Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్‌ తేజ్‌ అలా.. ‘టిల్లు’ ఇలా!

మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే?

Updated : 28 Feb 2024 10:11 IST

ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చిలో ఆ వేడి నుంచి ఉపశమనం కలిగించి, వినోదం పంచేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. నేరుగా ఓటీటీలోనూ కొన్ని చిత్రాలు విడుదల కానున్నాయి. ఆ మూవీస్‌ ఏవి? ఏయే రోజుల్లో రానున్నాయో చూద్దాం..

వరుణ్‌ తేజ్‌.. ఆపరేషన్‌!

కెరీర్‌ ప్రారంభం నుంచీ వైవిధ్య కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు వరుణ్‌ తేజ్‌ (Varun Tej). ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ నేపథ్యంలో ఆయన నటించిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) కథానాయిక. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకుడు. పుల్వామా దాడి ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీతోనే వరుణ్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మార్చి 1న (Operation Valentine Release Date) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇటు చారి.. అటు భాస్కర్‌ నారాయణ

శివ కందుకూరి (Shiva Kandukuri), రాశీసింగ్‌ (Rashi Singh) జంటగా నటించిన చిత్రం ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ (Bhoothaddam Bhaskar Narayana). పురుషోత్తం రాజ్‌ దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో సాగే డిటెక్టివ్‌ కథ ఇది. వెన్నెల కిశోర్‌ (Vennela Kishore) ప్రధాన పాత్రలో టీజీ కీర్తికుమార్‌ తెరకెక్కించిన సినిమా ‘చారి 111’ (Chaari 111). సంయుక్త విశ్వనాథన్‌ హీరోయిన్‌. ఈ రెండు చిత్రాలు మార్చి 1న విడుదల కానున్నాయి.


పండక్కి పసందైన వినోదం..

గోపీచంద్‌ (Gopichand) నటించిన ఫాంటసీ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘భీమా’ (Bhimaa). ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లు. పరశురాముడి క్షేత్రం కోసం బ్రహ్మరాక్షసుడిలాంటి ఓ పోలీసు చేసిన దుష్ట సంహారమే ఈ చిత్ర కథాంశంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. శివరాత్రిని పురస్కరించుకుని మార్చి 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) నటించిన ‘గామి’ (Gaami) ఇదే రోజున రిలీజ్‌ కానుంది. ఈయన ప్రధాన పాత్రలో దర్శకుడు విద్యాధర్‌ కాగిత తెరకెక్కించిన చిత్రమిది. చాందినీ చౌదరి కథానాయిక. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌, మాధవన్‌, జ్యోతిక ప్రధాన పాత్రల్లో వికాస్‌ భల్‌ తెరకెక్కించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘షైతాన్‌’ కూడా మార్చి 8న విడుదల కానుంది.


తంత్రతో అనన్య.. లైన్‌మ్యాన్‌గా త్రిగుణ్‌

అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రధాన పాత్రలో నటించిన హారర్‌ చిత్రం ‘తంత్ర’ (Tantra). శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకుడు. మార్చి 15న సినిమా విడుదల కానుంది. అదే రోజున ‘లైన్‌మ్యాన్‌’ కూడా రానుంది. త్రిగుణ్‌ హీరోగా దర్శకుడు వి. రఘుశాస్త్రి తెరకెక్కించిన చిత్రమిది (Lineman). కాజల్‌ కుందెర్‌ కథానాయిక. బాలీవుడ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా, రాశీఖన్నా జంటగా సాగర్‌ అంబ్రే, పుష్కర్‌ ఓఝా సంయుక్తంగా తెరకెక్కించిన ‘యోధ’ అదే రోజు రిలీజ్‌ అవుతుంది.


నో లాజిక్‌.. ఓన్లీ మ్యాజిక్‌

‘బ్రోచేవారెవరురా’లో తమ కామెడీతో గిలిగింతలు పెట్టిన శ్రీవిష్ణు (Sree Vishnu), రాహుల్‌ రామకృష్ణ (Rahul Ramakrishna), ప్రియదర్శి (Priyadarshi) మరోసారి నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు. ఈ ముగ్గురు ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్‌ బుష్‌’ (Om Bheem Bush) మార్చి 22న విడుదల కానుంది. నో లాజిక్‌.. ఓన్లీ మ్యాజిక్‌ ట్యాగ్‌లైన్‌తో దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కించారు. అల్లరి నరేశ్‌ (Allari Naresh), ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం తెరకెక్కించిన హాస్య భరిత చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku), హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రల్లో విక్రమ్ రెడ్డి రూపొందించిన ‘రోటి కపడా రొమాన్స్‌’ (Roti Kapda Romace), విశ్వ కార్తీక్‌, ఆయూషి పటేల్‌ జంటగా రమాకాంత్‌ రెడ్డి తెరకెక్కించిన ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanamlo) సినిమాలు అదే రోజున రిలీజ్‌ కానున్నాయి.


మరోసారి మోత మోగించిందేందుకు..

‘డీజే టిల్లు’ (DJ Tillu)గా యువతలో విశేష క్రేజ్‌ సంపాదించుకున్నారు యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda). విమల్‌ కృష్ణ తెరకెక్కించిన డీజే టిల్లుకు సీక్వెల్‌గా రూపొందిన ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కొత్త సినిమాకి మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించారు. తొలి భాగంలో నేహాశెట్టి హీరోయిన్‌కాగా పార్ట్‌ 2లో అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) సందడి చేయనున్నారు. ‘ది క్రూ’తో అలరించేందుకు బాలీవుడ్‌ తారలు కరీనా కపూర్‌, టబు, కృతిసనన్‌ సిద్ధమయ్యారు. రాజేశ్‌ కృష్ణన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా అదే తేదీన రానుంది.


నేరుగా ఓటీటీలో రిలీజ్‌ కానున్న చిత్రాలు..

‘గురు’ ఫేమ్ రితికా సింగ్ (Ritika Singh) ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన హారర్‌ మూవీ ‘వ‌ళ‌రి’ (Valari). శ్రీరామ్‌ కీలక పాత్రధారి. మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. సారా అలీఖాన్‌ (Sara Ali khan) ప్రధాన పాత్రలో దర్శకుడు కణ్ణన్‌ అయ్యర్‌ రూపొందించిన సినిమా ‘ఏ వతన్‌ మేరే వతన్‌’  (Ae Watan Mere Watan). ఇమ్రాన్‌ హష్మి, సచిన్‌ ఖేడ్కర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా నేరుగా ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో మార్చి 21న విడుదల కానుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని