Telugu Movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

telugu movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

Updated : 03 Apr 2023 18:49 IST


Telugu movies: వేసవి సందడి మొదలైంది. ప్రేక్షకులను అలరించడానికి వరుసగా సినిమాలు రాబోతున్నాయి. మరి ఏప్రిల్‌ మొదటి వారంలో అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేద్దామా!

మరో విభిన్న ప్రయత్నంతో..

ఏటా ఒకట్రెండు సినిమాలతో కచ్చితంగా అలరిస్తుంటారు మాస్‌ హీరో రవితేజ. ఈ ఏడాది చిరంజీవితో కలిసి ఆయన నటించిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఓ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం ‘రావణాసుర’ (Ravanasura). అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాశ్‌, దక్షా నగర్కర్‌ కథానాయికలు. సుశాంత్‌ కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 7న థియేటర్‌లలో విడుదల కానుంది.


మీటర్‌ మేటరేంటి?

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్న యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అంటూ ప్రేక్షకుల పలకరించిన ఆయన ఇప్పుడు ‘మీటర్‌’ (Meter) తో వస్తున్నారు. పోలీస్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది తెరకెక్కింది. రమేశ్‌ కాడూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతుల్య రవి కథానాయిక. ఈ సినిమా కూడా ఏప్రిల్‌ 7న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


స్వాత్రంత్యం వచ్చిన తర్వాత ఏం జరిగింది?

దేశభక్తి నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ఆర్‌.మురుగదాస్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఆగస్టు 16, 1947’. ఎన్‌.ఎస్‌ పొన్‌కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం రాగా, ఆ మరుసటి రోజు ఏం జరిగింది? అన్న ఇతి వృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. గౌతమ్‌ కార్తిక్‌, రిచర్డ్‌ ఆస్టన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏప్రిల్‌ 7న ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.


ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/వెబ్‌సిరీస్

హారర్‌ కామెడీ మూవీ ‘రోమాంచమ్‌’

జితు మాధవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘రోమాంచమ్‌’ (romancham). ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులోకి రానుంది.


సినిమా తారల జీవిత కథతో.. ‘జూబ్లీ’

అదితిరావు హైదరీ కీలక పాత్రలో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘జూబ్లీ’ (Jubilee). ప్రసేన్‌జిత్‌ ఛటర్జీ, అపరశక్తి ఖురానా, సిద్ధాంత్‌ గుప్త, వామికా గబ్బి కీలక పాత్ర పోషిస్తున్నారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ సిరీస్‌కు విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న జూబ్లీ ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. సినీ పరిశ్రమ స్వర్ణయుగాన్ని చూసిన రోజుల్లో కొందరు నటీనటుల మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది.


నెట్‌ఫ్లిక్స్‌

  • బీఫ్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 6
  • ఇన్‌ రియల్‌ లవ్‌ (టీవీ షో) ఏప్రిల్‌ 6
  • చుపా (హాలీవుడ్) ఏప్రిల్‌ 7
  • హంగర్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌8

జీ5

  • అయోథి (తమిళం) ఏప్రిల్‌ 7

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

  • ది క్రాసోవర్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 4

బుక్‌ మై షో

  • బ్యాట్‌మ్యాన్‌ (హాలీవుడ్‌) ఏప్రిల్‌ 5
  • కాస్మోస్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌ 7

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని