Sharwanand: సమయంతో పోరాటం

Eenadu icon
By Cinema Desk Updated : 02 Nov 2025 10:34 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

‘‘భారతదేశంలో రూపొందిన తొలి మోటోక్రాస్‌ రేసింగ్‌ సినిమా మా ‘బైకర్‌’ అని గర్వంగా చెబుతా’’ అన్నారు శర్వానంద్‌. ఆయన కథానాయకుడిగా అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మాళవిక నాయర్‌ కథానాయిక. సీనియర్‌ హీరో రాజశేఖర్‌ ముఖ్యభూమిక పోషించారు. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై వంశీ - ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘ఇక్కడ ప్రతి బైకర్‌కీ ఒక కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ. చావుకు ఎదురెళ్లే కథ. ఏం జరిగినా పట్టువదలని మొండివాళ్ల కథ...’ అంటూ సాగే ప్రచార చిత్రంలో విజువల్స్‌ అలరిస్తున్నాయి. బైక్‌ రేసింగ్‌ దృశ్యాలు చూపు తిప్పుకోనివ్వవు. ‘ఇక్కడ గెలవడం గొప్ప కాదు, చివరిదాకా పోరాటం గొప్ప’ అనే సంభాషణ కథా నేపథ్యాన్ని పరిచయం చేస్తుంది.

ఈ చిత్రం కోసం శారీరకంగా ప్రత్యేకంగా సన్నద్ధమై నటించిన కథానాయకుడు శర్వానంద్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చేయడం ఒక పెద్ద సవాల్‌. ఇందులో కనిపించింది ఏదీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదు. ఇండోనేషియా వెళ్లి అక్కడ నిజమైన బైకర్స్‌తో తీసిన నిజమైన సన్నివేశాలే. చిత్రీకరణలో ఎన్నెన్నో సాహసాలు చేశాం. ఒక గొప్ప సినిమాని చేశామని గర్వంగా చెప్పుకోగలం. నా కెరీర్‌కి ఇదొక గొప్ప మలుపు అవుతుంది. ఇందులో కథానాయకుడు రాజశేఖర్‌తో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నా. ఆయన నటన చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇలాంటి సినిమా తీయాలంటే నిర్మాతలకి ఎంతో ధైర్యం కావాలి’’ అన్నారు. రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘బైకర్‌’ ప్రయాణాన్ని ప్రతిరోజూ ఆస్వాదించా. శర్వానంద్‌ ఈ సినిమాని డబ్బింగ్‌తో చూసి ‘మీరు చాలా బాగా చేశారు, ఈ పాత్ర చేసినందుకు కృతజ్ఞతలు’ అన్నారు. ఈ సినిమా ఓ గొప్ప అనుభవాన్ని పంచుతుంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ వచ్చిన రేసింగ్‌‘ సినిమాల్ని మించిన ఓ గొప్ప అనుభూతిని పంచుతుందీ చిత్రం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు యువరాజ్, నటులు నిరూప్‌తో పాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.


Tags :
Published : 02 Nov 2025 02:27 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని