OTT: ఇంకా ఓటీటీలోకి రాని సినిమాలివే.. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు?

ఈ ఏడాది థియేటర్లలో విడుదలై, ఇప్పటి వరకూ ఓటీటీలోకి రాని సినిమాల జాబితా ఇది.

Updated : 29 Nov 2022 12:57 IST

ఏదైనా సినిమా థియేటర్లలో విడుదలకావడమే ఆలస్యం.. ‘ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది?’ అంటూ కొందరు ఆరా తీస్తుంటారు. ఓటీటీలోకి వచ్చిన వెంటనే చూసేస్తారు. కొందరు థియేటర్లలో చూసినా, ఓటీటీలోనూ ఆస్వాదిస్తారు. మీరూ అంతేనా? ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో కొన్ని ఇప్పటికీ రాలేదు. మరి, మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు?

జిన్నాకల ఇది..

ఈ దీపావళి కానుకగా (అక్టోబరు 21న) థియేటర్లలో విడుదలై, సందడి చేసిన చిత్రాల్లో ‘జిన్నా’ (Ginna) ఒకటి. మంచు విష్ణు (Vishnu Manchu) హీరోగా ఇషాన్‌ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. టెంట్‌ హౌస్‌ పెట్టుకున్న వ్యక్తి సర్పంచ్‌గా మారాలనుకున్న క్రమంలో ఎవరెవరిని మోసం చేశాడు? ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నాడు? అతని కల నెరవేరిందా, లేదా? అన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోనీ కథానాయికలు.


డబ్బింగ్‌.. లైకింగ్‌

తెలుగు ఆడియో అందుబాటులో ఉండటంతో డబ్బింగ్‌ సినిమాలపైనా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటోంది. ఇతర భాషల్లో పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకొన్న సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడొస్తాయా? అని వేచి చూస్తున్నారు. వాటిల్లో ‘ది లెజెండ్‌’ (The Legend) ముందుంటుంది. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తమిళంలో రూపొందిన సినిమా ఇది. విదేశాల్లో చదువుకున్న ఓ యువకుడు మాతృభూమిపై ప్రేమతో తన స్వగ్రామానికి చేరుకుంటాడు. ఆయనకు అక్కడ ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనే థీమ్‌తో జేడీ- జెర్రీ దర్శకత్వం వహించారు. స్వీయ నిర్మాణంలో ప్రముఖ వ్యాపారవేత్త లెజెండ్‌ శరవణన్‌ (Saravanan Arul) హీరోగా నటించారు. ఈ సినిమా ‘డిస్నీ+హాట్‌స్టార్‌’లో త్వరలోనే స్ట్రీమింగ్‌ అవుతుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇంకా దీనిపై అధికారిక ప్రకటనరాలేదు. ఈ వరుసలో  ‘రామ్‌సేతు’,‘థ్యాంక్‌ గాడ్‌’ తదితర హిందీ సినిమాలున్నాయి.


సమస్యలు అధిగమించిన శేఖర్‌

రాజశేఖర్‌ హీరోగా ఆయన సతీమణి జీవిత తెరకెక్కించిన చిత్రం ‘శేఖర్‌’. మలయాళంలో విజయం అందుకున్న ‘జోసెఫ్‌’ సినిమాకి రీమేక్‌గా రూపొందడం, రాజశేఖర్‌ లుక్స్‌, ప్రచార చిత్రాలు విభిన్నంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపారు. థియేటర్లలో విడుదవుతుందా? నేరుగా ఓటీటీలోకే వస్తుందా? అనుకున్న ఈ సినిమా మే 20న థియేటర్లలో రిలీజైంది. కానీ, రెండు రోజుల్లోనే సమస్యల్లో చిక్కుకుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో దర్శకురాలతో తనకు విబేధాలు తలెత్తడంతో ఓ ఫైనాన్షియర్‌ కోర్టును ఆశ్రయించగా.. చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలంటూ తొలుత ఆదేశాలు జారీ చేసింది. మరికొన్ని వాదనల అనంతరం సినిమా ప్రదర్శనకు అనుమతినిచ్చింది. ఇప్పటివరకూ ఈ సినిమా ఓటీటీ విడుదల ఖరారుకాకపోవడం గమనార్హం.


థియేటర్లలో ఇవే ఫస్ట్‌.. కానీ..

2019 నవంబరు 26న హైదరాబాద్‌ నగరశివారులో జరిగిన గ్యాంగ్‌రేప్‌, హత్య ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ఆశ ఎన్‌కౌంటర్‌’. ఆనంద్‌ చంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్‌గోపాల్‌ వర్మ సమర్పించారు. కొన్నాళ్ల విరామం అనంతరం వరుణ్‌ సందేశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఇందువదన’. హారర్‌ కామెడీ నేపథ్యంలో ఎం. శ్రీనివాస రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాలు జనవరి 1న థియేటర్లలో విడుదలయ్యాయి. ఇప్పటి వరకూ వీటి ఓటీటీ విడుదలపై సమాచారం లేదు.


ఇటు బయోపిక్‌.. అటు రొమాంటిక్‌

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన పొలిటికల్‌ బయోపిక్‌ ‘కొండా’. కొండా మురళీ జీవితాధారంగా తెరెకెక్కిన ఈ సినిమా జూన్‌ 23న థియేటర్లలో విడుదలైంది. ఇందులో అదిత్‌ అరుణ్‌, ఇర్రా మోర్‌ ప్రధాన పాత్రధారులు. ఓటీటీలోకి రాలేదు. జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సదా నన్ను నడిపే’ చిత్రం ఓటీటీ రిలీజ్‌ ఖరారుకాలేదు. స్వీయ దర్శకత్వంలో లంక ప్రతీక్‌ ప్రేమ్‌ కరణ్‌ హీరోగా నటించిన రొమాటింక్‌ కామెడీ చిత్రమిది. వైష్ణవి కథానాయిక.


క్రేజీగా.. బాయ్‌ ఫ్రెండ్ ఫర్‌ హైర్‌

యూత్‌ ఆడియెన్స్‌ లక్ష్యంగా, విభిన్న కథాంశంతో దర్శకుడు సంతోశ్‌ కంభంపాటి తెరకెక్కించిన చిత్రం ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’. విశ్వంత్, మాళవిక నాయకా నాయికలు. అక్టోబరు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా త్వరలోనే ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో రిలీజ్‌కానుందనే వార్తలొస్తున్నాయి. అధికారిక ప్రకటన వెలువడలేదు. అదే రోజు విడుదలైన ఆది సాయికుమార్‌ ‘క్రేజీ ఫెలో’ సినిమా కూడా ఓటీటీలోకి రాలేదు. సీనియర్‌ నటులు రాజేంద్రప్రసాద్‌, నరసింహరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ‘అనుకోని ప్రయాణం’ అక్టోబరు 28న థియేటర్ల వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. వెంకటేశ్‌ పెద్దిరెడ్ల తెరకెక్కించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ ఫిక్స్‌ కాలేదు.


నవంబరు చిత్రాలపైనా..

ఎప్పుడో విడుదలైన సినిమాలపైకాదు నవంబరు తొలి, రెండో వారంలో రిలీజ్‌ అయినవి ఓటీటీలోకి ఎప్పుడొస్తాయా? అని చాలామంది ఎదురు చూస్తున్నారు. వాటిల్లో సంతోష్‌ శోభన్‌ హీరోగా వచ్చిన ‘లైక్‌, షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’, అల్లు శిరీష్‌ ‘ఊర్వశివో రాక్షసివో’, సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘యశోద’ చిత్రాలున్నాయి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని