Dilraju: ఎన్నో ఎత్తుపల్లాలు.. వాళ్ల మాటలు విని భయమేసింది: దిల్‌రాజు

Eenadu icon
By Entertainment Team Updated : 06 Jan 2025 15:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

హైదరాబాద్‌: ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) నిర్మాత దిల్‌ రాజు (Dil raju) తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించి సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను సక్సెస్‌ చేసినందుకు ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. సంక్రాంతి సినిమాలకు సంబంధించి టికెట్‌ ధరలు, బెనిఫిట్‌ షోలకు వెసులుబాటు కల్పించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. కొవిడ్‌ తర్వాత నుంచి కెరీర్‌ పరంగా తాను ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని అన్నారు. కొందరి మాటలు విని తాను ఎంతో భయపడ్డానని చెప్పారు. సక్సెస్‌ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉండలేమని తెలిపారు.

‘‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరగడానికి ప్రధాన కారణం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌. మేము అడగగానే ఆయన ముఖ్య అతిథిగా ఈవెంట్‌కు హాజరయ్యారు. నా జీవితంలో గొప్ప ఈవెంట్‌ అది. మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు అందరూ ముందు నిలబడి దానిని అద్భుతమైన కార్యక్రమంగా చేశారు. సంక్రాంతి సినిమాలకు సంబంధించి టికెట్‌ ధరల పెంపు, బెనిఫిట్‌ షోలకు ఆ రాష్ట్రంలో వెసులుబాటు కల్పించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌కు ధన్యవాదాలు. తెలుగు చిత్రాలకు అన్ని ప్రాంతాల్లో క్రేజ్‌, రేంజ్‌ పెరుగుతోంది. (గేమ్‌ ఛేంజర్‌ను ఉద్దేశించి) పాన్‌ ఇండియా రిలీజ్‌ కాబట్టి ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్నా. రెండు, మూడు రోజుల్లో పనులు పూర్తి చేసి కంటెంట్‌ను అన్ని ప్రాంతాలకు పంపించాలి. ఇదొక ప్రత్యేకమైన చిత్రం. 2021 ఆగస్టులో ఇది మొదలైంది. దాదాపు మూడున్నరేళ్ల ప్రయాణం. కొవిడ్‌ తర్వాత నుంచి ఎన్నో ఎత్తుపల్లాలు చూశా.

‘వకీల్‌ సాబ్‌’ చిత్రాన్ని 2020 మేలో విడుదల చేయాలని భావించా. లాక్‌డౌన్‌ కారణంగా 2021 మేలో విడుదల చేశాం. చాలా సంవత్సరాల గ్యాప్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌ నటిస్తోన్న చిత్రం. ఆయనకు నేను వీరాభిమానిని కావడం. ఇలా ఎంతో స్పెషల్‌గా ఆ సినిమాను రూపొందించాం. బ్లాక్‌బస్టర్‌ అవుతుందని భావించా. తీరా చూస్తే సినిమా విడుదలైన నాలుగు రోజులకే మళ్లీ కొవిడ్‌ వచ్చింది. థియేటర్లు మూసేశారు. ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాననే బాధతో సినిమా విడుదలైన వారానికే యూఎస్‌ వెళ్లిపోయా. ఆ తర్వాత ‘వారిసు’ తీశా. తమిళంలో తీయడం వల్ల అది తమిళ చిత్రమైంది. ఇక్కడ అనుకున్నంత రాలేదు కానీ, ఆ రాష్ట్రంలో మంచిగానే లాభాలు పొందా. ‘బలగం’ చేశా. ఎన్నో ప్రశంసలు అందుకున్నా. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయడం వల్ల ఇక్కడ వంద మార్కులు వస్తే మిగిలినచోట్ల 70 మార్కులే పడ్డాయి. యూనివర్సల్‌గా విజయం అందుకోలేకపోయా. అలా మూడున్నరేళ్ల ప్రయాణంలో నన్ను నేను విశ్లేషించుకున్నా. అదే సమయంలో ‘ఫ్యామిలీస్టార్‌’ విడుదలైంది. నా ఏడేళ్ల మనవడు ఫోన్‌ చేసి.. ‘‘తాత.. నువ్వు బాధలో ఉన్నావని తెలుసు. నీ చేతిలో గేమ్‌ ఛేంజర్‌ ఉంది. తప్పకుండా హిట్‌ కొడతావు’’ అన్నాడు. వాడి మాటలు నన్ను భావోద్వేగానికి గురి చేశాయి. చుట్టుపక్కల వాళ్లు కూడా నా గురించి అలాగే మాట్లాడుకోవడం నా వరకూ వచ్చింది. సినిమాల విషయంలో నా జడ్జిమెంట్‌ పోయిందని చాలామంది అనుకున్నారు. వాళ్ల మాటలకు ఎంతో భయపడ్డా’’ అని దిల్‌ రాజు అన్నారు.


Tags :
Published : 06 Jan 2025 10:29 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని