Operation Valentine: ఓటమే చవిచూడని రణ విజేతరా ఇతడూ

మన కంటికి రెప్ప ఎలాగో... దేశ రక్షణలో  త్రివిధ దళాలూ అంతే. శత్రువు ఎటువైపు నుంచి వచ్చినా కాచుకుంటూ  అలుపెరగని పోరాటం చేస్తుంటాయి.  గుండెలనిండా దేశభక్తిని... అణువణువునా మాతృభూమిపై మమకారాన్నీ నింపుకుని సరిహద్దుల్లో నిత్యం  కాపలా కాస్తుంటాయి. మన దళాల త్యాగాలు అనన్య సామాన్యమైనవి. ఆ పోరాట స్ఫూర్తి వర్ణనకు అందనిది.

Updated : 27 Jan 2024 11:24 IST

చిత్రం: ఆపరేషన్‌ వాలెంటైన్‌
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
గానం: కునాల్‌ కుందు

న కంటికి రెప్ప ఎలాగో... దేశ రక్షణలో  త్రివిధ దళాలూ అంతే. శత్రువు ఎటువైపు నుంచి వచ్చినా కాచుకుంటూ  అలుపెరగని పోరాటం చేస్తుంటాయి.  గుండెలనిండా దేశభక్తిని... అణువణువునా మాతృభూమిపై మమకారాన్నీ నింపుకుని సరిహద్దుల్లో నిత్యం  కాపలా కాస్తుంటాయి. మన దళాల త్యాగాలు అనన్య సామాన్యమైనవి. ఆ పోరాట స్ఫూర్తి వర్ణనకు అందనిది. సినీ రూపకర్తలు కుదిరినప్పుడల్లా సైనికుల త్యాగాలు... వారి పోరాట స్ఫూర్తి ప్రధానంగా  సినిమాల్ని రూపొందిస్తూ దేశభక్తిని చాటుతుంటారు. అయితే సైనిక దళం నేపథ్యంలో వచ్చినన్ని కథలు... నావికాదళం, వైమానిక దళం నేపథ్యంలో రాలేదు. ఈ మధ్యే సినీ రూపకర్తలు ఆ దళాలపైనా దృష్టిపెడుతూ చిత్రాల్ని తెరకెక్కిస్తుంటారు.  నావికాదళం నేపథ్యంలో ఇదివరకు వచ్చిన ‘ఘాజీ’ ప్రేక్షకుల్ని అలరించింది.  వైమానిక దళం నేపథ్యంలో  ఇటీవలే బాలీవుడ్‌లో  తెరకెక్కిన ‘ఫైటర్‌’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అదే  నేపథ్యంలోనే వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా తెలుగు,  హిందీ భాషల్లో ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ తెరకెక్కింది. ఇందులో వరుణ్‌తేజ్‌ వైమానిక దళంలో పనిచేసే  ఫైటర్‌ పైలట్‌గా నటించారు. ఫిబ్రవరి 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని వందేమాతరం పాటని విడుదల చేశారు. దేశభక్తిని, కథానాయకుడి వీరత్వాన్ని చాటి చెప్పే ఈ పాట మార్మోగుతోంది.

యుద్ధ రంగంలో సైనికుడి ప్రతాపాన్ని మండే సూర్యుడితో పోలుస్తూ... ‘‘చూడరా సంగ్రామ శూరుడు మండెరా మధ్యాహ్న సూర్యుడు’ అంటూ మొదలుపెట్టారు రచయిత రామజోగయ్య శాస్త్రి. సైనికుడు కదనరంగంలోకి దిగాక ప్రాణాల్ని లెక్క చేయడు. గగనతలంలో ఫైటర్‌ పైలట్లు  శత్రువులపై నిప్పుల వర్షం కురిపిస్తూ పోరాటం కొనసాగిస్తుంటారనే విషయాన్ని ‘చావునే చండాడు ధీరుడు... నిప్పులు కురిసాడు’ అంటూ ఈ పాటలో వర్ణించారు. కథానాయకుడి పౌరుషం, ప్రతాపాన్ని చాటి చెప్పడంతోపాటు... గగన తలాన నలుదిక్కులా సాగిన అతడి పోరాటం చూసి ఆ నింగి కూడా సాహో అంటూ నేలకి దిగాల్సిందే అని, తుపానులాంటి ఆ దూకుడుకి, వీరావేశానికి శత్రువు ధైర్యం కరిగే మంచులా నీరుగారి పోవల్సిందే అనే భావాన్ని వ్యక్తం చేస్తూ ఈ పాట సాగుతుంది. గెలుపే ధ్యేయం, కర్తవ్యం అయినప్పుడు... ఓటమి చవి చూడని రణవిజేతగా నిలుస్తాడని ఈ పాట చాటింది. మధ్యమధ్యలో వందేమాతరం పంక్తులు పాటకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.  


చూడరా సంగ్రామ శూరుడు
మండెరా మధ్యాహ్న సూర్యుడు
చావునే చండాడు ధీరుడు
నిప్పులు కురిసాడు
రక్తాన వేడి లావాలు పొంగే
ఇతడి ప్రతాపం దిక్కుల్ని తగిలే
సాహో తలొంచి ఆ నీలి నింగే
ఇలపై ఒరిగే హో
వందేమాతరం
వందేమాతరం
వందేమాతరం
ఎగసే ఎగసే తూఫానై
రేగుతున్నది వీరావేశం
కరిగే మంచై నీరల్లే
జారిపోయే శత్రువు ధైర్యం
గెలుపే గెలుపే ధ్యేయంగా
ఉద్యమించి కదిలే కర్తవ్యం
సుజలాం సుఫలాం
మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం వందే
సుజలాం సుఫలాం
మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం
వందే వందే వందే వందే వందే
।। రక్తాన వేడి...।।
చూడరా సంగ్రామ శూరుడు
మండెరా మధ్యాహ్న సూర్యుడు
ఓటమే చవిచూడని
రణ విజేతరా ఇతడూ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని