Movie releases: మైదానంలో ఆట ముగిసింది ఇక థియేటర్లో..

ప్రపంచ కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు సినిమాపై గట్టి ప్రభావమే చూపించాయి. భారత జట్టు జైత్రయాత్ర అంతకంతకూ ప్రేక్షకుడిని టీవీలకి కట్టిపడేస్తూ వచ్చింది. మ్యాచ్‌ల కోసం ప్రత్యేకంగా ఎదురు చూసేలా చేసింది.

Updated : 20 Nov 2023 09:29 IST

ప్రపంచ కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు సినిమాపై గట్టి ప్రభావమే చూపించాయి. భారత జట్టు జైత్రయాత్ర అంతకంతకూ ప్రేక్షకుడిని టీవీలకి కట్టిపడేస్తూ వచ్చింది. మ్యాచ్‌ల కోసం ప్రత్యేకంగా ఎదురు చూసేలా చేసింది. ఆ పరిస్థితులు చూశాక క్రికెట్‌ తప్ప సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా లేరని దర్శకనిర్మాతలు కొన్నింటిని వాయిదా వేసుకున్నారు. విడుదలైన సినిమాలేమో చాలావరకు ఆదరణ దక్కక ఒకట్రెండు రోజుల్లోనే వెనుదిరిగాయి. కొన్ని సినిమాలకి బాగున్నాయనే టాక్‌ వచ్చినా సరే... అంతంత మాత్రం వసూళ్లతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. దీనంతటికీ కారణం క్రికెట్‌ ఫీవరే. ఆదివారంతో ప్రపంచకప్‌ ముగిసింది. ఇక వినోదం కోసం ప్రేక్షకుడికి ప్రత్యామ్నాయం సినిమానే. అసలు సిసలు ఆట మైదానం నుంచి సినిమా హాల్‌కి చేరుతోందన్నమాట.

మన దేశంలో క్రికెట్‌ ఓ మతం అంటుంటారు. భారతీయులకి సినిమా అంటే కూడా అంతే అభిమానం. వినోదం అంటే.. అయితే క్రికెట్‌ లేదంటే సినిమా అంటుంది అధికశాతం యువతరం. ఇక ప్రపంచ కప్‌ క్రికెట్‌ ముగిసింది కాబట్టి కొన్నాళ్లవరకూ వినోదాల ఆస్వాదనకి సినిమానే ప్రత్యామ్నాయం కానుంది. అందుకు తగ్గట్టుగానే పలు నిర్మాణ సంస్థలు అక్కడ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంటే ఇటు విడుదల తేదీల్ని ప్రకటించేశాయి. దీన్నిబట్టి చిత్రసీమ కొత్త చిత్రాల విడుదల కోసం ఎలా సన్నద్ధమవుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇదివరకే విడుదల తేదీల్ని ఖరారు చేసిన సినిమా బృందాలు ఇక ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచనున్నాయి. క్రికెట్‌ మ్యాచ్‌ల దృష్ట్యానే ఈ నెల 24కి వాయిదా పడిన ‘ఆదికేశవ’ ప్రచార కార్యక్రమాలు సోమవారం నుంచి ఊపందుకుంటున్నాయి. వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందిన చిత్రమిది. శ్రీకాంత్‌, శివానీ రాజశేఖర్‌, రాహుల్‌ విజయ్‌ ప్రధాన పాత్రధారులుగా జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందిన ‘కోట బొమ్మాళి పీఎస్‌’ సెన్సార్‌ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని ఈ నెల 24న విడుదలకి సిద్ధమైంది.

లాస్ట్‌ పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరప్పా... అనే త్రివిక్రమ్‌ సంభాషణలాగే ఆఖరి నెలలో పంచ్‌ వేసేందుకు పలు తెలుగు చిత్రాలు సిద్ధమయ్యాయి. డిసెంబరులో క్రిస్మస్‌ సమయంలో ఒకట్రెండు సినిమాలు తప్ప, విడుదలల హంగామా ఇదివరకు ఉండేది కాదు. కానీ ఈసారి డిసెంబరులోనే పలు కీలకమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. 7న నాని ‘హాయ్‌ నాన్న’ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. 8న విడుదల ఖరారు చేసుకున్న సినిమాలు 3. వరుణ్‌తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలంటైన్‌’ ఒకటి కాగా, విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ మరొకటి. నితిన్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీమేన్‌’ మూడవది. ఈ మూడు సినిమాలూ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకొచ్చాయంటే థియేటర్ల దగ్గర సందడి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ వీటిలో ఒకట్రెండు సినిమాలు వాయిదా పడొచ్చనే అనుమానాలున్నా ప్రేక్షకులు మాత్రం వాటి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


మూడో వారం మోతే!

ఇక డిసెంబరు మూడో వారం నుంచి ప్రభాస్‌ ‘సలార్‌’ జోరు కొనసాగనుంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘సలార్‌’ డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. డిసెంబరు 1న ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రాల్లో ఇదొకటి. ప్రముఖ హీరోల  సినిమాలతోపాటు... పరిమిత వ్యయంతో రూపొందిన సినిమాల జోరు కూడా కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్‌ చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి. రణ్‌బీర్‌కపూర్‌ ‘యానిమల్‌’ సినిమాతో డిసెంబరు 1న సందడి చేయనున్నారు. తెలుగు దర్శకుడు సందీప్‌ వంగా తెరకెక్కించిన చిత్రమిది. ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. షారుక్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ‘డంకీ’ అదే నెల 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రభాస్‌, రణ్‌బీర్‌, షారుక్‌ తదితర అగ్ర కథానాయకుల చిత్రాలు ఒకే నెలలో ప్రేక్షకుల ముందుకొస్తుండడంతో థియేటర్లలో భారీ స్థాయిలో హంగామా కనిపించే అవకాశాలున్నాయి. బలమైన అభిమానగణాన్ని సొంతం చేసుకున్న హీరోలు కావడంతో వసూళ్లు హోరెత్తనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని