Varun Tej: ఆ సీక్వెల్‌లో నేనెందుకు నటిస్తా?.. చరణ్‌ చేస్తాడు: వరుణ్‌ తేజ్‌

వరుణ్‌ తేజ్‌ తాజా చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఆయన పాల్గొని సందడి చేశారు.

Published : 20 Feb 2024 16:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ఎయిర్‌ పైలట్‌గా వరుణ్‌ తేజ్‌ (Varun Tej) నటించిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) హీరోయిన్‌. శక్తి ప్రతాప్‌సింగ్‌ హడా దర్శకుడు. మార్చి 1న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈసందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల కార్యక్రమం నిర్వహించారు. హీరో, హీరోయిన్‌, డైరెక్టర్‌, కీలకపాత్ర పోషించిన నవదీప్‌ తదితరులు హాజరై, పలు విశేషాలు మీడియాతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే  రామ్‌చరణ్‌ (Ram Charan) హిట్‌ సినిమా సీక్వెల్‌లో మీరు నటిస్తారా? అనే ప్రశ్న వరుణ్‌కు ఎదురైంది. అదే సినిమా అంటే..?

* సౌత్‌లో ఇలాంటి నేపథ్యంలో సినిమాలు తక్కువ సంఖ్యలో వచ్చాయి.  ఆడియన్స్‌కు రీచ్‌ అవుతుందా, లేదా అనే సందేహం కలిగిందా?

వరుణ్‌ తేజ్: సాయుధ బలగాలపై సినిమాలు తక్కువ వస్తున్నాయనే ఉద్దేశంతోనే ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ తెరకెక్కించాం. దేశభక్తి ప్రతిఒక్కరిలో ఉంటుంది. కానీ, అలాంటి చిత్రాలు ఎక్కువ రాకపోవడానికి కారణమేంటో నాకు తెలియదు.

* మీరు గతంలో నటించిన ‘కంచె’లో ఉన్న ఎమోషన్స్‌ ఈ సినిమాలో ఉంటాయా?

వరుణ్‌ తేజ్: నా బెస్ట్‌ చిత్రాల్లో ‘కంచె’ ఒకటి.  దేశభక్తి నిండిన అలాంటి చిత్రంలో నటించడం నా అదృష్టం. మళ్లీ ఆతరహా సినిమా అవకాశాలు రావట్లేదే? అని అనుకుంటున్న సమయంలో ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ వచ్చింది. ‘కంచె’కు మించిన ఎమోషన్స్‌ ఇందులో ఉంటాయి.

* ఇలాంటి కథలను ఏ కోణంలో ఆలోచించి ఎంపిక చేసుకుంటారు?

వరుణ్‌ తేజ్: సినిమా అనేది వ్యాపారం. ప్రేక్షకులు కూడా వినోదం కోసమే థియేటర్లకు వెళ్తారు. కొన్ని కథల్లో రియల్‌ హీరోల గురించి చెప్పే అవకాశం లభిస్తుంది. యువతకు స్ఫూర్తిన్నిచ్చే ఇలాంటి స్టోరీలను చెప్పాలని హీరోగా బాధ్యత ఉన్నా కమర్షియల్‌ అంశాలు ఉండేలా చూసుకుంటా.

* బాలీవుడ్‌ హీరోలు సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘టైగర్‌ 3’, హృతిక్‌ ‘ఫైటర్‌’ చిత్రాలు అనుకున్నంత స్థాయిలో హిట్‌ కాలేదు. అలాంటి జానర్‌ సినిమాతో మీరు అక్కడివారిని ఎంతవరకు మెప్పించగలననుకుంటున్నారు?

వరుణ్‌ తేజ్: ఒక సినిమా హిట్‌ కాకపోవడానికి ఆ కథా నేపథ్యమే కారణం కాదు. వెనక ఎన్నో రీజన్స్‌ ఉంటాయి. ఓ దేశాన్ని నెగిటివ్‌గా చూపించాలనేది మా ఉద్దేశం కాదు.

* ఈ చిత్రంలోని మీ లుక్‌ ‘ధ్రువ’లోని రామ్‌చరణ్‌ లుక్‌లా అనిపిస్తోంది. ఆయన పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు కాబట్టి ‘ధ్రువ-2’లో మిమ్మల్ని చూడొచ్చా?

వరుణ్‌ తేజ్: చరణ్‌ అన్నను చాలా కొత్తగా చూపించిన సినిమా ‘ధ్రువ’. మంచి విజయాన్ని అందించింది. అయినా దాని సీక్వెల్‌ నేనెందుకు చేస్తానండీ (నవ్వుతూ). అన్నయ్యే చేయొచ్చు.

* ఈ సినిమాలో నటించడం ఎలా అనిపించింది?

మానుషి చిల్లర్‌: ఇది నా మూడో సినిమా. తెలుగులో మొదటిది. ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ టీమ్‌ నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. 

* పుల్వామా దాడి ఇతివృత్తాన్నీ చూపించబోతున్నారు కదా. ఆ పేరుకు బదులు ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ అని పెట్టడానికి కారణమేంటి?

వరుణ్‌ తేజ్: సెక్యూరిటీ కారణాల వల్ల అలాంటి ఘటనలకు సంబంధించిన పేర్లు పెట్టకూడదు. అందుకే ఆపరేషన్‌ వాలెంటైన్ ఎంపిక చేశాం.

* ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’.. ఇటీవల విడుదలైన హృతిక్‌ రోషన్‌ ‘ఫైటర్‌’లా ఉంటుందని కొందరు భావిస్తున్నారు. మీరేమంటారు?

శక్తి ప్రతాప్‌: నేనూ ఫైటర్‌ చిత్రం చూశా. రెండింటికీ సంబంధం ఉండదు. ఎయిర్‌ఫోర్స్‌ గురించి చాలామందికి తెలియని విషయాలను మా సినిమాలో చూపించబోతున్నాం. ఇందులో యాక్షన్‌, లవ్‌ కూడా ఉంటాయి.

* ఏపీలో త్వరలో ఎలక్షన్స్‌ రాబోతున్నాయి. మీ బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ తరఫున క్యాంపెయిన్‌లో పాల్గొంటారా?

వరుణ్‌ తేజ్: మా బాబాయ్‌, జనసేన పార్టీకి ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని