ఓటీటీలోకి ‘తండేల్‌’

Eenadu icon
By Entertainment Team Updated : 02 Mar 2025 16:21 IST
Ee
Font size
  • A
  • A+
  • A++
2 min read

హైదరాబాద్‌: నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటించిన రీసెంట్‌ రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘తండేల్‌’ (Thandel). శ్రీకాకుళం జిల్లా డి. మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు వేటకు వెళ్లి, పాకిస్థాన్‌ కోస్ట్‌ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. చందూ మొండేటి దర్శకుడు. సాయిపల్లవి కథానాయిక. ఫిబ్రవరి 7న విడుదలైన ఈచిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి నాగచైతన్య కెరీర్‌లోనే మంచి కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. మార్చి 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించనుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ ఎక్స్‌ వేదికగా తెలియజేసింది.

కథేంటంటే: సముద్రంలోకి చేపల వేటకి వెళ్లిన తోటి మ‌త్స్యకారులంద‌రినీ ముందుకు న‌డిపించే నాయ‌కుడి పేరే తండేల్‌. త‌న తండ్రి తండేల్ కావ‌డంతో చిన్న‌నాటి నుంచే ఆయ‌న ద‌గ్గ‌ర్నుంచి నాయ‌కుడు ఎలా ఉండాలో నేర్చుకుంటాడు రాజు (నాగ‌చైత‌న్య‌). అలా పెద్ద‌య్యాక రాజు కూడా అంద‌రి క‌ష్టాల్ని విని వాళ్ల‌కోసం నిల‌బ‌డ‌టంతో అంద‌రూ అతడిని తండేల్‌గా ఎంచుకుంటారు. రాజుకి చిన్న‌నాటి స్నేహితురాలైన స‌త్య (సాయిప‌ల్ల‌వి) అంటే ప్రాణం. రాజు అంటే స‌త్యకి కూడా చెప్ప‌లేనంత ప్రేమ‌. ఏడాదిలో తొమ్మిది నెల‌లు స‌ముద్రంలో వేట‌తోనే గ‌డిపే రాజు ఎప్పుడెప్పుడు తిరిగొస్తాడా? అని ఎదురు చూస్తూ గ‌డుపుతుంటుంది. ఈసారి వేట‌కి వెళ్లొచ్చాక పెళ్లి చేసుకోవాల‌నే నిర్ణ‌యానికొస్తారు. అలా సముద్రంలోకి వెళ్లాక తుపాను క‌ల్లోలం సృష్టిస్తుంది. పాకిస్థాన్‌ జ‌లాల్లోకి వెళ్లిన రాజు ప‌డ‌వని, అందులోని మ‌త్స్యకారుల్ని అక్క‌డి అధికారులు బందీలుగా చేసి జైల్లో వేస్తారు. అప్పుడు రాజు కోసం స‌త్య ఏం చేసింది? సొంతూరు శ్రీకాకుళం జిల్లాలోని మ‌త్స్య‌లేశం నుంచి పాకిస్థాన్‌ స‌రిహ‌ద్దుల వ‌ర‌కూ వెళ్లిన ఆమె రాజుని, ఇత‌ర మ‌త్స్య‌కారుల్ని విడిపించిందా? రాజు, స‌త్య క‌లుసుకున్నారా? తదితర అంశాలతో ఈ సినిమా రూపొందింది.

Published : 02 Mar 2025 16:11 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

లైవ్ టీవీ