ కుటుంబాన్ని ఓ దెయ్యం క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తుంది. దాని పేరు సోనూ. అది ప్ర‌భు కూతుర్ని ఆవహించి.. ఆమెను అశ‌క్తురాల్ని చేయ‌డం మొద‌లుపెడుతుంది. తను ఆ పాప‌ను వీడాలంటే ఖదీర్‌ (ధ‌నుష్‌)ను అంత‌మొందించాల‌ని ష‌ర‌తు విధిస్తుంది. ఇంత‌కీ ఆ ఖదీర్‌ మ‌రెవ‌రో కాదు ప్ర‌భు క‌వ‌ల సోద‌రుడే. మ‌రి వీళ్లిద్ద‌రూ ఎందుకు విడిపోయారు? అస‌లు ఖదీర్‌ గ‌త‌మేంటి? ఆ దెయ్యానికి ఇత‌నికీ ఉన్న సంబంధం ఏంటి? త‌న కుమార్తెను ర‌క్షించుకోవ‌డం కోసం ప్ర‌భు త‌న సోద‌రుడ్ని చంపాడా?  లేదా? అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే: ఇదొక విభిన్న‌మైన సైకో థ్రిల్ల‌ర్. దీనికి హార‌ర్ ట‌చ్ ఇస్తూ ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్‌. ఇద్ద‌రు క‌వ‌ల సోద‌రులు. ఓ కుర్రాడు మంచికి మారు పేరైతే.. మ‌రొక‌డు మృత్యువుకు ప్ర‌తిరూపంలా క‌నిపించే సైకో. తండ్రిని క్రూరంగా చంపాడ‌న్న కార‌ణంతో త‌ల్లి, త‌మ్ముడు అత‌న్ని చిన్న‌త‌నంలోనే ఒంట‌రిగా వ‌దిలేసి వెళ్లిపోతారు. మ‌రి ఇటు త‌ల్లి ప్రేమ‌కు, అటు సోద‌రుడి ప్రేమ‌కు దూర‌మైన ఆ కుర్రాడు చివ‌రికి ఎలా మారాడు? అత‌ని వ‌ల్ల ఆ త‌ల్లీ కొడుకులిద్ద‌రికీ ఎలాంటి స‌వాళ్లెదుర‌య్యాయి? అన్న‌ది ఆస‌క్తికరం. భావోద్వేగాల‌కు, థ్రిల్లింగ్ అంశాల‌కు బోలెడంత ఆస్కార‌మున్న క‌థ ఇది. అయితే దీన్ని ఉత్కంఠ‌భ‌రితంగా తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో ద‌ర్శ‌కుడు రాఘ‌వ‌న్ ఆది నుంచే త‌డ‌బ‌డ్డాడు. ఖదీర్‌ బాల్యానికి సంబంధించిన ఎపిసోడ్స్‌తో సినిమా ప్రారంభించిన తీరు ఆస‌క్తిరేకెత్తిస్తుంది. ఆ త‌ర్వాత ప్ర‌భు ఫ్యామిలీ జీవితాన్ని ప‌రిచ‌యం చేస్తూ నెమ్మ‌దిగా క‌థ‌లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌భు కూతురు జీవితంలోకి దెయ్యం ప్ర‌వేశించాకే క‌థ‌లో వేగం పెరుగుతుంది.

పాప‌ను దెయ్యం ఆవ‌హించ‌డానికి ముందు.. ఇంట్లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు ఉత్కంఠ‌భ‌రితంగా ఉంటాయి. పాప గదిలో దెయ్యం ఉంద‌ని క‌నిపెట్ట‌డానికి ప్ర‌భు చేసే ప్ర‌య‌త్నాలు ఆస‌క్తిరేకెత్తిస్తాయి. త‌న బిడ్డ‌లోకి దెయ్యం ప్ర‌వేశించింద‌ని తెలిశాక.. అత‌ను ప‌డే ఆవేదన హృద‌యాల్ని త‌డి చేస్తుంది. విరామానికి ముందు దెయ్యం ఖదీర్‌ను చంపాల‌ని ష‌ర‌తు విధించ‌డం.. అత‌ని కోసం ప్ర‌భు రంగంలోకి దిగ‌డంతో ద్వితీయార్ధంలో ఏం జ‌ర‌గ‌నుంద‌న్న ఆస‌క్తి మొద‌ల‌వుతుంది. సెకండాఫ్‌ మొత్తం ఖదీర్‌ కుటుంబం.. అత‌ని గ‌తం చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్ర‌ను తీర్చిదిద్దిన విధానం.. ప‌రిచ‌యం చేసిన తీరు ఆక‌ట్టుకుంటాయి. అయితే ఆ పాత్ర‌కు సంబంధించిన గ‌తం ఏమాత్రం మెప్పించ‌దు. సాధార‌ణంగా సైకో థ్రిల్ల‌ర్ క‌థ‌ల్లో.. సైకో తాలూకూ గ‌తం ఎంత సంఘ‌ర్ష‌ణ‌తో నిండి ఉంటే ఆ పాత్రతో ప్రేక్ష‌కులు అంత బాగా క‌నెక్ట్ అవ్వ‌గ‌లుగుతారు. అది ఈ చిత్రంలో మిస్స‌య్యింది. అస‌లు ఖదీర్‌ సైకోగా మార‌డానికి వెన‌కున్న కారణ‌మేంట‌న్న‌ది ఎక్క‌డా చూపించ‌లేదు. ఫ‌లితంగా ఈ అన్న‌ద‌మ్ముల మ‌ధ్య సాగే పోరు అంత ర‌స‌వ‌త్త‌రంగా అనిపించ‌దు. సినిమాని ముగించిన తీరు ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: ఈ క‌థ‌ను పూర్తిగా త‌న భుజాల‌పైనే మోశాడు ధ‌నుష్‌. తండ్రి పాత్ర‌లో ఎంత చ‌క్క‌గా భావోద్వేగాలు ప‌లికించారో.. సైకో పాత్ర‌లోనూ అంతే గొప్ప‌గా విల‌నిజం చూపించారు. ఖదీర్‌ పాత్ర ధ‌నుష్ అభిమానుల‌కూ స‌ర్‌ప్రైజింగ్‌గానే ఉంటుంది. ఆ పాత్ర‌లో సైకోగా ఆయ‌న ప‌లికించే హావ‌భావాలు, మ‌నుషుల్ని చంపే స‌న్నివేశాల్లో ఆయ‌న న‌ట‌న గ‌గుర్పాటుకు గురిచేస్తాయి.  ధ‌నుష్ కూతురిగా న‌టించిన అమ్మాయి చాలా బాగా చేసింది. చ‌క్క‌టి హావ‌భావాల‌తో మెప్పిస్తుంది. ఈ చిత్రంలో నాయిక‌లిద్ద‌రి పాత్ర‌లూ ప‌రిధి మేర‌కే ఉంటాయి. సీరియ‌స్‌గా సాగే క‌థ‌లో అక్క‌డ‌క్క‌డా న‌వ్వులు పూయించేది యోగిబాబు చేసిన గుణ పాత్రే. ఇది కూడా క‌థ ప‌రిధి మేర‌కే ఉంటుంది. క‌థ‌లో కొత్త‌ద‌న‌మున్నా.. దాన్ని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దుకోవ‌డంలో ధ‌నుష్‌, సెల్వ రాఘ‌వ‌న్ విఫ‌ల‌మ‌య్యారు. ఖదీర్‌ గ‌తాన్ని.. అత‌నిలోని సైకోయిజాన్ని మ‌రింత శ‌క్తిమంతంగా చూపిస్తూ.. క‌థ‌లో మ‌రిన్ని మ‌లుపులు జోడించి ఉంటే సినిమా మ‌రో స్థాయిలో ఉండేది.  క్లైమాక్స్‌ను హ‌డావుడిగా చుట్టేసిన‌ట్ల‌నిపిస్తుంది. యువ‌న్ శంక‌ర్ రాజా నేప‌థ్య సంగీతం సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.  ఓం ప్ర‌కాశ్ ఛాయాగ్ర‌హ‌ణం ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి.

బ‌లాలు

+ క‌థా నేప‌థ్యం

+ ధ‌నుష్ న‌ట‌న‌

+ ప్ర‌ధ‌మార్ధం

బ‌ల‌హీన‌త‌లు

- నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం

- మ‌లుపులు లేక‌పోవ‌డం

చివ‌రిగా:  ‘నేనే వస్తున్నా’ థ్రిల్ల‌ర్ల‌ను ఇష్ట‌ప‌డేవారు.. ఓసారి చూడొచ్చు.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts