Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ

రవితేజ, వరుణ్‌ తేజ్‌.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి..

Published : 07 Feb 2024 02:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ‘ఈగల్‌’ (Eagle)తో రవితేజ (Ravi Teja), ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (operation valentine)తో వరుణ్‌తేజ్‌ (Varun Tej) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఇంటర్వ్యూ చేశారు. ‘ఆపరేషన్‌ ఈగల్‌ స్పెషల్‌’ పేరిట సంబంధిత వీడియో విడుదలైంది. అందులోనే.. ‘ఈగల్‌’ సినిమాలోని హీరో పాత్ర ఎలా ఉండబోతోందన్న విషయాన్ని ముందే చెప్పడం తనకు ఇష్టంలేదన్నారు రవితేజ. వారు ఇంకా ఏం మాట్లారంటే?

వరుణ్‌: సినిమాటోగ్రాఫర్‌ కార్తీక్‌ ఘట్టమనేని ‘సూర్య వర్సెస్‌ సూర్య’తో దర్శకుడిగా మారాడు. ఆయన వర్క్‌ నాకు ఇష్టం. మీకెలా అనిపించింది?

రవితేజ: నా ‘డిస్కో రాజా’, ‘ధమాకా’ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. ఇప్పుడు దర్శకుడిగా నాతో ‘ఈగల్‌’ తెరకెక్కించాడు. స్క్రిప్టు విషయంలో పర్‌ఫెక్ట్‌. నేను పొడవాటి జుట్టుతో నటించడం ఇదే తొలిసారి. నాకు నేనే కొత్తగా కనిపించా. ఇలాంటి ఫీలింగ్‌ ఇంతకుముందు ‘విక్రమార్కుడు’ (విక్రమ్‌ సింగ్‌ రాథోడ్‌ క్యారెక్టర్‌) సినిమా విషయంలో కలిగింది. ఇంతకుమించి ఇప్పుడేం చెప్పలేను. సినిమా చూడాల్సిందే.

రవితేజ: మీ డైరెక్టర్‌ గురించి చెబుతావా?

వరుణ్‌: మా సినిమా దర్శకుడు శక్తిప్రతాప్‌ సింగ్‌ది రాజస్థాన్‌. అంతకుముందు పలు చిత్రాలకు వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌గా పనిచేశాడు. ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ కథ చెప్పడానికంటే ముందు ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించి కొన్ని విజువల్స్‌ షూట్‌ చేసి చూపించాడు. అప్పుడే అతడి సత్తా తెలిసింది. దర్శకత్వం కొత్తే అయినా నటన రాబట్టుకోవడంలో ఎక్కడా రాజీపడలేదు.

రవితేజ: మీ సినిమా ప్రకటన వచ్చాక ‘ఆపరేషన్‌ వాలెంటైనా?.. ఎవరో కొత్త దర్శకుడు అట’ అంటూ కొంత చర్చ జరిగింది. టీజర్‌ విడుదలయ్యాక అందరి అభిప్రాయం మారింది. మీ సినిమాలో ఏదో ఉందని అప్పుడే అర్థమైంది.

వరుణ్‌: అవును అన్నా. టైటిల్‌ చూసి కొందరు ఇదో లవ్‌స్టోరీ అనుకున్నారుగానీ కాదు. పుల్వామా దాడి ఆధారంగా ఈ సినిమా రూపొందింది. మేం భారత వాయుసేనతో కలిసి పనిచేశాం. వాళ్లు ఇచ్చిన సలహా మేరకు స్క్రిప్టులో కొన్ని మార్పులు చేశాం. చిత్రీకరణ మంచి అనుభూతి కలిగించింది.

అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్‌, నవదీప్‌, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషించిన ‘ఈగల్‌’ ఈ నెల 9న, మానుషి చిల్లర్‌ కథానాయికగా నటించిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ మార్చి 1న విడుదల కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని