Ramayana: ‘రామాయణ’.. రణ్‌బీర్‌పై ట్రోల్స్‌.. సద్గురు ఏమన్నారంటే!

Eenadu icon
By Entertainment Team Published : 30 Oct 2025 08:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ డైరెక్టర్‌ నితీశ్‌ తివారీ రామాయణాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకుతీసుకురానున్న విషయం తెలిసిందే. ‘రామాయణ’ (Ramayana) పేరుతో ప్రతిష్ఠాత్మకంగా ఇది రూపొందుతోంది. అయితే ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ను ఎంపిక చేయడాన్ని కొందరు తప్పు పడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోల్స్‌పై ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ (Sadhguru) స్పందించారు. ఈ చిత్ర నిర్మాత నమిత్‌ మల్హోత్రాకు సద్గురు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన వీటిపై స్పందించారు. రాముడిగా రణ్‌బీర్‌ ఎంపికను సమర్థించారు.

‘‘అలా ట్రోల్ చేయడం అన్యాయం. గతంలో రణ్‌బీర్‌ అలాంటి పాత్రలు చేశాడు. ఇప్పుడు ఇలాంటి పాత్ర చేయడానికి వీల్లేదనడం అన్యాయమైన తీర్పు. భవిష్యత్తులో రాముడి పాత్ర చేయాల్సి వస్తుందని అతడికి తెలియదు కదా.. రేపు ఇంకో సినిమాలో రావణుడిగా నటించవచ్చు.. అప్పుడూ ట్రోల్స్‌ చేస్తారా?. అలా చేయడం సరైన పద్ధతి కాదు’’ అని అన్నారు. అలాగే ఈ సినిమాలో రావణుడి పాత్రలో యశ్‌ కనిపించనున్న విషయం తెలిసిందే. దీనిపై సద్గురు స్పందిస్తూ.. యశ్‌ అందమైన, తెలివైన వ్యక్తి అని చెప్పారు.

ఇక ‘రామాయణ’లో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ (Vivek Oberoi) కూడా నటిస్తున్నారు. ఆయన ఈ సినిమా కోసం తీసుకున్న పారితోషికం మొత్తాన్ని క్యాన్సర్‌ బాధిత పిల్లల చికిత్స కోసం విరాళంగా ఇచ్చినట్లు తాజాగా తెలిపారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్న వివేక్‌ ‘రామాయణ’తో భారతీయ చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందన్నారు.

రెండు భాగాలుగా రానున్న ఈ ప్రాజెక్ట్‌లో మొదటి పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ పూర్తయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని సమాచారం. రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రానున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi), రావణుడిగా యశ్‌, హనుమంతుడి పాత్రలో సన్నీదేవోల్‌ నటిస్తున్నారు. కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది. మొదటి పార్ట్‌ 2026 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదల కానున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని